విద్యార్థులకు తానా ఫౌండేష‌న్‌ ‘చేయూత‌’.. 83 మందికి స్కాల‌ర్‌షిప్‌లు!

ABN , First Publish Date - 2022-01-24T21:48:44+05:30 IST

`ప‌డాల ట్ర‌స్ట్‌`తో క‌లిసి తానా ఫౌండేష‌న్‌.. 83 మంది నిరుపేద‌లైన విద్యార్థుల‌కు ఈ ఏడాది కూడా ‘చేయూత’ స్కాల‌ర్ షిప్పులు పంపిణీ చేసింది.

విద్యార్థులకు తానా ఫౌండేష‌న్‌ ‘చేయూత‌’.. 83 మందికి స్కాల‌ర్‌షిప్‌లు!

ప్రార్థించే పెద‌వుల క‌న్నా.. సాయం చేసే చేతులు మిన్న‌-అన్న సూక్తిని పాటిస్తూ, తెలుగు అసోసియేష‌న్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ‘చేయూత’ ప‌థ‌కం కింద పేద విద్యార్థుల‌కు ఆప‌న్న హ‌స్తం అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే `ప‌డాల ట్ర‌స్ట్‌`తో క‌లిసి తానా ఫౌండేష‌న్‌.. 83 మంది నిరుపేద‌లైన విద్యార్థుల‌కు ఈ ఏడాది కూడా ‘చేయూత’ స్కాల‌ర్‌షిప్‌లు పంపిణీ చేసింది. తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ ప‌ట్ట‌ణంలోని గాంధీ భ‌వ‌న్‌లో ఈ నెల 20న జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ స్కాల‌ర్‌షిప్‌ల పంపిణీ చేప‌ట్టింది. 


స్కాల‌ర్‌షిప్‌లు అందుకున్న వారిలో బ్యాచిల‌ర్ డిగ్రీ విద్యార్థులు ఉన్నారు. మొత్తం 83 మంది విద్యార్థుల్లో 45 మందికి గ‌త మూడేళ్లుగా స్కాల‌ర్‌షిప్‌ల పంపిణీ జరుగుతోంది. వీరినే మ‌రోసారి ఎంపిక చేసి స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు. ‘శ‌శికాంత్ వ‌ల్లేప‌ల్లి’ కుటుంబం, ఐశ్వ‌ర్య శ్యామ్‌రాజ్ ఈ స్కాల‌ర్‌షిప్‌లు అందించారు. ఈ సంద‌ర్భంగా ప‌డాల ట్ర‌స్ట్ చైర్మ‌న్ సూర్య ప‌డాల.. ‘తానా’ అధ్య‌క్షులు అంజ‌య్య చౌద‌రి లావు, ‘తానా’ ఫౌండేష‌న్ చైర్మ‌న్ వెంక‌ట ర‌మ‌ణ యార్ల‌గ‌డ్డతో త‌నకున్న అనుబంధాన్ని వివరించారు. ‘తానా’లో త‌న‌కు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. అయితే.. ప్ర‌స్తుతం క‌రోనా థ‌ర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో క‌రోనా ప్రొటోకాల్‌ను పాటిస్తూ, అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుని ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. స్కాల‌ర్‌షిప్‌లు అందుకున్న ప్ర‌తి ఒక్కరినీ నిర్వాహకులు అభినందించారు. విద్య‌లో మ‌రింత‌గా రాణించాల‌ని ఆకాంక్షించారు. 

Updated Date - 2022-01-24T21:48:44+05:30 IST