IDEVAW: హింసను ఎదుర్కోవాలంటే.. మహిళ పోరాడాల్సిందే..!

ABN , First Publish Date - 2022-11-25T11:45:25+05:30 IST

రోజు రోజుకూ పెరుగుతున్న మహిళలు, బాలికలపై జరిగే దాడులు, హింసపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహనను కల్పించడం చాలా అవసరం.

IDEVAW: హింసను ఎదుర్కోవాలంటే.. మహిళ పోరాడాల్సిందే..!
Women

మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం (International Day for the Elimination of Violence against Women) ప్రతి సంవత్సరం నవంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. రోజు రోజుకూ పెరుగుతున్న మహిళలు, బాలికలపై జరిగే దాడులు, హింసపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహనను కల్పించడం చాలా అవసరం. కాలం ఎంత మారుతున్నా స్త్రీ,పురుషుల మధ్య అసమానతలు కొనసాగుతునే ఉన్నాయి. మహిళలపై హింస అనేది మానవ హక్కుల ఉల్లంఘన. ఇది చట్టంలో మహిళల పట్ల వివక్షకు పరిణామం. మహిళలపై హింస అనేది ప్రపంచ మహమ్మారిగా కొనసాగుతోంది, దీనికి నివారణలు అవసరం. హింస లేని ప్రపంచాన్ని సృష్టించడం కూడా అంతే అవసరం.

1960 లో డొమైన్ రిపబ్లిక్ లో రాజకీయ కార్యకర్తలైన మిరాబల్ సిస్టర్స్ హత్య ఆధారంగా స్త్రీ హింసా వ్యతిరేక దినంగా పాటించడం ప్రారంభమైంది. ఈ హత్యలు డొమైన్ రిపబ్లిక్ నియంత అయిన రాఫ్హీల్ ట్రుజిల్లో ఆధ్వర్యంలో 1981 లో జరిగాయి. ఉద్యమకారులు నవంబరు 25 న స్త్రీ హింసా వ్యతిరేకత గురించి అవగాహన కల్పించడానికి నిర్ణయించారు. అలా 1999 డిసెంబరు 17న ఈ రోజును అధికారికంగా ఐక్యరాజ్యసమితి తీర్మానించింది.

కరోనా సమయంలో కూడా బాలికలు, మహిళలపై ఎక్కువగా దాడులు పెరిగాయి. అదే సమయంలో గృహహింస తారాస్థాయిలో జరిగింది. దీనికి గాను లెక్కలు కూడా లేవు. ఆ సమయంలో చాలామంది స్త్రీలు బయటకు వచ్చి వాళ్ళకు జరిగిన అన్యాయం గురించి చెప్పే వీలు కూడా లేకపోయింది. ఆ తరువాత కూడా స్త్రీ తనకు జరిగిన అన్యాయం మీద ఎటువంటి రిపోర్ట్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు.

Elimination-of-Violence-aga.jpg

దీని వెనుక అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా కుటుంబ పరువు, ప్రతిష్టలు, సమాజంలో చెడ్డ పేరు వస్తుందనే భయం, పిల్లల భవిష్యత్ లాంటివి అడ్డు వస్తాయి. వీటిని లెక్కచేయక ముందుకు అడుగు వేసినాడు మాత్రమే స్త్రీ తనకు జరిగిన అన్యాయానికి న్యాయం పొందగలుగుతుంది. దీనికి బాధ్యుడైన మగవాడికి తగిన శిక్షపడేలా చేయగలదు.

యువత ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం కూడా వారిలో ధైర్యాన్ని నింపుతాయి. ఎటువంటి సమస్య వచ్చినా వారికి వారుగా పరిష్కరించుకునే తెగింపును సాధించగలుగుతారు. ఆత్మాభిమానానికి ఇబ్బంది కలిగితే వారిలో వారు బాధపడకుండా దానికి పరిష్కారం చురుగ్గా తీసుకోగలగాలి. అప్పుడే స్త్రీ అణిచివేత తగ్గుముఖం పడుతుంది.

ఈ మధ్యకాలంలో మరో సమస్య ప్రతి స్త్రీనీ వేధిస్తుంది. అదే బాడీ షేమింగ్ దీనికి ప్రధాన కారణం శరీర ఆకృతి గురించి రకరకాలుగా మాట్లాడటం, కించపరచడం అనేది ఎక్కువైపోతుంది. చులకన చేసి మాట్లాడటం, సూటిపోటి మాటలతో బాధపెట్టడం వంటివి ఎదురైనప్పుడు వాటిని పట్టించుకోనట్లు ప్రవర్తించకుండా తగిన సమాధానం చెప్పగలిగే ధైర్యం ప్రతి స్త్రీలోనూ ఉండాలి.

International-Day-for-the-E.jpg

మన దేశంలో నిర్భయ, దిశ, హథ్రాస్‌ వంటి చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతుండగానే కొద్దిరోజులు క్రితం సంచలనమైన శ్రద్ధావాకర్‌ ఘటన స్త్రీ మీద జరిగిన మరో అత్యంత ఘోరమైన ఘాతుకం. ఇవి మాత్రమేనా? పసిపిల్లలపై రోజు రోజుకూ జరుగుతున్న అఘాయిత్యాలూ, అత్తింటి ఆరళ్లు, లైంగిక వేధింపులు, ప్రేమ విఫలమైందని అమ్మాయిలపై జరుగుతున్న దాడులు, చావులు, పరువు హత్యలు ఇలా ఒక్కటేమిటి స్త్రీ చుట్టూ లెక్కలేననంత హింస.

అందుకే ‘మహిళలపై జరుగుతోన్న హింస ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎత్తున సాగుతోన్న మానవ హక్కుల ఉల్లంఘన’ అంటోంది ఐక్యరాజ్య సమితి. ప్రతి పదకొండు నిమిషాలకు ఓ మహిళ లేదా బాలిక మరణం ఆమె సన్నిహితుల చేతుల్లోనే జరుగుతోందంటున్నాయి ఐరాస నివేదికలు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాల ప్రకారం గడిచిన ఆరేళ్లతో పోలిస్తే 2021లో అత్యధికంగా వేధింపులు జరిగాయి.

ఆరేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 26.35 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. మహిళలపై జరుగుతున్న హింసాత్మక చర్యలను మౌనంగా భరించకుండా అందుబాటులో ఉన్న సఖి కేంద్రాలను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఈ ఫోన్ నంబర్స్ ద్వారా సమస్యలను తెలిపే వీలు ఉంది. ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ 191, ల్యాండ్‌ లైన్‌ 08728-224224.

Updated Date - 2022-11-25T11:54:51+05:30 IST