Kuwaiti ఫ్యామిలీ హత్య కేసులో అరెస్టైన తెలుగు వ్యక్తి.. జైల్లోనే బలవన్మరణం..!

ABN , First Publish Date - 2022-03-17T15:38:22+05:30 IST

కువైత్‌లో ముగ్గురు కుటుంబ సభ్యుల హత్య ఆరోపణలపై అరెస్టైన తెలుగు వ్యక్తి పిల్లోల వెంకటేష్(35) బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Kuwaiti ఫ్యామిలీ హత్య కేసులో అరెస్టైన తెలుగు వ్యక్తి.. జైల్లోనే బలవన్మరణం..!

కువైత్ సిటీ: కువైత్‌లో ముగ్గురు కుటుంబ సభ్యుల హత్య ఆరోపణలపై అరెస్టైన తెలుగు వ్యక్తి పిల్లోల వెంకటేష్(35) బలవన్మరణానికి పాల్పడ్డాడు. జైలు గదిలోనే ఉరివేసుకొని చనిపోయినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని అక్కడి ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ట్విటర్ ద్వారా తెలియజేసింది. బుధవారం రాత్రి(కువైత్ కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని కడపలోని కుటుంబ సభ్యులకు అక్కడి అధికారుల ద్వారా సమాచారం అందింది. వెంకటేష్‌ది ఏపీలోని కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నేపాడు గ్రామం. మూడేళ్ల క్రితం ఉపాధి కోసం కువైత్ వెళ్లాడు. ఆర్ధియాలో ఓ వ్యక్తి వద్ద డ్రైవర్‌గా పనికి కుదిరాడు. అనంతరం రెండేళ్ల తర్వాత భార్య స్వాతిని కూడా తనతో పాటు కువైత్ తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఈ నెల 4న వెంకటేష్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కుటుంబానికి చెందిన ముగ్గురు వారి నివాసంలోనే అనుమానస్పదస్థితిలో మృతిచెందడం కలకలం సృష్టించింది. 


వారి శరీరంపై కత్తితో పొడిచిన అనవాళ్లు ఉన్నాయి. 80 ఏళ్ల వ్యక్తితో పాటు అతని భార్య(50), కూతురు(18) వారి ఇంట్లో వేర్వేరు చోట్ల విగతజీవులుగా పడి ఉన్నారు. అప్పటికే వారు చనిపోయి నాలుగు రోజులు కావడంతో మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన రావడం వల్ల ఈ ఘటన బయటకు వచ్చింది. దీంతో ఈ కేసును సవాల్‌గా తీసుకున్న కువైత్ పోలీసులు.. అక్కడి డిటెక్టివ్స్ సహాయంతో కేవలం 48 గంటల్లోనే ఓ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి సీసీటీవీ కెమెరాలలో రికార్డైన దృశ్యాల ఆధారంగా కువైత్ పోలీసులు ఈ నెల 6న సులైబియా ప్రాంతంలో కారు డ్రైవర్ వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమ విచారణలో ఆ ముగ్గురిని తానే హత్య చేసినట్లు వెంకటేష్ అంగీకరించినట్లు కువైత్ పోలీసులు వెల్లడించారు. ఆ కుటుంబ యజమానితో ఆర్థిక వివాదం కారణంగా వారిని చంపినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. 
అయితే, ఆ హత్యలతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని వెంకటేష్ భార్య స్వాతి ముందు నుంచి తీవ్రంగా ఖండిస్తోంది. తప్పుడు కేసు పెట్టి తన భర్తను జైల్లో పెట్టారని ఆరోపించింది. వెంకటేష్‌ని అరెస్ట్ చేసి జైలుకి తరలించిన తర్వాత తనను కువైత్ నుంచి బలవంతంగా స్వదేశానికి పంపించారని పేర్కొంది. మృతులకు వారి బంధువులతో గొడవలు ఉన్నాయని, వారే ఈ హత్యలు చేసి.. వెంకటేష్‌ను ఇరికించి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. పొట్టకూటి కోసం దేశం కాని దేశానికి వెళ్లిన తాము అంత పెద్ద వారిని ఎందుకు హత్య చేస్తామని కన్నీళ్లు పెట్టుకుంది. నిర్దోషి అయిన తన భర్తను విడిపించాల్సిందిగా ఇటీవల కడప కలెక్టర్‌ని కూడా కలిసింది. ఆ ప్రయత్నాల్లో ఉండగానే ఇప్పుడు ఘోరం జరిగిపోయింది. జైల్లోనే వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేష్ సూసైడ్ చేసుకున్నాడన్న సమాచారంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనతో వెంకటేష్ స్వగ్రామం దిన్నేపాడులో విషాదం అలుముకుంది. 

Updated Date - 2022-03-17T15:38:22+05:30 IST