విండీస్‌తో చివరి వన్డే: 265 పరుగులకు భారత్ ఆలౌట్
ABN , First Publish Date - 2022-02-11T23:09:31+05:30 IST
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఇక్కడి నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న..

అహ్మదాబాద్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఇక్కడి నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న చివరి వన్డేలో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు 42 పరుగులకే రోహిత్ శర్మ (13), విరాట్ కోహ్లీ (0), శిఖర్ ధవన్ (10) వంటి కీలక ఆటగాళ్లను కోల్పోయింది.
ఈ దశలో క్రీజలోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ జట్టును అద్భుతంగా ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి జట్టును గాడిలో పెట్టారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ పెవిలియన్ చేరగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తడబడ్డాడు. ఆరు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. 111 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 80 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ హేడెన్ వాల్ష్కు దొరికిపోయాడు.
వాషింగ్టన్ సుందర్ (33), దీపక్ చాహర్ (38) క్రీజులో కాసేపు నిలబడ్డారు. ఉన్నంత సేపు దూకుడగా ఆడడంతో జట్టు స్కోరు 250 పరుగులు దాటింది. ఇన్నింగ్స్ చివరి బంతికి మహ్మద్ సిరాజ్ (4) అవుట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ 265 పరుగుల వద్ద ముగిసింది.
విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 4 వికెట్లు పడగొట్టగా, అల్జారీ జోసెఫ్, హేడెన్ వాల్ష్ చెరో రెండు వికెట్లు, ఒడియన్ స్మిత్, ఫాబియన్ అలెన్ చెరో వికెట్ తీసుకున్నారు.