IndiaVsBangladesh: బంగ్లా చేతిలో మళ్లీ ఓడిన టీమిండియా.. సిరీస్ గోవింద..
ABN , First Publish Date - 2022-12-07T20:08:53+05:30 IST
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా (Bangladesh Vs India) మరో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఉత్కంఠభరిత రెండవ వన్డేలో 5 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా (Bangladesh Vs India) మరో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఉత్కంఠభరిత రెండవ వన్డేలో 5 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. 272 పరుగుల లక్ష్య చేధనలో శ్రేయర్ అయ్యర్ (82), అక్షర్ పటేల్ (52), చివరిలో కెప్టెన్ రోహిత్ శర్మ (51 నాటౌట్) ధాటిగా ఆడినా భారత్‌ను గట్టెక్కించలేకపోయారు. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి రెండు బంతుల్లో 2 సిక్సర్లు అవసరమైన దశలో క్రీజులో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ 5వ బంతిని అద్భుతంగా సిక్సర్ కొట్టాడు. కానీ చివరి బంతిని సిక్సర్ కొట్టలేకపోవడంతో ఓటమి తప్పలేదు. ఆతిథ్య బంగ్లాదేశ్ ఆటగాళ్లు తొలుత బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్‌లో అద్భుతంగా రాణించడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఫలితంగా 3 వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో బంగ్లాదేశ్ సిరీస్ గెలుచుకుంది.
బ్యాటింగ్‌లో మళ్లీ తడబాటు..
రెండవ వన్డేలో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు మరోసారి తడబాటుకు గురయ్యారు. రోహిత్ చేతి వేలుకు గాయమవ్వడంతో ఇన్నింగ్స్ ఆరంభించిన శిఖర్ ధావన్, కింగ్ విరాట్ కోహ్లీ జోడి శుభారంభాన్ని ఇవ్వలేకపోయింది. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (5) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 13 పరుగుల వద్ద శిఖర్ ధవన్ (8), 39 పరుగుల వద్ద వాషింగ్టన్ సుందర్ (11), 65 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (14) తీవ్రంగా నిరాశపరిచారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అక్షర్ పటేల్‌తో జతకట్టిన శ్రేయస్ అయ్యర్ (82) కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కలిసి ఐదవ వికెట్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కీలక సమయంలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ (56) ఔటవ్వడంతో టీమిండియా కష్టాల్లో పడింది. శార్ధూల్ థాకూర్ (7), దీపక్ చాహర్ (11) త్వరగానే ఔటయ్యారు. అయితే గాయం కారణంగా తొమ్మిదవ వికెట్‌గా క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్‌పై ఆశలు పెంచాడు. బంగ్లా బౌలర్లపై చెలరేగి ఆడాడు. ధాటిగా ఆడి 28 బంతుల్లోనే 5 భారీ సిక్సర్లు, 3 ఫోర్ల సహాయంతో 51 పరుగుల క్రీజులో నాటౌట్‌గా నిలిచాడు. చివరి ఓవర్లో 21 పరుగుల అవసరమవ్వగా భారత్ 5 పరుగుల దూరంలో నిలిచింది.
బంగ్లాదేశ్ బౌలింగ్: ఆతిథ్య బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్ బ్యాట్స్మెన్లను కట్టడి చేశారు. హొస్సెన్ 3 వికెట్లు, హెహిదీ హసన్ మిరాజ్, షేక్ అల్ హసన్ చెరో 2 వికెట్లు, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహ్మదుల్లా చెరో వికెట్ తీశారు.