FIFA: అర్జెంటీనా చేతిలో ఓటమితో ఫ్రాన్స్‌ ఫ్యాన్స్ బీభత్సం.. మరీ ఇంత పిచ్చా!.. ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-12-19T17:04:32+05:30 IST

కళ్లు చెదిరే గోల్స్.. ఆద్యంతం మలుపులు.. మునివేళ్లపై నిలబెట్టిన ఆఖరి నిమిషాలు.. ఇవీ ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA World Cup2022) ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా, ఫ్రాన్స్ (france vs argentina) తలపడిన తీరు.

FIFA: అర్జెంటీనా చేతిలో ఓటమితో ఫ్రాన్స్‌ ఫ్యాన్స్ బీభత్సం.. మరీ ఇంత పిచ్చా!.. ఏం చేశారంటే..

ళ్లు చెదిరే గోల్స్.. ఆద్యంతం మలుపులు.. మునివేళ్లపై నిలబెట్టిన ఆఖరి నిమిషాలు.. ఇవీ ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA World Cup2022) ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా, ఫ్రాన్స్ (france vs argentina) తలపడిన తీరు. సమవుజ్జీల ఈ సమరంలో లియోనెల్ మెస్సీ (Lionel Messi) సారధ్యంలోని అర్జెంటీనాను అదృష్టం వరించింది. పెనాల్టీ షూటవుట్‌లో 4 - 2 గోల్స్ తేడాతో ఫ్రాన్స్‌పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫలితంగా అర్జెంటీనా ప్లేయర్లు ఆనందోత్సాహాల్లో మునిగిపోగా.. ఫ్రాన్స్ ఆటగాళ్లు ఓటమి భారంతో తల్లడిల్లారు. వరుసగా రెండవసారి ఫిఫా వరల్డ్ కప్‌ను ముద్దాడాలనే కల చెదిరిపోవడంతో ప్లేయర్లు డీలా పడ్డారు. మైదానంలో ఫ్రాన్స్ ఆటగాళ్ల పరిస్థితి ఈ విధంగా ఉంటే.. ఇక ఆ దేశ అభిమానుల మితిమీరి ప్రవర్తించారు. ఫ్రాన్స్ ఓటమి పాలవ్వడంతో ఆగ్రహంతో రెచ్చిపోయారు. పలు నగరాల్లో అల్లకల్లోల పరిస్థితులు సృష్టించారు. ఫ్రాన్స్‌లోని పలు నగరాల్లో ఆందోళనలకు దిగారు. అల్లర్లు సృష్టించారు. ప్యారిస్, నీస్, లియోన్ నగరాల్లో వేలాది మంది ఫుట్‌బాల్ ఫ్యాన్స్ వీధుల్లోకి వచ్చి నానా హంగామా సృష్టించారు. అందుబాటులో ఉన్నవాటిని తగులబెట్టే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.

మరోవైపు కల్లోల పరిస్థితులు, ఆందోళనలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. అయినప్పటికీ ఫ్యాన్స్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. వీరంగం సృష్టించారు. పోలీసులపై రాళ్లు, టపాసులతో దాడి చేశారు. ప్యారిస్‌ వీధుల్లో చెలరేగిన అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసు బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయని ‘డెయిలీ మెయిల్’ రిపోర్ట్ చేసింది. మ్యాచ్ తర్వాత వేలాది మంది వీధుల్లోకి వచ్చారని, టపాసులతో మంటలు రజేసే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారని ‘ది సన్’ (The Sun) రిపోర్ట్ పేర్కొంది. ఒక చోట పోలీసు వాహనంపై అభిమానులు దాడి చేశారు. కాగా ప్యారిస్, లియోన్ వీధుల్లో చెలరేగిన హింస, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించిన దృశ్యాలను పలువురు ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ప్యారిస్‌లో టియర్ గ్యాస్ మేఘాలు అలుముకున్నాయని పలువురు పేర్కొన్నారు. కాగా పరిస్థితులు చేజారకుండా దేశవ్యాప్తంగా దాదాపు 14 వేల మంది పోలీసు బలగాలను మోహరించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. డజన్ల సంఖ్యలో ఫ్యాన్స్‌ను అదుపులోకి తీసుకున్నారని మీడియా రిపోర్టులు తెలిపాయి. కాగా ఆందోళన జరుగుతున్న ప్రదేశాన్ని వేగంగా దాటి వెళ్లే ప్రయత్నం చేసిన ఓ మహిళపై ఆందోళనకారులు దాడి చేశారని ట్విటర్ యూజర్ వెల్లడించాడు.

కాగా ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్‌లో అర్జెంటీనా అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. కిలియన్‌ ఎంబప్పే హ్యాట్రిక్‌ గోల్స్‌తో పోరాడినా.. ఫ్రాన్స్‌ను షూటౌట్‌ చేసిన లియోనెల్‌ మెస్సీ సేన.. విశ్వవిజేత కిరీటాన్ని సొంతం చేసుకొంది. మెగా కప్‌పై 20 ఏళ్ల యూరోపియన్‌ ఆధిపత్యానికి లాటిన్‌ అమెరికా జట్టు ఎట్టకేలకు తెరదించింది. వరుసగా రెండోసారి నెగ్గి చరిత్రను తిరగరాయాలనుకున్న ఫ్రాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో అర్జెంటీనా 3-3 (4-2)తో ఫ్రాన్స్‌ను ఓడించి మూడోసారి ప్రపంచక్‌పను సొంతం చేసుకొంది. అర్జెంటీనా తరఫున మెస్సీ (23, 108వ), డిమారియా (36వ) గోల్స్‌ చేయగా.. ఫ్రాన్స్‌ తరఫున ఎంబప్పే (80, 81, 118వ) మూడు గోల్స్‌తో అదరగొట్టాడు. ఇక, షూటౌట్‌లో అర్జెంటీనా 4 స్కోరు చేయగా.. ఫ్రెంచ్‌ టీమ్‌ 2 కిక్‌లను మాత్రమే గోల్‌లోకి పంపగలిగింది.

Updated Date - 2022-12-19T19:59:22+05:30 IST