బావ X బావమరిది

ABN , First Publish Date - 2022-10-26T02:08:17+05:30 IST

వారిద్దరూ స్వయానా బావామరుదులు.. ప్రత్యేకించి సీఎం జగన్‌కు సమీప బంధువులు.. అంతకు మించి వైసీపీలో కీలక నేతలు. ఆరంభంలో రాజకీయంగా కలిసిమెలిసి ఉన్నా తర్వాత్తర్వాత మనస్పర్థలు పెరిగాయి.

బావ X బావమరిది

ఒంగోలులో శ్రీనివాస కల్యాణంపై ఢీ అంటే ఢీ

బాలినేని దరఖాస్తుతో మొదట ఓకే

అంతలోనే అనుమతి నిరాకరణ

చైర్మన్‌ వైవీ పనేనని మాజీ మంత్రి ఆక్రోశం

సీఎంను కలిసి ఫిర్యాదు

సుబ్బారెడ్డికి జగన్‌ పిలుపు

దీంతో తాజాగా టీటీడీ అనుమతి

(ఒంగోలు-ఆంధ్రజ్యోతి)

వారిద్దరూ స్వయానా బావామరుదులు.. ప్రత్యేకించి సీఎం జగన్‌కు సమీప బంధువులు.. అంతకు మించి వైసీపీలో కీలక నేతలు. ఆరంభంలో రాజకీయంగా కలిసిమెలిసి ఉన్నా తర్వాత్తర్వాత మనస్పర్థలు పెరిగాయి. క్రమేపీ పార్టీలో ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అనుచరులు సైతం ఢీ అంటే ఢీ అంటున్నారు. చివరకు సొంత కుటుంబ వేడుకలో దేవుడి కార్యక్రమమైన శ్రీనివాస కల్యాణం ఏర్పాటు విషయంలోనూ విభేదాలు తలెత్తాయి. చినికిచినికిగాలివానలా మారి వ్యవహారం సీఎం వరకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీరిలో ఒకరు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కాగా.. మరొకరు ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.

మనవడి పుట్టిన రోజున..

బాలినేని నవంబరు 9న ఒంగోలులో పెద్దఎత్తున శ్రీనివాస కల్యాణం నిర్వహించాలని భావించారు. ఆ రోజు ఆయన మనవడి మూడో పుట్టినరోజు. నిబంధనల ప్రకారం 3నెలల ముందే టీటీడీకి దరఖాస్తు చేశారు. ఈవో ధర్మారెడ్డి ఆయనకు సన్నిహితుడు కావడంతో ఆగమేఘాలపై అనుమతి లభించింది. బాలినేని ఆ వెంటనే స్వామి దర్శనానికి వెళ్లి అనుమతి పత్రాలు అందుకున్నారు. 9న ఒంగోలులో ప్రజల శ్రేయస్సు కోసం కల్యాణం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. 50 వేల మంది భక్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

చైర్మన్‌ను సంప్రదించలేదంటూ..

కొద్ది రోజులకే కల్యాణం నిర్వహణకు సహకరించలేమని టీటీడీ అధికారుల నుంచి బాలినేనికి సమాచారం వచ్చినట్లు తెలిసింది. చైర్మన్‌ను సంప్రదించకుండా.. కనీసం పాలక మండలికైనా లేఖ పంపలేదనే సాకుతో అనుమతులను నిలిపివేసినట్లు సమాచారం. చైర్మన్‌తో మాట్లాడాలని కొందరు అధికారులు మౌఖికంగా బాలినేనికి చెప్పినట్లు తెలిసింది. అందుకు ఆయన ససేమిరా అన్నారు. ఇచ్చిన అనుమతులు ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. వారు కాలయాపన చేయడంతో ఇక్కడ కల్యాణం జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. రాష్ట్రస్థాయి నాయకులు మీరూ, మీరూ తేల్చుకోవాలని సూచించినట్లు సమాచారం.

నేనూ చేయగలను..!

ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం సీఎంను బాలినేని కలిసి సుబ్బారెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తన మనవడి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని.. వైవీ జోక్యంతోనే ఇదంతా జరిగిందని ఆరోపించినట్లు సమాచారం. తానుకూడా చాలా అడ్డంకులు సృష్టించగలనని, సీఎం సూచనలతో సర్దుకుపోతున్నానని చెప్పారని.. పరిశీలించి చర్యలు తీసుకుంటానని సీఎం ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత వైవీని పిలిపించుకుని జగన్‌ మాట్లాడారు. ఒంగోలులో శ్రీనివాస కల్యాణం నిర్వహణకు అడ్డంకుల్లేకుండా చూడాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇంతలో బాలినేని 4రోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్లడంతో వివాదం ముదిరిందని.. కల్యాణం ఇక లేనట్లేనని ప్రచారం జరిగింది. అయితే తాజాగా కల్యాణం నిర్వహణకు టీటీడీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లు తెలిసింది. బాలినేని, వైవీ మధ్య విభేదాలు చాలాకాలం నుంచే ఉన్నాయి. జగన్‌ జోక్యం చేసుకుని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ బాధ్యతలను బాలినేనికి కేటాయించి.. ఉత్తరాంధ్ర బాధ్యతలు వైవీకి అప్పగించారు. అయినా ఇద్దరూ కలవకపోగా పంతాలకు పోతూనే ఉన్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

Updated Date - 2022-10-26T10:35:27+05:30 IST