T20 World Cup 2022: భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు
ABN , First Publish Date - 2022-10-20T22:46:53+05:30 IST
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup 2022)లో భాగంగా ఈ ఆదివారం (23న) భారత్-పాకిస్థాన్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup 2022)లో భాగంగా ఈ ఆదివారం (23న) భారత్-పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. ఆసియాకప్‌లో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. ఆ తర్వాత మళ్లీ తలపడడం ఇదే తొలిసారి. చిరకాల ప్రత్యర్థులు తలపడే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఇది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే, ఆ రోజు వర్షం పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ జరిగే మెల్‌బోర్న్‌లో ఆ రోజు వర్షం కురిసే అవకాశాలు 80 శాతం ఉన్నాయని పేర్కొంది. అలాగే, గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. భారత్-పాక్ మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్‌ను వీక్షించాలని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలపై నీళ్లు కుమ్మరించేందుకు వరుణుడు కాసుక్కూర్చున్నాడు.
సూపర్-12లో భాగంగా శనివారం ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరిగే అరంభ మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. సిడ్నీలో జరిగే ఈ మ్యాచ్‌ను కూడా వరుణుడు తుడిచిపెట్టేసే అవకాశాలున్నాయి. శనివారం సిడ్నీలో వర్షం కురిసే అవకాశాలు 90 శాతం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వర్షం పడే సూచనలు అధికంగా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, గరిష్ఠంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో గాలుల వీచే అవకాశం ఉందని వివరించింది.
గతేడాది దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్‌లో భారత్‌పై వన్డేల్లో కానీ, టీ20ల్లో కానీ పాకిస్థాన్ విజయం సాధించడం ఇదే తొలిసారి. గత ప్రపంచకప్ సమయంలో భారత జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈసారి మాత్రం రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగుతోంది. అలాగే, ఇంగ్లండ్, వెస్టిండీస్, జింబాబ్వే, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత జట్టు విజయాలు సాధించి ఊపుమీద ఉంది. ఇటీవల జరిగిన ఆసియాకప్‌లో రన్నరప్‌గా నిలిచిన పాకిస్థాన్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో 3-4 తేడాతో ఓటమి పాలైంది.