Google Doodle: సౌర శక్తిని ఒడిసి పట్టిన ‘రాణి’.. ఈమె గురించి తెలిస్తే..

ABN , First Publish Date - 2022-12-12T18:28:23+05:30 IST

ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా..? ఓవైపు..వెచ్చని వెలుగులు విరజిమ్ముతున్న సూర్యుడు.. ఆ వెలుగుల్లో మెరిసిపోతున్న ఓ మహిళ చిత్రం ఉన్న డూడుల్ మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా..? ఆమె ఎవరో కాదు.. ప్రముఖ శాస్త్రవేత్త డా. మారియా టెల్క్స్.

Google Doodle: సౌర శక్తిని ఒడిసి పట్టిన ‘రాణి’.. ఈమె గురించి తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజు గూగుల్ డూడుల్(Google Doodle) చూశారా..? ఓవైపు..వెచ్చని వెలుగులు విరజిమ్ముతున్న సూర్యుడు.. ఆ వెలుగుల్లో మెరిసిపోతున్న ఓ మహిళ చిత్రం ఉన్న డూడుల్ మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా..? ఆమె ఎవరో కాదు.. ప్రముఖ శాస్త్రవేత్త డా. మారియా టెల్క్స్(Dr. Maria Telkes). తన ఆవిష్కరణలతో సౌరశక్తిని ఒడిసి పట్టిన ఆమెను శాస్త్రప్రపంచం ముచ్చటగా ‘సన్ క్వీన్‌’ అని పిలుచుకుంటుంది. డా. మారియా ఆవిష్కరణలు..సౌర శక్తి వినియోగం విస్తృత పరిచేందుకు పునాదులు వేశాయి. మానవ సమాజంలో సమూల మార్పులకు సూర్యుడు కారణమవుతాడని డా. మరియా బలంగా నమ్మారు. ఆమె నమ్మకం నిజమని నిరూపిస్తూ.. నేడు సౌర శక్తి ఆధునిక సమాజంలో భాగమైపోయింది. సౌర శక్తిపై ఇంతటి నమ్మకం కలిగిన డా. మారియా గురించి కాస్తంత వివరంగా తెలుసుకుందాం పదండి.

హంగరీలోని బుడాపెస్ట్ నగరంలో 1900 డిసెంబర్ 12న మారియా టెల్క్స్ జన్మించారు. 1920లో ఆమె ఫిజికల్ కెమిస్ట్రీలో ఎటొవోస్ లొరాండ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1924లో ఆమె పీహెచ్‌డీ పూర్తి చేసిన అనంతరం అమెరికాకు వలస వెళ్లారు. ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సోలార్ ఎనర్జీ కమిటీలో సభ్యురాలిగా పని చేశారు. రెండవ ప్రపంచయుద్ధం సమయంలో డా. మారియా తయారు చేసిన సూర్యరశ్మి ఆధారిత డిస్టిలర్ అప్పట్లో ఓ సంచలనం. సౌర శక్తితో సముద్రపు నీటిని తాగునీటిగా మార్చే ఈ డిస్టిలర్ యుద్ధంలోని సైనికులకు ఓ వరంగా మారింది. సౌర ఆధారిత ఆవిష్కరణలతో ఇలా దూసుకుపోతున్న డా. మారియాకు సోలార్ హోమ్‌ రూపంలో తొలిసారిగా ఎదురుదెబ్బ తగిలింది.

సౌర శక్తి సాయంతో అన్ని వసతులూ ఉన్న నివాసయోగ్యమైన ఇల్లు తయారు చేయచ్చని బలంగా నమ్మిన డా. మారియా సోలార్ హోమ్(Solar Home) పేరిట తన ఊహలకు రూపం ఇచ్చారు. కానీ.. ఈ ఆవిష్కరణ విఫలం అవడంతో ఆమె.. సోలార్ ఎనర్జీ కమిటీలో తన స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ఈ వైఫల్యాన్ని లెక్కచేయని డా. మారియా.. మొక్కవోని దీక్షతో ముందుకు సాగి చివరకు అనుకున్నది సాధించారు. ప్రైవేటు వ్యక్తుల నిధులతో తన పరిశోదన కొనసాగించిన మారియా..1948 ప్రముఖ ఆర్కిటెక్ట్ ఎలీనార్ రేమండ్‌తో కలిసి డోవర్ సన్ హౌన్ తయారు చేశారు. ఇది ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాన్ని ఇచ్చింది. నాటి నుంచి సోలార్ ఎనర్జీ(సౌర శక్తి) అన్న పదం విస్తృత వినియోగంలోకి వచ్చింది.

సౌర శక్తి వినియోగానికి సంబంధించి డా. మారియా ఎన్నో కీలక ఆవిష్కరణలు చేశారు. ఆమె తన జీవిత కాలంలో 20పైగా పేటెంట్లు పొందారు. ఈ రంగంలోని అనేక కంపెనీలకు సలహాదారుగా వ్యవహరించారు. ఫోర్డ్ ఫౌండేషన్ సాయంతో ఆమె సోలార్ ఓవెన్‌ను(Solar Oven) కనుగొన్నారు. ఈ ఓవెన్‌ తయారీ కోసం నాడు డా. మారియా రూపొందించిన నమూనా నేటికీ వినియోగంలో ఉంది. ప్రిన్స్‌స్టన్ యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ డెలావేర్ వంటి విద్యాసంస్థల్లో ఆమె పరిశోధకురాలిగా సేవలందించారు. డా. మారియా ప్రతిభకు గుర్తుగా1952లో ది సొసైటీ ఆఫ్ విమెన్ ఇంజినీర్స్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఆమెకు దక్కింది.

Updated Date - 2022-12-12T18:36:56+05:30 IST