Uppal Match: ఉప్పల్‌లో మ్యాచ్ చూసేందుకు వెళ్తున్నారా?.. బకెట్ నీళ్లు, సబ్బు కూడా తీసుకెళ్లండి!

ABN , First Publish Date - 2022-09-24T21:51:36+05:30 IST

భారత్-ఆస్ట్రేలియా జట్ట మధ్య రేపు (ఆదివారం) చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియా

Uppal Match: ఉప్పల్‌లో మ్యాచ్ చూసేందుకు వెళ్తున్నారా?.. బకెట్ నీళ్లు, సబ్బు కూడా తీసుకెళ్లండి!

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా జట్ట మధ్య రేపు (ఆదివారం) చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియా, భారత్ జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. 1-1తో సిరీస్ సమం కావడంతో ఆదివారం నాటి మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో నెగిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. మరోవైపు, ఉప్పల్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎంతగా ఎగబడిందీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టికెట్ల విక్రయాల్లో దారుణంగా విఫలమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) విమర్శల పాలైంది. ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తామని ఒకసారి, పేటీఎంలో అంటూ మరోసారి అభిమానులను గందరగోళంలోకి నెట్టేసింది. టికెట్ల కోసం జింఖానా మైదానానికి వచ్చిన వారిని అదుపు చేసేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఇంతా జరిగితే టికెట్లు దక్కించుకున్న వారు కొంతమందే.


ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) సామర్థ్యం 39 వేలు. వీటిలో కాంప్లిమెంటరీ టికెట్లు పోగా మిగిలిన వాటిని విక్రయించినట్టు చెబుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే.. అమ్మిన టికెట్ల కంటే కాంప్లిమెంటరీగా ఇచ్చిన టికెట్లే ఎక్కువని నిగ్గు తేల్చారు. టికెట్ల విక్రయాల్లో గందరగోళం నేపథ్యంలో నిన్న మీడియా ముందుకొచ్చిన హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin).. టికెట్ల విక్రయాల లెక్కలు బహిరంగ పరిచారు. 15వ తేదీన పేటీఎంలో 11,450 సాధారణ టిక్కెట్లు, 4 వేలు కార్పొరేట్‌ టిక్కెట్లు, 23న సికింద్రాబాద్‌ జింఖానా కౌంటర్లలో 3 వేలు, అదేరోజు ఆన్‌లైన్‌లో 2,100 టిక్కెట్లు విక్రయించినట్టు చెప్పాడు. ఈ లెక్కన చూసుకుంటే మొత్తంగా విక్రయించినవి 20,550గా లెక్కతేలింది. మిగిలిన 12,450 టికెట్లు ఏమయ్యాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 


నిర్వహణ గాలికి..

సరే.. ఆ లెక్కలు పక్కన పెడితే టికెట్లు దక్కించుకుని మ్యాచ్‌ను కళ్లారా వీక్షేందుకు వెళ్లాలనుకున్న వారికి చిన్న సూచన. మ్యాచ్ చూసేందుకు ఆశగా పొలోమని వెళ్లిపోకుండా బకెట్ నీళ్లు, సబ్బు, చిన్న టవల్ లాంటిది కూడా వెంట తీసుకెళ్లడం బెటర్. ఉప్పల్ స్టేడియంలో చివరి మ్యాచ్ జరిగి దాదాపు మూడేళ్లు అయింది. ఆ తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా జరగకపోవడంతో స్టేడియం నిర్వహణను హెచ్‌సీఏ గాలికి వదిలేసింది. ఫలితంగా సీట్లు అన్నీ పాడైపోయి, పెచ్చులు లేచిపోయి చూడ్డానికే వికారంగా ఉన్నాయి. స్టేడియంలో ఎక్కడ చూసినా నిర్వహణలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కనీసం చీపు పట్టి ఊడ్చిన సందర్భాలు కూడా లేవు. స్టేడియంలోని సీట్లు, లోపలి పరిస్థితులకు అద్దం పట్టే ఫొటోలు వెలుగులోకి రావడంతో హెచ్‌సీఏపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ చూసేందుకు వెళ్లేవారు ఎవరి సీట్లను వారు శుభ్రం చేసుకునేందుకు నీళ్లు, సబ్బు, తుచుకునేందుకు టవల్ కూడా తీసుకెళ్లాలంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. నిత్యం వివాదాల్లో మునిగితేలే హెచ్‌సీఏ పెద్దలకు స్టేడియం నిర్వహణ పట్టకుండా పోయిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియం ఇంత దరిద్రంగా ఉంటే బీసీసీఐ ఏం చేస్తోందని కూడా మరికొందరు ప్రశ్నిస్తున్నారు.


 బ్రాండ్ ఇమేజ్ ఏం కాను?

మ్యాచ్ కోసం హెచ్‌సీఏ బాగానే సన్నద్ధమైంది. 2500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. 300కుపైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా మైదానంలోని ప్రతి వ్యక్తి కదలికలను పోలీసులు పర్యవేక్షించనున్నారు. అలాగే, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులు, స్నేక్ క్యాచర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఇంత వరకు సూపర్ అనే చెప్పుకోవాలి. కొసరు విషయాలన్నింటిపైనా బాగనే శ్రద్ధ పెట్టిన హెచ్‌సీఏ ప్రేక్షకుల సమస్యలను మాత్రం గాలికొదిలేసింది. సీట్లు పరమచెత్తగా ఉన్నాయి. స్టేడియంలో సగానికి పైగా సీట్లు కూర్చోవడానికే వీలులేకుండా ఉన్నాయి. మూడేళ్ల తర్వాత జరుగుతున్న అంతర్జాతీయ మ్యాచ్‌‌పై ఇంత నిర్లక్ష్యం కూడదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయటకొచ్చిన ఫొటోలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌కు ఇంకా కొన్ని గంటల సమయం మిగిలే ఉండడంతో ఇప్పటికైనా హెచ్‌సీఏ అధికారులు, మరీ ముఖ్యంగా దాని చీఫ్ అజారుద్దీన్ దీనిపై దృష్టి సారిస్తాడో? లేదో? చూడాల్సిందే.   


Read more