Canada: కెనడాలో భయపెడుతున్న ట్రెండ్.. చోరీలకు తెగబడుతున్న ప్రజలు..

ABN , First Publish Date - 2022-12-18T16:34:00+05:30 IST

పెరుగుతున్న ఆహార ధరలు ఓవైపు.. ఆర్థిక మందగమనం మరోవైపు వెరసి కెనడాలో ఆందోళనకారక ధోరణికి దారితీస్తున్నాయి.

Canada: కెనడాలో భయపెడుతున్న ట్రెండ్..  చోరీలకు తెగబడుతున్న ప్రజలు..

ఎన్నారై డెస్క్: పెరుగుతున్న ఆహార ధరలు ఓవైపు.. ఆర్థిక మందగమనం మరోవైపు వెరసి కెనడాలో(Canada) ఆందోళనకారక ధోరణికి దారితీస్తున్నాయి. దేశవ్యాప్తంగా సూపర్‌మార్కెట్లలో కిరాణా సామాన్ల దొంగతనాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితితో(Shoplifting) కెనడా సంస్థల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయని స్థానిక మీడియా సంస్థ ఒకటి పేర్కొంది. ధరల పెరుగుదలతో లాభాలు వస్తున్నా చోరీలతో వారు ఆందోళనకు గురవుతున్నట్టు పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ అక్టోబర్‌లో ఆహార ఉత్పత్తుల ధరలు ఏకంగా 11 శాతం మేర పెరిగాయి. మునుపటితో పోలిస్తే ఈ ఏడాది నలుగురు సభ్యులున్న కుటుంబం ఆహారంపై అదనంగా వెయ్యి డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తోందని కెనడా ఫుడ్ ప్రైస్ నివేదిక అంచనా వేసింది.

ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడంతోనే ప్రజలు సూపర్‌మార్కె ట్లో చోరీలకు సిద్ధపడుతున్నారని డల్హౌసీ యూనివర్శటీలోని అగ్రీ ఫుడ్ ల్యాబ్ డైరెక్టర్ సిల్వేయిన్ చార్లీబోయిస్ తెలిపారు. ‘‘ధరల పెరుగుదలకు, చోరీల సంఖ్య పెరగడానికి మధ్య సంబంధం ఉంది. చోరీల బెడద ఎప్పుడూ ఉన్నదే. కానీ..తిండి ఖర్చులు పెరిగే కొద్దీ ఇలాంటి చోరీల సంఖ్య పెరుగుతుంది’’ అని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ఆర్థికాభివృద్ధి మరింత తగ్గితే సమస్య మరింత జటిలం కావచ్చని ఆయన హెచ్చరించారు.

ఆగస్టు నుంచి ఇప్పటివరకూ కెనడా కరెన్సీ విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే 11 శాతం మేర పడిపోయింది. కొన్ని జీ10 దేశాల కరెన్సీ విలువతో పోలిస్తే ఈ పతనం మరింత ఎక్కువ. జూన్‌లో 8.1 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం అక్టోబర్ నాటికి 6.9 శాతానికి తగ్గినప్పటికీ.. సుదీర్ఘకాలం పాటూ ద్రవ్యోల్బణం ఇదే స్థాయిలో కొనసాగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓవైపు బలహీనపడుతున్న కెనడా డాలర్..మరోవైపు ఓపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గిస్తుండటంతో కెనడాలో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మాంసం, పళ్లు, కూరగాయలు తదితర వస్తువుల ధరలన్నీ ఓ మోస్తరుస్థాయిలో పెరుగుతున్నాయి.

Updated Date - 2022-12-18T16:43:18+05:30 IST