Kuwait: మధ్యాహ్నం వేళ పని.. జూన్ నుంచే నిషేధం అమలు
ABN , First Publish Date - 2022-05-26T14:27:20+05:30 IST
ఎండలు ముదురుతున్న నేపథ్యంలో కువైత్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(PAM) మధ్యాహ్నం పనివేళల విషయమై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

కువైత్ సిటీ: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో కువైత్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(PAM) మధ్యాహ్నం పనివేళల విషయమై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ నం.535/2015ను వచ్చే నెల మొదటి నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో కార్మికుల చేత పని చేయించకూడదు. ఈ సమయంలో ఎండ ప్రభావం నేరుగా కార్మికుల మీద పడుతుంది. ఇది ఎంతో ప్రమాదం. ఇలా ఎండ ప్రభావం నేరుగా కార్మికుల మీద ఉండకూదన్నది ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం. జూన్ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా పని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తారు. ఎవరైన నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి. అలాగే భారీ జరిమానాలు విధించడం జరుగుతుంది. ఒక్కొ కార్మికుడికి 100 నుంచి 200 కువైటీ దినార్లు(రూ.25వేల నుంచి 50వేల వరకు) చొప్పున వారితో పని చేయించిన యజమానికి జరిమానా ఉంటుంది. కనుక సంస్థల యజమానులు ఈ నిర్ణయాన్ని తప్పకుండా అమలు చేయాల్సిందేనని PAM అధికారులు సూచించారు.