Saudi Arabia: వందలాది తెలుగు కుటుంబాలకు షాక్.. మాతృభూమికి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు!
ABN , First Publish Date - 2022-04-23T12:59:48+05:30 IST
సౌదీ అరేబియాలో సందర్శక వీసాల పునరుద్ధరణ గడువుపై అకస్మాత్తుగా ఆంక్షలు విధించడంతో ప్రవాసీలు ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు యేడాది ఉన్న ఈ వీసా గడువును ఇప్పుడు ఉన్నట్టుండి మూడు నెలలకే కుదించడంతో వందలాది తెలుగు ప్రవాసీల కుటుంబాల మాతృ భూమికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

సౌదీలో విజిట్ వీసాల రెన్యువల్ నిలిపివేత
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): సౌదీ అరేబియాలో సందర్శక వీసాల పునరుద్ధరణ గడువుపై అకస్మాత్తుగా ఆంక్షలు విధించడంతో ప్రవాసీలు ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు ఏడాది ఉన్న ఈ వీసా గడువును ఇప్పుడు ఉన్నట్టుండి మూడు నెలలకే కుదించడంతో వందలాది తెలుగు ప్రవాసీల కుటుంబాల మాతృ భూమికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. తమ దేశంలో పని చేస్తున్న ప్రవాసీయులు.. వారి తల్లిదండ్రులు లేదా భార్యా పిల్లలను పిలిపించుకోవడానికి సౌదీ అరేబియా ప్రభుత్వం సందర్శక వీసాలు జారీ చేస్తుంది. దీని గడువు మూడు నెలలు ఉంటుంది. ప్రతి మూడు మాసాలకు ఒకసారి చొప్పున సంవత్సరం వరకు దీనిని రెన్యువల్ చేసుకోవచ్చు. రెండు మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది కుటుంబాలు ఈ వీసాలతో గరిష్ఠంగా ప్రయోజనం పొందుతున్నాయి.
ఐటీ రంగంలో పని చేస్తున్న చాలా మంది దీనిని ఉపయోగించుకుంటున్నారు. అయితే, నాలుగు రోజులుగా ఈ వీసా పునరుద్ధరణను అధికారులు నిలిపివేశారు. దీంతో గడువు దగ్గరపడిన కుటుంబాలన్నీ వెంటనే తిరుగు పయనం కావలసిన పరిస్థితి నెలకొంది. భార్యా పిల్లలు ఏడాది పాటు తనతోనే ఉంటారని ఇల్లు, సామగ్రి ఇతరత్రా అంతా సమకూర్చుకున్నానని, కానీ ఇప్పుడు వీసా రెన్యువల్ కాకపోవడంతో వారిని స్వదేశానికి పంపిస్తున్నానని విశాఖపట్టణానికి చెందిన శ్రీరాజ్ కుమార్ తెలిపారు. అకస్మాత్తుగా రెన్యువల్ను నిలిపివేయడంతో ఆర్థికంగా నష్టపోయానని హైదరాబాద్కు చెందిన ఫసీఖాన్ చెప్పారు. తొలుత సాంకేతిక సమస్య అనుకున్నా, తర్వాత అధికారులు గడువును కుదించారని తెలిసి షాక్కు గురయ్యామని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సత్యప్రకాశ్ చెప్పారు. ఇలా వందలాది మంది ప్రవాసీలు తమ కుటుంబ సభ్యులను వెనక్కి పంపించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఫ్యామిలీ వీసాలకు ఖర్చు ఎక్కువనే..సౌదీలో ప్రవాసీలు కుటుంబ సభ్యులను తమతో పాటు ఉంచుకోవడానికి ఫ్యామిలీ వీసాను జారీ చేస్తారు. దీనికి ప్రతి కుటుంబ సభ్యుడిపై సంవత్సరానికి 2 వేల రియాళ్ల ఫీజుతో పాటు వైద్య బీమా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రవాసీలు సులువుగా లభించే సందర్శక వీసాలపై తల్లిదండ్రులు, భార్యా పిల్లలను తీసుకురావడం సాధారణమైపోయింది. ఇది క్రమేణా పెరిగిపోతుండడంతో అధికారులు దీన్ని నిలిపివేశారు. మారిన నిబంధనలతో ఇప్పుడు ఎవరైనా సందర్శక వీసాలను సంవత్సరం వరకు రెన్యువల్ చేసుకోవడానికయ్యే ఖర్చు ఫ్యామిలీ వీసా కంటే ఎక్కువవుతుంది.