Ukraine Conflict: ఆందోళనలో యూఏఈలోని భారత ప్రవాసులు.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ పిల్లల కోసం ఎదురుచూపులు..

ABN , First Publish Date - 2022-03-02T15:50:35+05:30 IST

యూఏఈలోని భారత ప్రవాసులు ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం యుద్ధంతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌‌లో వారి పిల్లలు చిక్కుకుపోవడమే.

Ukraine Conflict: ఆందోళనలో యూఏఈలోని భారత ప్రవాసులు.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ పిల్లల కోసం ఎదురుచూపులు..
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న నీనిన్, శ్రేయసి, రోహన్..

దుబాయ్: యూఏఈలోని భారత ప్రవాసులు ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం యుద్ధంతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌‌లో వారి పిల్లలు చిక్కుకుపోవడమే. యూఏఈ నుంచి వెళ్లిన సుమారు 12 మంది భారత సంతతి విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకపోయినట్లు సమాచారం. అల్ ఐన్‌లో నివాసముండే గోపకుమార్ గోపాలన్ అనే భారత వ్యక్తి కుమార్తె శ్రేయసి గోపకుమార్ కూడా ఈ 12 మందిలో ఒకరు. ఆమె ఖర్కీవ్‌‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్నట్లు గోపాలన్ వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌లోనే ఆమె ఎంబీబీఎస్ కోసం ఉక్రెయిన్ వెళ్లిందని ఆయన తెలిపారు. వీఎన్ కరాజిన్ ఖర్కీవ్ నేషనల్ యూనివర్శిటీలో శ్రేయసి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతుందని గోపాలన్ చెప్పారు. యుద్ధం తర్వాత ఉక్రెయిన్‌లో నెలకొన్న భీకర పరిస్థితుల నేపథ్యంలో తాము క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా సరిహద్దుకు సమీపంలోని ఓ బంకర్‌లో ఆమె తలదాచుకున్నట్లు గోపాలన్ తెలియజేశారు. భారత ప్రభుత్వం చేపట్టిన తరలింపు ప్రక్రియ తర్వాత కొంచెం ధైర్యం వచ్చినా.. ఎప్పుడు తమ కూతురు స్వదేశానికి వస్తుందో చెప్పలేని పరిస్థితి అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 


అటు అబుదాబిలో ఉండే డా. రంజిత్ కుమార్, సంతోష్ చటర్జీలు కూడా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తమ కుమారుల విషయమై ఆవేదన వ్యక్తం చేశారు. పోలెండ్‌‌ సమీపంలోని ఉక్రెయిన్ బార్డర్‌లో గత మూడు రోజులుగా వారు ఉంటున్నట్లు తెలిపారు. రంజిత్ కుమారుడు రోహన్, చటర్జీ కొడుకు నీనిన్ ఇద్దరూ లీవ్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్‌లో చదువుతున్నారు. వార్ మొదలైన తర్వాత ఉక్రెయిన్ సరిహద్దుకు వెళ్లేందుకు తన కుమారుడితో పాటు 12 మంది విద్యార్థుల బృందం మైనస్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలో సుమారు 50 కిలోమీటర్లు నడిచినట్లు రంజిత్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తరలించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలను రంజిత్, చటర్జీలు ప్రశంసించారు. భారత విదేశాంగ శాఖతో పాటు కేరళకు చెందిన నాన్-రెసిడెంట్ కేరళ అఫైర్స్(నోర్కా-రూట్స్) విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపించడం తమను ఎంతో ఉపశమనం కలిగించిందన్నారు. వీలైనంత త్వరగా తమ కుమారులను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తరలించాలని వారు భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.


ఇదిలాఉంటే.. ఖర్కీవ్‌, కీవ్‌ సహా ఇతర ప్రాంతాల్లోని భారతీయ విద్యార్థులు, పౌరులను క్షేమంగా తక్షణమే ఆయా ప్రాంతాల నుంచి తరలించాలని దౌత్యకార్యాలయ అధికారులను భారత విదేశాంగ శాఖ ఆదేశించింది. రాబోయే మూడు రోజుల్లో 26 విమానాల ద్వారా వీరిని స్వదేశానికి తరలించనున్నట్టు విదేశీవ్యవహారాల శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అలాగే మంగళవారం ఉదయం కీవ్‌ నగరాన్ని తక్షణమే విడిచిపెట్టాలని అక్కడి విద్యార్థులకు భారత ప్రభుత్వం పిలుపునిచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ అంచనాల మేరకు 16 వేల మంది భారతీయ విద్యార్థులు ఇప్పటికీ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి ఉన్నారు. వీరిలో కొందరు బంకర్లలో తలదాచుకోగా, మరికొందరు మెట్రో స్టేషన్లలో, బాంబు షెల్టర్లలో బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక.. స్వదేశానికి తిరిగి వచ్చే విద్యార్థులు పాస్‌పోర్టు సహా అవసరమైన నగదు, చలిని తట్టుకునే దుస్తులు వెంట ఉంచుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది.        


Updated Date - 2022-03-02T15:50:35+05:30 IST