ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో తెలుగుదేశం జెండా

ABN , First Publish Date - 2022-12-05T08:34:42+05:30 IST

ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ పోటీలు విశ్వవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి సాకర్‌ అభిమానులు ఖతార్‌కు చేరుకుని..

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో తెలుగుదేశం జెండా

ఖతార్‌లో ప్రదర్శించిన తెలుగు అభిమానులు

చిత్తూరు జిల్లా ప్రవాసీయుల సాహసం

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి: ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ పోటీలు విశ్వవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి సాకర్‌ అభిమానులు ఖతార్‌కు చేరుకుని.. ఆయా దేశాల జాతీయ పతాకాలతో తమ జట్లను ఉత్సాహపరుస్తున్నారు. ఈ ప్రపంచక్‌పలో భారత్‌ భాగస్వామ్యం లేకపోయినా.. భారతీయులు సైతం స్టేడియాలకు చేరుకుని తమ అభిమాన ఆటగాళ్లకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన యువకులు మాత్రం వరల్డ్‌కప్‌ వేదికగా తెలుగుదేశం పార్టీ జెండాను ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గ్రూప్‌-జిలో స్విట్జర్లాండ్‌, సెర్బియా జట్ల మధ్య మ్యాచ్‌ సందర్భంగా 974 స్టేడియం వద్ద తెలుగుదేశం పార్టీ గల్ఫ్‌ ఎన్నారై విభాగం సభ్యులు చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన గంగవరపు ముద్దుముని స్వామి, పిలేరుకు చెందిన అడుసుమిల్లి గిరి పార్టీ జెండాను రెపరెపలాడించారు. వీరిద్దరూ ఖతార్‌లో పనిచేస్తున్నారు. వాస్తవానికి ఆయా దేశాల జాతీయ జెండాలు తప్ప ఇతర ఏ రకమైన జెండాలు లేదా చిహ్నాల్ని ప్రదర్శించడం ఖతార్‌లో నిషేధం. ఇరాన్‌లో జరుగుతున్న మహిళల నిరసన ప్రదర్శనల కారణంగా క్రీడాభిమానులెవరూ ఏ రకమైన రాజకీయ జెండాలు ప్రదర్శించకుండా ఖతార్‌ అప్రమత్తమైంది. ఎక్కడ ఏ చిన్న సైజు జెండా కానీ, ప్లకార్డు కానీ ప్రదర్శించినా మఫ్టీ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయినా టీడీపీ మీద అభిమానంతో ఈ ఇద్దరు సాహసం చేసి పార్టీ జెండాను ప్రదర్శించడం విశేషం.

Updated Date - 2022-12-05T08:35:30+05:30 IST