గమ్యం చూపని మునుగోడు!

ABN , First Publish Date - 2022-11-09T05:45:21+05:30 IST

వారంతా అధికార పార్టీ వారు. కానీ, పార్టీలో అంతర్గత పోరును ఎదుర్కొంటున్నారు. అవకాశం వస్తే పార్టీని వీడదామనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం మునుగోడు ఉప ఎన్నికలో ..

గమ్యం చూపని మునుగోడు!

అయోమయంలో టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలు..

ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యేలు, మాజీల అంతర్గత పోరు

మునుగోడులో గెలిచే ప్రతిపక్ష పార్టీలో చేరాలనుకున్న నేతలు

టీఆర్‌ఎస్‌ గెలవడంతో మరికొన్నాళ్లు వేచిచూడాలని నిర్ణయం!

ఖమ్మం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): వారంతా అధికార పార్టీ వారు. కానీ, పార్టీలో అంతర్గత పోరును ఎదుర్కొంటున్నారు. అవకాశం వస్తే పార్టీని వీడదామనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం మునుగోడు ఉప ఎన్నికలో ప్రతిపక్ష పార్టీల్లో ఏదో ఒకటి గెలవాలని కోరుకున్నారు. గెలిచిన పార్టీలో చేరాలనుకున్నారు. కానీ, మునుగోడు ఫలితం వారి ఆశలను అడియాసలు చేసింది. ఉప ఎన్నికలో అధికార పార్టీయే గెలవడంతో ఇప్పుడు ఎటు వెళ్లాలో తెలియని అయోమయం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ అన్ని పార్టీల నుంచి నాయకులు పెద్దసంఖ్యలో టీఆర్‌ఎ్‌సలో చేరిన విషయం తెలిసిందే. దీంతో కారు ఓవర్‌లోడ్‌ అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలుండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రస్తుత రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఒక్కరే గెలుపొందారు. మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో ఎనిమిది చోట్ల కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. వైరాలో కాంగ్రెస్‌ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో నలుగురు, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు.

అయితే వీరి చేరికతో ఆయా నియోజకవర్గాల్లో వీరి చేతిలో ఓడిన టీఆర్‌ఎస్‌ నేతలకు ఇబ్బందులు మొదలయ్యాయి. వారి హవా తగ్గి, వలస వచ్చిన ఎమ్మెల్యేలదే అంతా సాగుతుండడంతో అంతర్గత పోరు నడుస్తోంది. దీంతో ఆ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం వర్గాలుగా చీలి ఉంది. తమకు ప్రాధాన్యం ఇవ్వడంలేదన్న అసంతృప్తితో కొందరు మాజీలు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎ్‌సలోని ఇతర అసంతృప్త నేతలు బీజేపీలోగానీ, కాంగ్రె్‌సలోగానీ చేరతారని ప్రచారం జరుగుతోంది. వీరిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం లోక్‌సభ స్థానానికి అప్పటి సిట్టింగ్‌ ఎంపీగా ఉండి కూడా టికెట్‌ దక్కని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారు ఉన్నారు. పొంగులేటి పార్టీ మారతారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి ఆహ్వానాలు కూడా అందుతున్నాయి. మునుగోడు ఎన్నిక ఫలితాలను బట్టి ఆయన పార్టీ మారతారని జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో పొంగులేటికి అవకాశం ఉంటుందని టీఆర్‌ఎ్‌సలో ప్రచారం జరుగుతున్నా ఆయన వర్గీయులు దానిని విశ్వసించడంలేదు.మునుగోడు ఫలితాన్ని బట్టి పొంగులేటి నిర్ణయం ఉంటుందని అందరూ భావించగా.. ఆ ఫలితం విపక్షాలకు అనుకూలంగా రాలేదు. దీంతో పొంగులేటి వర్గం ఇప్పట్లో పార్టీ మారే అవకాశం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. వీరే కాకుండా టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలెవరూ పార్టీని విడిచివెళ్లే పరిస్థితి లేదని, అసెంబ్లీ సాధారణ ఎన్నికల సమయంలో నిర్ణయాలుంటాయని ఆయా నేతల అనుచరులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-11-09T14:38:09+05:30 IST