మగాడినే అయితే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు!
ABN , First Publish Date - 2022-08-11T08:44:05+05:30 IST
రెండు దశాబ్దాలకుపైగా మహిళా టెన్నిస్‌ను ఏలిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ రిటైర్మెంట్కు కౌంట్‌డౌన్ మొదలైంది.

ఆటను వీడడంపై సెరెనా విలియమ్స్
ఈ నెలాఖరులో జరిగే యూఎస్ ఓపెన్‌తో కెరీర్‌కు వీడ్కోలు
న్యూయార్క్: రెండు దశాబ్దాలకుపైగా మహిళా టెన్నిస్‌ను ఏలిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ రిటైర్మెంట్కు కౌంట్‌డౌన్ మొదలైంది. యూఎస్ ఓపెన్ తర్వాత టెన్ని్‌సను వీడనున్నట్టు వోగ్ మ్యాగజైన్‌కు రాసిన వ్యాసంలో సెరెనా తెలిపింది. కెరీర్ లేదా కుటుంబం వీటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిన క్లిష్టపరిస్థితుల్లో.. ప్రాణప్రదమైన టెన్ని్సనే త్యాగం చేయడానికి విలియమ్స్ సిద్ధమైంది. నిజంగా ఇది అన్యాయమే.. ఒకవేళ తాను పురుషుడినైవుంటే ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యేవి కావని సెరెనా పేర్కొంది.
అది న్యాయం కాదు..
మళ్లీ అథ్లెట్‌గా గర్భవతిని కావాలని తాను కోరుకోవడం లేదని సెరెనా విలియమ్స్ పేర్కొంది. ‘ప్రొఫెషనల్ కెరీర్, కుటుంబం.. రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం నాకసలు ఇష్టంలేదు. అది న్యాయం కాదు. నాకిప్పుడు 41 ఏళ్లు.. ఇప్పుడిక ఏదో ఒకదాన్ని త్యాగం చేయాల్సిందే. నేనేగనుక పురుషుడిని అయితే.. ఇప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచించే దాన్నే కాదు. నా భార్య పిల్లలు కనేందుకు శ్రమిస్తుంటే.. నేను విజయాలు సాధిస్తూ ఉండేదాన్ని. టామ్ బ్రాడీ (అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడు)కంటే ఎక్కువ రోజులు ఆడేదాన్ని. వీడ్కోలు గురించి చాలా రోజులుగా ఆలోచిస్తున్నా. జీవితంలో భిన్న దిశల్లో ప్రయాణించాల్సిన సమయం వచ్చింది. నా కౌంట్‌డౌన్ మొదలైంద’ని సెరెనా ఎంతో ఆవేదనతో రాసింది. ఆధునిక టెన్ని్‌సలో అత్యధికంగా 23 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన సెరెనా.. మార్గరెట్ కోర్ట్ 24 టైటిళ్ల రికార్డుకు అడుగుదూరంలో ఉంది. తొలి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత రీఎంట్రీ ఇచ్చినా.. గాయాల కారణంగా మునుపటి ఫామ్‌ను చాటలేక పోతోంది. అయితే, మాతృత్వంతోపాటు వృత్తిగత జీవితంలో అత్యున్నతస్థాయి మహిళలకు దక్కినట్టు సమాజం చిత్రీకరిస్తున్నా.. వాస్తవంలో మాత్రం అది మిథ్యే అని ప్రొఫెసర్ షీరి రండోల్ఫ్ అభిప్రాయపడింది. కానీ, సెరెనా అంశం కొంత ప్రత్యేకమే అయునా.. ఎంతో మంది అమెరికన్లు కుటుంబం కోసం తన కెరీర్లను వదులుకోవాల్సి వచ్చిందని ఓ సర్వే పేర్కొంది. పురుష ఆటగాళ్లకు ఎదురుకాని ఇబ్బందులు మహిళలకు ఉంటాయనేది వాస్తవమని రన్నర్ కారా గౌషర్ పేర్కొంది.