Virat Kohli : విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. చుట్టూ ప్రేమించేవాళ్లే ఉన్నా..
ABN , First Publish Date - 2022-08-19T00:30:42+05:30 IST
సూపర్‌స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన సారధ్యంలో టీమిండియా(Team India) అత్యున్నత స్థాయికి చేర్చే ప్రయత్నం చేశాడు.

ముంబై: సూపర్‌స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన సారధ్యంలో టీమిండియా(Team India) అత్యున్నత స్థాయికి చేర్చే ప్రయత్నం చేశాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ను కొంతకాలం నంబర్ 1 స్థానంలో నిలపడంలో తనవంతు సహకారం అందించాడు. దూకుడు స్వభావం, బ్యాటింగ్‌లో పరుగుల ప్రవాహంతో ‘కింగ్ కోహ్లీ’ అంటూ భారతీయ మీడియా నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అంతగొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న విరాట్ కోహ్లీ తన క్రికెట్ కెరియర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
తన క్రికెట్ కెరియర్ అంతటా మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని కోహ్లీ బయటపెట్టాడు. ఒత్తిడి ఎదుర్కొన్న అన్ని సందర్భాల్లోనూ మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడిందని వెల్లడించాడు. గది నిండా ప్రేమించేవాళ్లు, మద్ధతు పలికేవాళ్లే ఉన్నా.. ఒంటరిగా అనిపించేదని గుర్తుచేసుకున్నాడు. కష్టమే అయినప్పటికీ ఎప్పుడూ దృఢంగా ఉండేందుకు ప్రయత్నించేవాడినని, ఈ క్రమంలో కన్నీళ్లు కూడా వచ్చివుండొచ్చని చెప్పాడు. మానసిక ఒత్తిడి పరిస్థితులను స్వయంగా అనుభవించానని అన్నాడు. కాగా ఒత్తిడి నుంచి బయటపడడం, మన:స్థిరత్వాన్ని పొందే క్రమంలో అథ్లెట్లకు విశ్రాంతి అవసరమని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని అభిప్రాయపడ్డాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నాడు.
2014 ఇంగ్లండ్ పర్యటనలో పరుగుల చేయలేక ఒత్తిడిన ఎదుర్కొన్నానని కోహ్లీ వెల్లడించిన కొన్ని నెలల వ్యవధిలోనే తాజా వ్యాఖ్యలు గమనార్హం. పరుగులు చేయలేని సమయాల్లో ఉదయం నిద్రలేవడం అంత గొప్పగా అనిపించదని, ప్రపంచంలో తానొక్కడినే ఒంటరినని అనిపించేదని ఇంగ్లీష్ వ్యాఖ్యత మార్క్ నికోలస్‌కు ఫిబ్రవరిలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్‌లేమితో తెగ తంటాలు పడుతున్నాడు. కాగా 2021 టీ20 వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.