Dubai: అంగరంగ వైభంగా వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం
ABN , First Publish Date - 2022-04-05T12:54:41+05:30 IST
ఎడారి దేశంలోనూ శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. దుబాయ్‌లోని ప్రవాసాంధ్రుడు కటారు సుదర్శన్ ఆధ్వర్యంలో.. శనివారం ఆజ్మాన్‌లో స్వామివారికి సుప్రభాత సేవ, పాలు, గంధం, పంచామృతాలతో అభిషేక సేవలను రోజంతా నిర్వహించారు. దుబాయ్, అబుధాబి, షార్జా, ఆజ్మాన్, రాస్ అల్ ఖైమా..

15 వేల మంది భక్తుల హాజరు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): ఎడారి దేశంలోనూ శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. దుబాయ్‌లోని ప్రవాసాంధ్రుడు కటారు సుదర్శన్ ఆధ్వర్యంలో.. శనివారం ఆజ్మాన్‌లో స్వామివారికి సుప్రభాత సేవ, పాలు, గంధం, పంచామృతాలతో అభిషేక సేవలను రోజంతా నిర్వహించారు. దుబాయ్, అబుధాబి, షార్జా, ఆజ్మాన్, రాస్ అల్ ఖైమా తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 15 వేల మంది తెలుగు ప్రవాసీలు కార్యక్రమానికి హాజరై స్వామివారి సేవలో తరించారు. పండితుల వేదమంత్రాలు, వేంకటేవ్వరుని కీర్తనలతో కల్యాణ వేదిక ఆధ్యాత్మిక శోభతో అలరారింది. దుబాయ్‌లోని భక్తుల కోరిక మేరకు టీటీడీ అధికారులు కందూరి శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో నలుగురు పూజారుల బృందాన్ని ప్రత్యేకంగా ఇక్కడికి పంపించారు.
ఈ కార్యక్రమంలో దుబాయ్‌లోని ఏకైక హిందూ ఆలయమైన కృష్ణా మందిర నిర్వాహకుడు వాసు ష్రాఫ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన పంచాగకర్త డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమాలకు తిరుపతిలోని హోటల్ సింధూరి పార్క్ యజమాని శశిధర్ బాబు పూర్తిగా తోడ్పాటునందించారని నిర్వాహకులు తెలిపారు. కల్యాణోత్స నిర్వహణ భాధ్యతలను సుదర్శన్‌తో పాటు ధర్మరాజు, శ్రీనివాస్ ఫాల్తి, వెంకట సుందర్, శ్రీధర్ దామల చేపట్టారు. ఇండియన్ అసోసియేషన్ ప్రతినిధులు అబ్దుల్ సలా, అప్తాబ్ ఇబ్రహీం, రూప్ సింగ్‌లు కూడా కార్యక్రమానికి సహకరించారు.
గల్ఫ్‌లో కాశీ విశ్వనాథుడికి పూజలు!
కాశీలోని విశ్వనాథ మందిరం కూడా ఒక కార్యక్రమాన్ని గల్ఫ్‌లో నిర్వహించాలని ఆశిస్తోంది. ఈ మేరకు శ్రీవారి కల్యాణ కార్యక్రమాన్ని తిలకించేందుకు వారణాసి నుంచి సప్త ఋషులలో ఒకరైన కశ్యాప్ మహామణి వారసుడు అయిన అభిషేక్ చౌబే ప్రత్యేకంగా దుబాయ్‌కి వచ్చారు.