హైదరాబాద్‌లో మల్టీ బ్రాండెడ్‌ క్రికెట్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2022-03-05T09:38:53+05:30 IST

ఆసియాలోనే అతిపెద్ద మల్టీ బ్రాండెడ్‌ క్రికెట్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 63లో ఏర్పాటు చేసిన ‘క్రిక్‌ఫ్యూజ్‌’ అవుట్‌లెట్‌ను టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

హైదరాబాద్‌లో   మల్టీ బ్రాండెడ్‌  క్రికెట్‌ సెంటర్‌

బ్యాట్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): ఆసియాలోనే అతిపెద్ద మల్టీ బ్రాండెడ్‌ క్రికెట్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 63లో ఏర్పాటు చేసిన ‘క్రిక్‌ఫ్యూజ్‌’ అవుట్‌లెట్‌ను టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బ్యాట్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. క్రికెట్‌ ఉత్పత్తుల విక్రయ వ్యాపారంలో అపార అనుభవమున్న ‘క్రిక్‌ఫ్యూజ్‌’  నగరవాసులకు అందుబాటులోకి రావడం పట్ల రేవంత్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని కష్టపడుతున్న ప్రొఫెషనల్స్‌ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన క్రిక్‌ఫ్యూజ్‌ను తప్పనిసరిగా సందర్శించాల్సిన అవసరముందని అన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత క్రీడాకారులపై ఉందని రేవంత్‌రెడ్డి చెప్పారు.


తెలుగు రాష్ట్రాల్లో ఇదే  ప్రథమం..

 ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్రాండ్‌లకు చెందిన క్రికెట్‌ ఉత్పత్తులను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలన్న తలంపుతో ప్రారంభించామని, తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలి మల్టీబ్రాండెడ్‌ క్రికెట్‌ యాక్సెసరీస్‌ కేంద్రమని ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, క్రిక్‌ఫ్యూజ్‌ ఎండీ వేమూరి ఆదిత్య చెప్పారు. ప్లేయర్‌ కోరుకున్న ఉత్పత్తులను సకాలంలోనే అందిస్తామని అన్నారు. కాగా, ప్రత్యేకంగా బ్యాట్లను తయారు చేయించుకోవడానికి తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు ఇక మీదట జలంధర్‌, మీరట్‌ వెళ్లాల్సిన పని లేదని.. వారికి కావాల్సిన విధంగా హైదరాబాద్‌ లోనే తయారు చేసి ఇస్తామని క్రిక్‌ఫ్యూజ్‌ ఐటీ అండ్‌ ఫ్రాంచైజీ రిలేషన్స్‌ డైరెక్టర్‌ విన్నకోట అనంత్‌, సీఈఓ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) శైలేష్‌ నారాయణ్‌ తెలిపారు.


ఇక్కడ వివిధ అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన బ్యాట్లు, బంతులు, ప్యాడ్లు, గ్లౌజులు, గ్లాసెస్‌, కిట్‌ బ్యాగ్‌లతో పాటు క్రికెట్‌కు సంబంధించిన అన్ని ఉత్పత్తులు లభిస్తాయని చెప్పారు. అలాగే వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) సదుపాయం కూడా ఈ సెంటర్‌లో ఉందన్నారు. వీఆర్‌ టెక్నాలజీ అనేది పూర్తిగా కంప్యూటర్‌ ప్రోగామ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. వీఆర్‌ హెడ్‌సెట్‌ పెట్టుకోగానే కళ్లముందు ఒక ఊహాజనిత వాతావరణం సాక్షాత్కారమవుతుంది. ఇక్కడి వీఆర్‌ సెంటర్‌లోని గదిలో నిల్చొని మనం స్టేడియంలో క్రికెట్‌ ఆడుతున్న అనుభూతి పొందవచ్చు.

Read more