Australia vs India: మ్యాచ్‌ను మలుపు తిప్పిన షమీ ఓవర్.. టీమిండియా విజయం.. మరో బుమ్రా దొరికినట్టేనా..!
ABN , First Publish Date - 2022-10-17T19:36:02+05:30 IST
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో షమీ బౌలింగ్ మాయాజాలంతో..
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో షమీ బౌలింగ్ మాయాజాలంతో టీమిండియా 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకుంది. టీమిండియా పేసర్ షమీ బౌలింగ్ చేసిన 20వ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఆస్ట్రేలియా 19 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఒక్క ఓవర్ మాత్రమే మిగిలి ఉంది. ఒక్క ఓవర్‌లో 11 పరుగులు చేస్తేనే ఆసీస్ గెలుస్తుంది. అలాంటి తరుణంలో టీమిండియా 20వ ఓవర్ బౌలింగ్ చేసే అవకాశం మహ్మద్ షమీకి ఇచ్చింది. ఇచ్చిన ఆ అవకాశాన్ని షమీ చక్కగా సద్వినియోగం చేసుకుని అద్భుతంగా రాణించాడు. షమీ బౌలింగ్ చేసిన రెండు బంతులకు నాలుగు పరుగులు వచ్చాయి. మూడో బంతి నుంచి ఆసీస్ వరుసగా వికెట్లను చేజార్చుకుంది. మూడో బంతికి కమిన్స్ కొట్టిన షాట్‌ను కోహ్లీ ఒంటి చేత్తో అద్భుతంగా క్యాచ్ పట్టాడు. కోహ్లీ పట్టిన ఈ క్యాచ్‌కు అతనిపై ప్రశంసల జల్లు కురిసింది. నాలుగో బంతికి అగర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఐదో బంతికి జోష్ ఇంగ్లిస్ బౌల్డ్‌గా పెవిలియన్ బాట పట్టాడు. ఆరో బంతికి రిచర్డ్‌సన్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో.. ఆసీస్ 180 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యాట్రిక్ వికెట్లు తీసి షమీ తనేంటో నిరూపించుకున్నాడు. గాయం కారణంగా వరల్డ్ కప్‌కు దూరమైన టీమిండియా పేసర్ బుమ్రాకు ప్రత్యామ్నయంగా ఎవరిని భర్తీ చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో షమీ ఈరేంజ్‌లో అదరగొట్టడం టీమిండియా ఆశలకు ఊపిరిపోసింది. షమీని బరిలోకి దించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు 78 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వార్మప్ మ్యాచ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. 33 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాదేసి 57 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. రాహుల్ 57 పరుగులు చేసి దూకుడుగా ఆడుతుండగా మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అష్టన్ అగర్‌కు క్యాచ్‌గా చిక్కడంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అగర్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. కోహ్లీ 19 పరుగులకే స్టార్క్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు క్యాచ్‌గా దొరికిపోయి ఔట్ అయ్యాడు.
అయితే.. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో కూడా మెరిశాడు. 33 బంతుల్లో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో బౌలర్‌కే క్యాచ్‌గా దొరికి ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో రిచర్డ్‌సన్ 4 వికెట్లతో రాణించాడు. స్టార్క్, మ్యాక్స్‌వెల్, అగర్‌కు తలో వికెట్ దక్కింది. టీమిండియా బౌలర్లలో షమీ మూడు వికెట్లతో రాణించగా, భువనేశ్వర్ 2 వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, చాహల్ తలో వికెట్ తీశారు.