నీ కోసం సాధిస్తా నాన్నా..

ABN , First Publish Date - 2022-12-31T02:57:06+05:30 IST

అది 1950 ఫిఫా ప్రపంచకప్‌.. ఫుట్‌బాల్‌ను ప్రాణం కన్నా మిన్నగా భావించే బ్రెజిల్‌ ఆతిథ్యమిస్తున్న ఈవెంట్‌ అది. దీనికి మించి ఆ జట్టు కూడా ఫైనల్‌ చేరింది. ఇంకేముంది..

నీ కోసం సాధిస్తా నాన్నా..

మాట నిలబెట్టుకున్న పీలే

అది 1950 ఫిఫా ప్రపంచకప్‌.. ఫుట్‌బాల్‌ను ప్రాణం కన్నా మిన్నగా భావించే బ్రెజిల్‌ ఆతిథ్యమిస్తున్న ఈవెంట్‌ అది. దీనికి మించి ఆ జట్టు కూడా ఫైనల్‌ చేరింది. ఇంకేముంది.. అంబరాన్నంటే సంబరాల్లో బ్రెజిల్‌ వాసులు మునిగిపోయారు. కానీ ఫైనల్లో జరిగింది వేరు.. బ్రెజిల్‌ను ఓడించిన ఉరుగ్వే చాంపియన్‌గా నిలిచింది. దీంతో తన పదేళ్ల బాబుతో కలిసి మ్యాచ్‌ చూస్తున్న ఓ తండ్రి చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు. దీన్నే గమనిస్తున్న ఆ చిన్నారి మాత్రం చాలా ఆత్మవిశ్వాసంతో ఓ మాట చెప్పాడు. ‘నాన్నా.. చూస్తూ ఉండు. బ్రెజిల్‌కు నేనే ప్రపంచక్‌పను అందించి నిన్ను సంతోషంలో ముంచెత్తుతా’ అని ధీమాగా పలికాడు. నిజంగానే ఆ కుర్రాడు చెప్పింది చేశాడు. 1958 వరల్డ్‌కప్‌లో బ్రెజిల్‌ చాంపియన్‌గా నిలిచింది. దీనికి కారణం ఆ కుర్రాడే. అతడి పేరు పీలే. సెమీ్‌సలో హ్యాట్రిక్‌ నమోదు చేసి ఈ ఫీట్‌ సాధించిన పిన్నవయసు ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు. ఇక ఫైనల్లోనూ జోరు చూపించి రెండు గోల్స్‌తో మెరిశాడు. ఈ మ్యాచ్‌లోనే స్వీడన్‌ డిఫెండర్‌ తలపై నుంచి బంతిని తప్పిస్తూ చేసిన గోల్‌తో ప్రపంచం ఆశ్చర్యపోయింది. అది ఫీఫా చరిత్రలోనే బెస్ట్‌గా నిలిచింది. మొత్తంగా ఈ టోర్నీలో ఆరు గోల్స్‌ సాధించి, ఫుట్‌బాలర్‌ కూడా అయిన తన తండ్రి కలను నెరవేర్చాడు. అంతేకాదు.. ఆ మ్యాచ్‌లో అతడు వేసుకున్న జెర్సీ నెంబర్‌ 10. అప్పటి వరకు అది ఓ నెంబర్‌ మాత్రమే. కానీ తను వేసుకున్నాడు కాబట్టి తర్వాతి కాలంలో అది ఓ బ్రాండ్‌ అయ్యింది. ఎందుకంటే సాకర్‌ ప్రపంచం అతడి మాయాజాలానికి మైమరిచిపోయింది. ఫుట్‌బాల్‌లో సూపర్‌స్టార్లుగా పిలిపించుకున్న ఆటగాళ్లంతా ఇప్పుడు ఆ నెంబర్‌నే ధరిస్తుండడం చూస్తూనే ఉన్నాం.

