Asia Cup: పడిలేచిన కెరటంలా శ్రీలంక.. ఫైనల్‌కు ముందు ఒత్తిడిలో పాకిస్థాన్

ABN , First Publish Date - 2022-09-11T00:31:23+05:30 IST

ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం శ్రీలంక-పాకిస్థాన్ మధ్య టైటిల్ పోరు జరగనుంది. కీలక మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి

Asia Cup: పడిలేచిన కెరటంలా శ్రీలంక.. ఫైనల్‌కు ముందు ఒత్తిడిలో పాకిస్థాన్

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం శ్రీలంక-పాకిస్థాన్ మధ్య టైటిల్ పోరు జరగనుంది. కీలక మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి మాంచి జోరుమీదున్నట్టు కనిపించిన పాకిస్థాన్ ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఫైనల్‌కు ముందు ఈ ఒత్తిడిని పాక్ ఎలా అధిగమిస్తుందనేది చూడాల్సిందే. ఇప్పటికే ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్న పాకిస్థాన్-శ్రీలంక జట్టు శుక్రవారం సూపర్-4లో తమ చివరి మ్యాచ్‌ను ఆడేశాయి. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజం నేతృత్వంలోని పాక్ జట్టును శ్రీలంక బెంబేలెత్తించింది. మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ శ్రీలంక బౌలర్ల దాడికి తట్టుకోలేక మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 121 పరుగులకే కుప్పకూలింది. వనిందు హసరంగ మూడు వికెట్లు తీసి పాకిస్థాన్‌ను బెంబేలెత్తించగా, మహీష్ తీక్షణ, ప్రమోద్ మదుసన్ రెండేసి వికెట్లు తీసి పాకిస్థాన్‌కు తమ బంతుల పవర్‌ను చూపించారు. అనంతరం 122 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 17 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుని ఆరు పాయింట్లతో సూపర్-4లో అగ్రస్థానంలో నిలిచింది.


ఈ రెండు జట్ల మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తుదిపోరుకు ముందు పాకిస్థాన్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన దాసున్ షనక సేన పూర్తి ఆత్మవిశ్వాసంలో ఉండగా, పాకిస్థాన్ ఒత్తిడిలోకి జారుకుంది. నిజానికి ఈ టోర్నీలో శ్రీలంక ఆటతీరును ప్రశంసించకుండా ఉండలేం. టోర్నీ ప్రారంభంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక దారుణ ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బోల్తాపడి 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.


ఆ తర్వాత మాత్రం పడిలేచినా కెరటంలా లంక జట్టు విజృంభించింది. ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ముందుకు సాగుతోంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్ధాన్, భారత్, పాకిస్థాన్ జట్లపై విజయం సాధించి సత్తా చాటింది. మరోవైపు, తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్.. సూపర్-4లో భారత్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా బయటపడింది. తాజాగా, నిన్న శ్రీలంక చేతిలో ఎదురుదెబ్బ తగిలింది. వరుస విజయాలతో మాంచి ఆత్మవిశ్వాసంతో ఉన్న శ్రీలంక ట్రోఫీపై కన్నేయగా, దెబ్బతిన్న బెబ్బులిలా ఉన్న పాకిస్థాన్ తుది మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది.


ఆధిపత్యం ఎవరిది?

శ్రీలంక-పాకిస్థాన్ జట్లు ఇప్పటి వరకు 22 మ్యాచుల్లో తలపడ్డాయి. శ్రీలంక 9, పాకిస్థాన్ 13 మ్యాచుల్లో విజయం సాధించాయి. దుబాయ్‌లో ఈ రెండు జట్లు మూడుసార్లు తలపడగా రెండింటిలో శ్రీలంక విజయం సాధించింది. పాకిస్థాన్ ఒక్క విజయంతోనే సరిపెట్టుకుంది. గత ఐదు మ్యాచుల్లో శ్రీలంక నాలుగు మ్యాచుల్లో విజయం సాధించగా, పాకిస్థాన్ ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. యూఏఈలో జరిగిన ఆరు మ్యాచుల్లో శ్రీలంక రెండు, పాకిస్థాన్ 4 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇక, ఆసియాకప్‌ విషయానికి వస్తే 2016, 2012, 2000 ఆసియాకప్‌లో రెండుసార్లు, 1986లో ఒకసారి మొత్తంగా ఐదుసార్లు శ్రీలంకపై పాకిస్థాన్ విజయం సాధించింది. ఆసియాకప్‌లో పాకిస్థాన్‌పై శ్రీలంకదే ఆధిపత్యం. 2014లో రెండుసార్లు, 2010, 2008, 2004, 1997, 1995లో మొత్తంగా ఏడుసార్లు విజయం సాధించింది.

Updated Date - 2022-09-11T00:31:23+05:30 IST