నిజాన్ని నిగ్గుతేల్చే ఈ టెస్టులు ఎలా చేస్తారో తెలుసా??

ABN , First Publish Date - 2022-12-03T10:11:43+05:30 IST

జరిగిన సంఘటనకు సరిపడా శిక్ష వేయించడానికి పోలీసులకు మరిన్ని నిజాలు అవసరమైన నేపథ్యంలో

నిజాన్ని నిగ్గుతేల్చే ఈ టెస్టులు ఎలా  చేస్తారో తెలుసా??

నాగార్జున నటించిన సూపర్ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో ఇతర సన్నివేశాలు ఏమీ గుర్తులేకపోయినా అందులో బ్రహ్మానందం, ఆలీ మధ్య కామెడీ సీన్ గుర్తుండే ఉంటుంది. ఆలీ అబద్ధం చెబితే పాలిగ్రాఫ్ మెషిన్ కుయ్ కుయ్ మంటూ చేసే సౌండ్‌తో కామెడీ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ పాలీగ్రాఫ్ టెస్ట్‌ను సినిమాలో కామెడీ కోసం వాడినా నిజంగా కొన్ని క్లిష్టమైన కేసులను చేధించడానికి ఈ పరీక్షను ఉపయోగిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు.

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా శ్రద్ధా వాకర్ గురించి ఏదో ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ హత్యకేసులో నేరస్థుడు అప్తాబ్‌ను పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. అయితే జరిగిన సంఘటనకు సరిపడా శిక్ష వేయించడానికి పోలీసులకు మరిన్ని నిజాలు అవసరమైన నేపథ్యంలో పోలీసులు పాలిగ్రాఫ్, నార్కో టెస్ట్‌ల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అసలింతకూ ఈ రెండు టెస్ట్‌లు ఏమిటి?? ఈ రెండింటి మధ్యా తేడా ఏమిటి?? వీటిని ఎలా చేస్తారు?? వీటిని ఉపయోగించి నిజంగానే నిందితుల గుట్టు తెలుసుకోవచ్చా? వంటి విషయాలను ఓసారి పరిశీలిస్తే..

పోలీసులకు జరిగిన సంఘటన గురించి, నిందితుడి గురించి తెలిసినా.. నేరస్థుడు తప్పించుకునేందుకు అవకాశం ఉంటే.. ఆ కేసును మరింత పటిష్టం చేయడానికి సరైన సాక్ష్యాధారాలు దొరకనపుడు అన్ని రకాల ప్రయాత్నాలు విఫలమైనటువంటి సందర్భంలో ఈ పాలిగ్రాఫ్, నార్కో టెస్ట్‌ల మీద ఆధారపడతారు.

పాలిగ్రాఫ్ టెస్ట్ ఎలా చేస్తారు ఇందులో జరిగేది ఏంటంటే..

sra1.jpg

పాలిగ్రాఫ్ టెస్ట్‌ జరిపే ముందు కోర్టు అనుమతి తీసుకుంటారు. నిందితుడికి ఎలాంటి శారీరక, మానసిక సమస్యలు లేవని నిర్థారించుకున్న తరువాత మాత్రమే కోర్టు ఈ పరీక్షకు అనుమతి ఇస్తుంది. రక్తపోటు, శ్వాస రేటు, గుండె స్పందన రేటు మొదలయినవి లెక్కించడానికి తగ్గట్టుగా ఆయా సెన్సార్ల తాలూకూ పరికరాలను నిర్ణీత శరీర ప్రాంతాల్లో అటాచ్ చేస్తారు. ఈ పరికరాలన్నీ డిజిటల్ పరికరాలకు అనుసంధానమై ఉంటాయి. ఆ తర్వాత నిందుతుడిని ప్రశ్నించడం మొదలు పెడతారు. మొదట సాధారణ ప్రశ్నలతో మొదలుపెట్టి.. తరువాత కేసుకు సంబంధించిన ప్రశ్నలపై ఫోకస్ చేస్తారు. వ్యక్తిలో హృదయ స్పందన రేటు పెరగడం, అరికాళ్ళు, అరచేతులలో చెమటలు పట్టడం, కంగారు పడటం, మొదలయిన శారీరక మార్పులు, ముఖకవళికల్లో వచ్చే మార్పులను సెన్సార్ల ద్వారా నమోదు చేస్తారు. అనంతరం కొన్ని ప్రమాణాలను ఉపయోగించి.. సదరు వ్యక్తి చెప్పేది తప్పా ఒప్పా అనే విషయాన్ని నిర్ధారిస్తారు.

నార్కో టెస్ట్ ఎలా చేస్తారు అందులో జరిగేది ఏంటంటే..

sra2.jpg

నార్కో టెస్ట్‌ను 'ట్రూత్ సీరమ్' పరీక్ష అని కూడా పిలుస్తారు. దీంట్లో నిందితుడితో నిజం చెప్పించడం జరుగుతుంది. సోడియం పెంటాథాల్ వంటి డ్రగ్స్ ఈ టెస్ట్‌లో ఉపయోగిస్తారు. ఇలాంటి మందులు నిందితుడికి ఇచ్చినప్పుడు అతడు పూర్తి మెలకువలోనూ ఉండడు, అలాగని పూర్తి స్పృహ కోల్పోవడం కూడా జరగదు. ట్రాన్స్‌లోకి వెళ్ళినట్టుగా ఉంటుంది అతడి పరిస్థితి. ఈ క్రమంలోనే అడిగిన ప్రశ్నలకు నిందితులు సమాధానాలు ఇస్తారు.

ఈ రెండు టెస్టుల మధ్య తేడా ఏమిటంటే.. ఒకిటి పూర్తిగా వ్యక్తి స్పృహలో ఉన్నప్పుడు జరిగితే మరొకటి వ్యక్తిని ట్రాన్స్‌లోకి పంపి నిజాన్ని రాబట్టడం జరుగుతుంది. ఇవి రెండు వేరు వేరు పరిస్థితులు అయినా రెండూ కూడా నేరస్థుడి నుండి నిజాన్ని రాబట్టడానికి సహాయపడేవే.

అయితే ఈ రెండూ కచ్ఛితమైన ఫలితాలను ఇస్తాయా అంటే కాదని చెబుతున్నారు నిపుణులు. ఇటువంటి పరీక్షలు అనగానే నేరస్థులలో భయం చోటు చేసుకుంటుంది. ఆ భయంతో వారిలో సహజంగానే కంగారు, హృదయ స్పందన రేటు పెరిగిపోతాయి. వీటి ఆధారంగా వారు అబద్ధం చెబుతున్నారని అనుకుంటే పొరపాటే కాబట్టి ఈ పరీక్షలు 100శాతం కచ్ఛితమైనవవి చెప్పలేము. కానీ ఈ పరీక్షలలో నేరస్థులు చాలా ముఖ్యమైన క్లూలు, కేసును సరైన దారిలో తీసుకెళ్ళడానికి అవసరమైన విషయాలు వెల్లడించే అవకాశాలు ఉంటాయి. అందుకే దర్యాప్తు సంస్థలకు అన్ని దారులూ మూసుకుపోయినప్పుడు ఈ పరీక్షలు సహాయపడతాయి. 2008లో జరిగిన ముంబై పేలుళ్ళ కేసు దోషి అజ్మల్ కసబ్‌ను విచారించేటపుడు పోలీసులు పాలిగ్రాఫ్, నార్కో టెస్ట్‌లను ఉపయోగించారు.

Updated Date - 2022-12-03T15:09:52+05:30 IST