Digital Rupee: Phone-Pe, Google-Pay వంటి UPI చెల్లింపులకు, డిజిటల్ రూపాయికి మధ్య తేడా ఏంటి?

ABN , First Publish Date - 2022-11-30T20:21:12+05:30 IST

మరికొద్ది గంటల్లో రిటైల్ డిజిటల్ రూపాయి (Digital Rupee) పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది. భౌతిక కరెన్సీ ప్రమేయం లేకుండానే డిజిటల్ చెల్లింపుల చేయవచ్చు. ప్రస్తుతం ఇదే తరహాలో యూపీఐ పేమెంట్స్ (UPI Payments) కూడా జరుగుతున్నాయి కదా. మరి, యూపీఐ చెల్లింపునకు, డిజిటల్ కరెన్సీకి తేడా ఏంటి?

Digital Rupee: Phone-Pe, Google-Pay వంటి UPI చెల్లింపులకు, డిజిటల్ రూపాయికి మధ్య తేడా ఏంటి?

మరికొద్ది గంటల్లో రిటైల్ డిజిటల్ రూపాయి (Digital Rupee) పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది. డిసెంబర్ 1 నుంచి రిటైల్ డిజిటల్ రూపాయి ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of India) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మొదట ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో ఈ లావాదేవీలు జరుగుతాయి. ఆ తర్వాత మరో తొమ్మిది నగరాల్లో కూడా డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తెస్తారు.

డిజిటల్ రూపాయికి మరో పేరు సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (CBDC). ఇది క్రిప్టో కరెన్సీ తరహాలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీతోనే రూపొందుతుంది. అయితే డిజిటల్ రూపాయి అనేది ఆర్బీఐ అధికృత కరెన్సీ. డిజిటల్ టోకెన్ రూపంలో ఉండే దీనిని బ్యాంకుల ద్వారా పంపిణీ చేస్తారు. ఇది చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. డిజిటల్ రూపీ సాయంతో వ్యక్తి నుంచి వ్యక్తి (P2P)కి, వ్యక్తి నుంచి వ్యాపారుల (P2M)కు లావాదేవీలు జరపొచ్చు. ప్రస్తుతం ఇదే తరహాలో యూపీఐ పేమెంట్స్ (UPI Payments) కూడా జరుగుతున్నాయి కదా. మరి, యూపీఐ చెల్లింపునకు, డిజిటల్ కరెన్సీకి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం.

యూపీఐ చెల్లింపునకు, డిజిటల్ కరెన్సీకి తేడా ఏంటి?

మనం ప్రస్తుతం ఫోన్-పే, గూగుల్-పే, పేటీఎమ్ వంటి యాప్‌లను ఉపయోగించి డిజిటల్ చెల్లింపులు చేస్తున్నాం. అయితే ఈ ఈ-వాలెట్‌లలో ఉండే డబ్బును డిజిటల్ కరెన్సీ అని పిలవలేం. ఎందుకంటే యూపీఐ ద్వారా బదిలీ అవుతున్న డబ్బు.. బ్యాంకులలో మన అకౌంట్లలో భౌతిక కరెన్సీ రూపంలోనే ఉంటుంది. ఆ భౌతిక కరెన్సీనే మన అకౌంట్ నుంచి వేరే అకౌంట్‌కు బదిలీ చేస్తున్నాం. డిజిటల్ రూపాయికి వచ్చే సరికి భౌతిక కరెన్సీ అనే ప్రసక్తే ఉండదు. మీ భౌతిక కరెన్సీని ఉపయోగించి మీరు బ్యాంకుల నుంచి డిజిటల్ కరెన్సీని కొనుగోలు చేయాలి. అది ఎప్పటికీ మీ ఖాతాలో డిజిటల్ రూపంలోనే ఉంటుంది.

డిజిటల్ కరెన్సీ పూర్తిగా అధికారికంగా చెలామణి అవుతుంది. డిజిటల్ కరెన్సీతో చేసిన ప్రతి లావాదేవీకి సంబంధించిన మొత్తం సమాచారం ఆర్బీఐ వద్ద ఉంటుంది. UPI పేమెంట్స్‌ను వివిధ బ్యాంకులు నిర్వహిస్తాయి. కానీ, డిజిటల్ రూపాయిని రిజర్వ్ బ్యాంక్ నేరుగా పర్యవేక్షిస్తుంది. డిజిటల్ కరెన్సీ పింపిణీ మినహా వాటి లావాదేవీల్లో బ్యాంకులకు ప్రమేయం ఉండదు.

Updated Date - 2022-11-30T20:25:03+05:30 IST