Formula racing: ప్రాక్టీస్ అదిరింది..
ABN , First Publish Date - 2022-11-20T02:56:23+05:30 IST
ఫార్ములా రేసింగ్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్) తొలి రోజు పోటీలు డ్రైవర్ల ప్రాక్టీసుతోనే ముగిశాయి. శనివారం సాయంత్రం 4 గంటల తర్వాత రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు జెండా ఊపి ప్రాక్టీస్ రేసును ప్రారంభించారు.
స్ప్రింట్-1 తొలి ల్యాప్ నేటికి వాయిదా
మొదటి రోజు టిక్కెట్లు కొన్నవారికి నిరాశ
అధికార యంత్రాంగం, ఈవెంట్ నిర్వాహకుల మధ్య సమన్వయ లోపం
కుంగిన వీఐపీ లాంజ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఫార్ములా రేసింగ్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్) తొలి రోజు పోటీలు డ్రైవర్ల ప్రాక్టీసుతోనే ముగిశాయి. శనివారం సాయంత్రం 4 గంటల తర్వాత రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు జెండా ఊపి ప్రాక్టీస్ రేసును ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం ప్రాక్టీస్, క్వాలిఫయింగ్ రేసులు, మధ్యాహ్నం స్ర్పింట్-1 తొలి ల్యాప్ జరగాల్సి ఉంది. అయితే, కొత్త ట్రాక్ కావడంతో రేసులో పాల్గొనే డ్రైవర్లకు ఈ సర్క్యూట్‌పై పెద్దగా అవగాహన లేకపోవడం.. రేసులో పాల్గొనే కార్లు నగరానికి ఆలస్యంగా చేరుకోవడం.. నిర్వహణ ఏర్పాట్లలో లోపాలు, ఈవెంట్ నిర్వాహకులు, అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపం వెరిసి ఇండియన్ రేసింగ్ లీగ్ తొలి రోజు పోటీలు గందరగోళం నడుమ ముగిశాయి.
ప్రాక్టీస్ రేసులు ముందెందుకు నిర్వహించలేదు?
కొత్త స్ట్రీట్ సర్క్యూట్ అయినందున ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేసి ప్రధాన పోటీలకు ముందుగా ఎందుకు ప్రాక్టీస్ రేసులు నిర్వహించలేదనే ప్రశ్నకు జవాబు లేదు. రేసుకు ముందు రోజు వరకు బారికేడ్లు, వాటికి కంచెలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. ట్రయల్ రన్, ప్రాక్టీస్ రేసులు ముగిశాక కూడా సర్క్యూట్‌పై డ్రైవర్లకు అంచనా రాకపోవడంతో స్ర్పింట్-1 రద్దు చేశారు.
టిక్కెట్లున్నా.. బారికేడ్ల బయటే..
రేసుకు గంట ముందు నుంచే ఎంట్రీలను నిలిపివేయడంతో ఎంతో ఆశతో టిక్కెట్లు కొన్న అభిమానులు బారికేడ్ల వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చింది. టిక్కెట్ల విక్రయం మొత్తం ఆన్‌లైన్‌లో జరిగింది. టిక్కెట్లపై రేసుకు గంట ముందే అభిమానులు గ్యాలరీల వద్దకు చేరుకోవాలని ముద్రించారు. అయితే, ఈ అంశాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేయకపోవడంతో టిక్కెట్లు కొనుకున్నా...మధ్యాహ్నం 2 గంటల తర్వాత వచ్చిన అభిమానులను లోనికి వెళ్లనివ్వలేదు.
కుంగిన వీఐపీ లాంజ్..
రేసింగ్‌లో పాల్గొంటున్న టీమ్‌ల కోసం ఐమాక్స్‌కు ఎడమ వైపు ఏర్పాటు చేసిన గ్యారేజ్ పైన వీఐపీ లాంజ్ ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. పెద్ద సంఖ్యలో వీఐపీలు రావడంతో ఆ లాంజ్ కిక్కిరిసిపోయింది. కుమారుడు హిమాన్షు ఇక్కడ నుంచే రేసును వీక్షిస్తుండడంతో కేటీఆర్ 4 గంటల సమయంలో వీఐపీ లాంజ్‌కు విచ్చేశా రు. కేటీఆర్ రావడంతో ఒక్కసారిగా అక్కడికి పెద్ద సం ఖ్యలో ఇతరులు చేరుకోవడంతో పెద్ద శబ్దంతో లాంజ్‌లోని మధ్య భాగం కిందకు కుంగింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడున్న వారందరిని కిందకు పంపించేశారు.
నేటి షెడ్యూల్
ఉదయం 9.20 గంటలకు క్వాలిఫయింగ్ రేసు-1
ఉదయం 9.40 గంటలకు క్వాలిఫయింగ్ రేసు-2
ఉదయం 11.10 గంటలకు రేసు (స్ర్పింట్)-1
మధ్యాహ్నం 2.30 గంటలకు రేసు (స్ర్పింట్)-2
మధ్యాహ్నం 3.50 గంటలకు రేసు (స్ర్పింట్)-3
సాయంత్రం 4.35 గంటలకు ముగింపు వేడుక