దేశం తరపున కెప్టెన్సీ గొప్ప గౌరవంగా భావిస్తున్నా: Rishabh Pant
ABN , First Publish Date - 2022-06-09T03:02:56+05:30 IST
స్వదేశంలో దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా కేఎల్ రాహుల్ సిరీస్‌కి దూరమవ్వడంతో పంత్‌కు

ముంబై : స్వదేశంలో దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా కేఎల్ రాహుల్ సిరీస్‌కి దూరమవ్వడంతో పంత్‌కు ఈ అవకాశం దక్కింది. అనూహ్యంగా కెప్టెన్సీ బాధ్యతలు దక్కడంపై రిషబ్ పంత్ హర్షం వ్యక్తం చేశాడు. సిరీస్ ప్రారంభానికి ముందు బుధవారం ప్రెస్మీట్లో మాట్లాడాడు. దేశం తరుపున ఓ జట్టుకు సారధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు పంత్ చెప్పాడు.
‘‘ చాలా గొప్పగా అనిపిస్తోంది. అనువైన పరిస్థితుల మధ్య ఈ అవకాశం రాకపోయినా సంతోషంగా ఉంది. టీమిండియాకి సారధ్యం వహించే అవకాశం కల్పించిన బీసీసీఐకి కృతజ్ఞతలు. విజయవంతంగా జట్టును నడిపించేందుకు నా శక్తిమేర ప్రయత్నిస్తాను. నా క్రికెట్ కెరీర్ ఒడిదుడుకుల్లో వెన్నెంటే ఉన్న నా శ్రేయోభిలాషలకు ధన్యవాదాలు. కెప్టెన్సీలో రాణించేందుకు ప్రయత్నిస్తాను. ప్రతిదినం నా కెరీర్‌ను మరింత మెరుగుపరచుకుంటాను’’ అని పంత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా సొంత మైదానంలో ఆడుతున్నప్పుడు నాయకత్వం వహించడం గొప్ప అనుభూతి అని వ్యాఖ్యానించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం తనకు ఎంతోగానో ఉపయోగపడుతుందని దీమా వ్యక్తం చేశాడు. రానున్న సిరీస్‌లో తప్పులను సరిదిద్దుకుని మరింత మెరుగ్గా రాణిస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్ స్థానంలో ఓపెనర్‌గా ఎవరోస్తారనేదానిపై జట్టు సభ్యులతో చర్చిస్తానన్నాడు.