చాలాసార్లు డీన్‌ను హెచ్చరించాం

ABN , First Publish Date - 2022-09-27T09:38:14+05:30 IST

ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో చివరి వన్డే సందర్భంగా ఆ జట్టు బ్యాటర్‌ చార్లీ డీన్‌ను టీమిండియా ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ మన్కడింగ్‌ చేయడం ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో..

చాలాసార్లు డీన్‌ను హెచ్చరించాం

వాదాస్పద రనౌట్‌పై దీప్తి

అదంతా అబద్ధమన్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌

కోల్‌కతా: ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో చివరి వన్డే సందర్భంగా ఆ జట్టు బ్యాటర్‌ చార్లీ డీన్‌ను టీమిండియా ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ మన్కడింగ్‌ చేయడం ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో వివాదాస్పదంగా మారిన సంగతి విదితమే. దీనిపై దీప్తి శర్మ స్పందించింది. లండన్‌ నుంచి స్వదేశం చేరిన దీప్తి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారమే డీన్‌ను అవుట్‌ చేశామని చెప్పింది. ‘అప్పటికే చాలాసార్లు డీన్‌ క్రీజును వదిలి బయటకు వస్తోంది. బౌలర్‌ బంతిని విడుదల చేయకముందే రెండు అడుగులు వెళ్లిపోయింది. దీంతో ఆమెను అనేకసార్లు హెచ్చరించాం. ఇదే విషయమై అంపైర్లకు కూడా పరిస్థితి వివరించాం. అయినా కూడా ఆమె మళ్లీ అలాగే చేయడంతో మరో అవకాశం లేక రనౌట్‌ చేశా. ఇదంతా నియమ నిబంధనలకు అనుగుణంగానే జరిగింది’ అని దీప్తి వివరించింది.

అది వాస్తవం కాదు: హీథర్‌ నైట్‌

దీప్తి వ్యాఖ్యలను ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ కొట్టిపారేసింది. ఆమె చెబుతున్నదంతా అబద్ధమని నైట్‌ వెల్లడించింది. క్రీజును వదిలి వెళ్లే విషయంలో డీన్‌ను ఎవరూ హెచ్చరించలేదని స్పష్టం చేసింది. అయినా అంపైర్‌ నిర్ణయంతో వారు సంతృప్తి చెందినప్పుడు.. ఇలా హెచ్చరించామంటూ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని దెప్పిపొడిచింది.


Read more