కాంస్యాలతో సరిపెట్టారు
ABN , First Publish Date - 2022-08-10T05:55:36+05:30 IST
చెస్ ఒలింపియాడ్ టైటిల్‌ను దక్కించుకునే క్రమంలో భారతజట్లు తుదిమెట్టుపై బోల్తా పడ్డాయి.

చెన్నై (ఆంధ్రజ్యోతి): చెస్ ఒలింపియాడ్ టైటిల్‌ను దక్కించుకునే క్రమంలో భారతజట్లు తుదిమెట్టుపై బోల్తా పడ్డాయి. మంగళవారంతో ముగిసిన ఈ పోటీల్లో భారత జట్లు కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నాయి. పురుషుల్లో ఉజ్బెకిస్థాన్ 19 పాయింట్లతో, మహిళల్లో ఉక్రెయిన్ 18 పాయింట్లతో విజేతలుగా నిలిచాయి. భారత్ తొలిసారి ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో 180కి పైగా జట్లు పాల్గొన్నాయి. ఆతిథ్య దేశం కావడంతో ఒకటి కంటే ఎక్కువ జట్లను బరిలోకి దింపే అవకాశం లభించడంతో పురుషులు, మహిళల కేటగిరీల్లో భారత్ తరఫున ఆరు జట్లు పోటీపడ్డాయి. ఇందులో మహిళల విభాగంలో తెలుగు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి నేతృత్వంలోని భారత జట్టు 17 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకంతో మెరవగా, భారత్-2 టీమ్ 16 పాయింట్లతో 8వ స్థానంలో, భారత్-3 జట్టు 15 పాయింట్లతో 17వ స్థానంతో సరిపెట్టుకున్నాయి. పురుషుల్లో రమేష్ సారథ్యంలోని భారత్-2 జట్టు 18 పాయింట్లతో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. హరికృష్ణ నాయకత్వంలోని భారత జట్టు 17 పాయింట్లతో నాలుగో స్థానం, గంగూలీ సూర్యశేఖర్ కెప్టెన్సీలోని భారత్-3 టీమ్ 14 పాయింట్లతో 31వ స్థానంలో నిలిచాయి.
అంచనాలు తలకిందులు
మహిళల విభాగంలో పదో రౌండ్ వరకు అగ్రస్థానంలో ఉన్న భారత జట్టు మంగళవారం జరిగిన ఆఖరిదైన 11వరౌండ్‌లో 1-3తో యూఎ్‌సఏ చేతిలో ఓటమిపాలై టైటిల్‌ను చేజార్చుకుంది. హంపి, వైశాలి తమ గేములను డ్రా చేసుకోగా, తానియా, కులకర్ణి ఓడారు. స్లొవేకియాతో తలపడిన భారత్-2 టీమ్ 2-2తో డ్రా చేసుకోగా, భారత్-3 టీమ్ 1.5-2.5తో కజకిస్థాన్ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల విభాగం టైటిల్ రేసులో టోర్నీ ఆరంభం నుంచి గట్టి పోటీ ఇచ్చిన గుకేష్, ప్రజ్ఞానందతో కూడిన భారత్-2 టీమ్ ఆఖరి రౌండ్‌లో జర్మనీపై 3-1తో గెలిచినా ఫలితం లేకపోయింది. హరికృష్ణ ప్రాతినిథ్యం వహించిన భారత జట్టు 2-2తో యూఎ్‌సఏతో, గంగూలీ నేతృత్వంలోని భారత్-3 టీమ్ 2-2తో కజకిస్థాన్‌తో డ్రా చేసుకున్నాయి.