పైలట్‌ కావాలనుకున్నాడు: పేదరికంలో పుట్టిన పీలే తొలుత పైలట్‌ కావాలనుకున్నాడు. ఎందుకంటే చిన్నతనంలో అతడు విమానాశ్రయంలో పల్లీలు అమ్మేవాడు. కాళ్లకు చెప్పులు లేకుండా, బట్టలు కూడా సరిగా లేని తను ఏరోడ్రోమ్‌ నుంచి ఎగురుతున్న విమానాలను చూస్తూ మైమరిచిపోయేవాడు. అయితే ప్రమాదవశాత్తూ ఓ గ్లైడర్‌ కుప్పకూలి పైలెట్‌ మరణించడం చూసిన పీలే భయపడి మనస్సు మార్చుకున్నాడు. వెంటనే తన ఆసక్తిని ఫుట్‌బాల్‌ వైపు మరల్చాడు. కానీ సొంతంగా బంతి కొనే స్థోమత లేక సాక్సుల్లో పేపర్లు నింపి వాటినే బంతిలా మార్చి ఆడేవాడు. అలా ప్రాక్టీ్‌సతో రాటుదేలాక స్థానిక క్లబ్బుల దృష్టిలో పడ్డాడు. 14 ఏళ్లకే సీనియర్లతో ఆడే స్థాయికి ఎదిగాడు. అలాగే 15 ఏళ్ల వయస్సులో సాంటోస్‌ క్లబ్‌లో చేరాక పీలే దశ తిరిగింది. అతని కెరీర్‌లో 92 హ్యాట్రిక్స్‌తో పాటు 31 సార్లు నాలుగేసి గోల్స్‌తో అదరగొట్టాడు. 6 సార్లు ఐదేసి గోల్స్‌ సాధించిన పీలే ఒక మ్యాచ్‌లోనైతే 8 గోల్స్‌తో నభూతో.. అనిపించుకున్నాడు. అత్యుత్తమ డ్రిబ్లర్‌గా పేరుతెచ్చుకున్న గరించా... పీలే కలిసి ఆడిన ఏ మ్యాచ్‌లోనూ బ్రెజిల్‌ ఓడిపోలేదు.

మంగళవారం అంత్యక్రియలు

సావో పౌలో: దిగ్గజ ఆటగాడు పీలే మృతితో బ్రెజిల్‌ శోకసంద్రమైంది. దీంతో మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని ఆ దేశ అధ్యక్షుడు బోల్సోనరో ప్రకటించారు. అలాగే మంగళవారం పీలే అంత్యక్రియలు జరుగనున్నాయి. సోమవారం ఉదయం ఆస్పత్రి నుంచి పీలే శవపేటికను తీసుకొచ్చి స్థానిక విలా బెల్మిరో స్టేడియంలో ఉంచుతామని సాంటోస్‌ క్లబ్‌ ప్రకటించింది. అదే రోజు ఉదయం 10 నుంచి మంగళవారం అదే సమయం వరకు ప్రజల సందర్శనార్ధం పీలే పార్థివ దేహాన్ని ఉంచుతారు. అనంతరం స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.

‘స్వర్గంలో కలిసి ఆడుదాం’

అర్జెంటీనా సూపర్‌ స్టార్‌ డీగో మారడోనా 2020లో మృతి చెందినప్పుడు పీలే ఆవేదనగా స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రపంచ ఫుట్‌బాల్‌ చరిత్రలో ఈ ఇద్దరినీ సమవుజ్జీలుగా భావిస్తుంటారు. అందుకే ఈ జోడీని 20వ శతాబ్దపు ఉత్తమ ఆటగాళ్లుగా అప్పట్లోనే ఫిఫా ప్రకటించింది. ‘ఎంతటి విషాద వార్త. నేనో గొప్ప స్నేహితుణ్ణే కాదు.. ప్రపంచం ఓ లెజెండ్‌ను కోల్పోయింది. ఏదో ఓ రోజు ఆకాశంలో మనమిద్దరం ఫుట్‌బాల్‌ ఆడతామని ఆశిస్తున్నా’ అని పీలే అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

ఆకాశమూ ఏడ్చింది!

