యూఏఈలో Salman Khan కు అరుదైన గౌరవం.. సల్లూభాయ్‌తో పాటు పలువురు Bollywood Stars కు కూడా..

ABN , First Publish Date - 2022-06-29T16:10:54+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది.

యూఏఈలో Salman Khan కు అరుదైన గౌరవం.. సల్లూభాయ్‌తో పాటు పలువురు Bollywood Stars కు కూడా..

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ విదేశీయులకు దీర్ఘకాలిక రెసిడెన్సీ కోసం ఇచ్చే గోల్డెన్ వీసా (Golden Visa) ప్రకటించింది. సల్లూభాయ్‌తో పాటు జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ దంపతులు, దివ్య కుమార్, భూషణ్ కుమార్, అన్నీస్ బేజ్మీ, అండ్రే తిమ్మిన్స్‌కు కూడా యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. ఈ నెలలో అబుదాబిలోని యాస్ ఐలాండ్ సగర్వంగా 2022 IIFA వీకెండ్ & అవార్డ్స్‌ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన పలువురు నటీనటులు అబుదాబికి వెళ్లారు. ఎతిహాద్ ఏరెనా నెక్సా ఐఐఎఫ్ఏ (Etihad Arena Nexa IIFA) అవార్డ్స్‌కు సంబంధించిన 22వ ఎడిషన్‌కు ఆతిథ్యమిచ్చింది. ఇక ఈ వేదిక సినీ పరిశ్రమకు చెందిన సభ్యుల్లో కొంతమందికి గోల్డెన్ వీసా జారీ ప్రక్రియను సులభతరం చేసే విషయమై అబుదాబి ఫిల్మ్ కమిషన్‌తో కలిసి పనిచేసినందుకు IIFA సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. దీంతో అబుదాబి పరిశ్రమల సృజనాత్మక నిబద్ధతను ప్రతిబింబించేలా IIFA వారాంతంలోనే ఇలా పలువురు బాలీవుడ్ స్టార్స్‌కు (Bollywood Stars) గోల్డెన్ వీసాలు జారీ చేయబడ్డాయి. 


ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ: “అబుదాబి నుండి గోల్డెన్ వీసా పొందడం నాకు గౌరవంగా ఉంది. అబుదాబి ఎల్లప్పుడూ నాకు రెండో ఇల్లులాంటిది. నాకు ఇష్టమైన కొన్ని ప్రాజెక్ట్‌లను ఇక్కడ చిత్రీకరించిన సమయంలో ఎంతో ఆనందించాను. గత కొన్ని సంవత్సరాలుగా మాకు చాలా మద్దతునిచ్చిన ప్రదేశంలో మా చిత్ర పరిశ్రమ IIFA వారాంతంలో వేడుక జరుపుకోవడం చాలా బాగుంది. ఇప్పుడు నా గోల్డెన్ వీసాతో సమీప భవిష్యత్తులో ఇక్కడ తిరిగి పని చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చారు. ఇక యూఏఈ సర్కార్ విదేశీయులకు లాంగ్‌టర్మ్ రెసిడెన్సీ కోసం 5, 10 ఏళ్ల కాలపరిమితో గోల్డెన్ వీసాలను మంజూరు చేస్తోంది. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనంకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు కూడా నిర్వహించుకోవచ్చు.


2018 కేబినెట్ తీర్మానం నం. 56 ప్రకారం పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్లు), పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు గోల్డెన్ వీసా ఇవ్వడం జరుగుతోంది. ఇదిలాఉంటే.. భారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఈ వీసా అందుకున్న బాలీవుడ్ స్టార్స్‌ జాబితాలో రణవీర్ సింగ్, ఫర్హా ఖాన్, వరుణ్ ధావన్, బోనీ కపూర్ ఫ్యామిలీ, మౌనీ రాయ్, సంజయ్‌దత్, సునీల్ శెట్టి, సోను నిగమ్ ఉండగా ఇప్పుడు సల్లూభాయ్, జెనీలియా దంపతులు చేరారు. అలాగే బాలీవుడ్ స్టార్స్‌తో పాటు మలయాళం నుంచి మోహన్‌లాల్, మమ్ముటీ, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఉన్నారు. వీరితో పాటు గాయని చిత్ర, తమిళ నటి త్రిష క్రిష్ణన్, నటి అమల పాల్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసన కూడా యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు.   


Updated Date - 2022-06-29T16:10:54+05:30 IST