1977 అక్టోబరు 1న పీలే తన చివరి మ్యాచ్‌ ఆడాడు. అతడు ప్రాతినిధ్యం వహించిన క్లబ్బులు న్యూయార్క్‌ కాస్మోస్‌, శాంటోస్‌ మధ్య జరిగిన ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ అది. తొలి హాఫ్‌లో కాస్మో స్‌కు, సెకండ్‌ హాఫ్‌లో శాంటోస్‌కు పీలే ఆడాడు. ఆ పోరులో కాస్మోస్‌ 2-1తో నెగ్గింది. 37 ఏళ్ల పీలే 30 యార్డ్‌ సర్కిల్‌ నుంచి ఫ్రీకిక్‌తో కాస్మోస్‌కు గోల్‌ చేశాడు. ద్వితీ యార్థంలో వర్షం పడింది. దాంతో ‘పీలే రిటైర్‌ అవుతుండడంతో ఆకాశం కూడా ఏడ్చింది’ అని పత్రికలు వ్యాఖ్యానించాయి.

ముగ్గురు భార్యలు, ఏడుగురు సంతానం

82 ఏళ్ల పీలే మూడు సార్లు వివాహం చేసుకోగా మొత్తం ఏడుగురు సంతానం కలిగి ఉన్నారు. 1966లో తొలిసారి రోజ్‌మేరీని వివాహం చేసుకున్న పీలేకు ఆమెతో ఇద్దరి పిల్లలు కలిగాక 1982లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత 1994లో లెమో్‌సను పెళ్లి చేసుకుని 2008లో తెగదెంపులు చేసుకున్నాడు. 1996లో వీరికి ఫెర్టిలిటీ చికిత్స ద్వారా కవలలు జన్మించారు. ఇక 2016లో బ్రెజిల్‌-జపాన్‌కు చెందిన మార్సియా అవోకిని వివాహమాడాడు. ఈమె చివరి వరకు కొనసా గింది. అంతేకాకుండా పీలేకు ఇతర మహిళలతో ఉన్న ఎఫైర్స్‌ కారణంగా మరో ముగ్గురు జన్మించారు.

పీలే మృతి ప్రపంచ క్రీడారంగానికి తీరని లోటు. అతని అద్భుత ప్రతిభాపాటవాలు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తాయి.

- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

గుడ్‌ బై అని చెప్పినంత మాత్రాన పీలే కుటుంబం, ప్రపంచ ఫుట్‌బాల్‌ పడుతున్న బాధకు ఉపశమనం కలగదు. లక్షలాది మందికి ప్రేరణగా నిలిచిన మీరు నిన్న, నేడు, భవిష్యత్‌లోనూ అందరికీ దిగ్గజ ఆటగాడిగానే ఉంటారు. - క్రిస్టియానో రొనాల్డో

ఫుట్‌బాల్‌కు దక్కిన అత్యున్నత బహుమతి పీలే. ఈ క్రీడకు మీరందించిన సేవలు వెలకట్టలేనివి. - మెస్సీ

‘కోపా’ కప్‌లు

శాంటోస్‌ క్లబ్‌ కెప్టెన్‌గా దక్షిణ అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ టోర్నీ కోపా లిబెర్టడోర్స్‌ కప్‌ టైటిళ్లు (1962, 1963) అందించాడు.

పీలే విజయాలకు గుర్తుగా శాంటో్‌సలో 2014లో అతడి పేరిట మ్యూజియం ఏర్పాటు

రిటైరయ్యాక..

1994లో యునెస్కో గుడ్‌విల్‌ అంబాసిడర్‌.

1995లో బ్రెజిల్‌ క్రీడా శాఖ సహాయ మంత్రిగా నియామకం. ఈ సమయంలో బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌లో అవినీతి నిరోధించేందుకు అతడు తీసుకొచ్చిన చట్టం ‘పీలే లా’గా పేరుపొందింది.

1998లో క్రీడా మంత్రిగా పదోన్నతి.

వివాదాలు

యునిసె్‌ఫలో 7,00,000 డాలర్ల అవినీతికి సంబంధించి పీలేపై ఆరోపణలు. ఇవి నిరూపితం కాలేదు.

పీలే టెలివిజన్‌ కంపెనీపై బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ అడ్మినిస్ట్రేటర్‌ రికార్డో టెక్సిరియా అవినీతి ఆరోపణలు చేశాడు. దాంతో లాస్‌వెగాస్‌లో 1994లో జరిగిన ప్రపంచ కప్‌ డ్రా కార్యక్రమంలో పాల్గొనకుండా పీలేపై నిషేధం విధించారు.

Updated Date - 2022-12-31T02:57:08+05:30 IST