Rishi Sunak: బ్రిటన్‌లో చదవాలనుకునే వారికి అలర్ట్.. కీలక నిర్ణయం దిశగా రిషి సునాక్..

ABN , First Publish Date - 2022-11-26T20:27:29+05:30 IST

బ్రిటన్‌లోకి వలసలు నిరోధించేందుకు ప్రధాని రిషి సునాక్ తన ముందున్న అన్ని మార్గాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

Rishi Sunak: బ్రిటన్‌లో చదవాలనుకునే వారికి అలర్ట్.. కీలక నిర్ణయం దిశగా రిషి సునాక్..

ఎన్నారై డెస్క్: బ్రిటన్‌లోకి వలసలు నిరోధించేందుకు ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) తన ముందున్న అన్ని మార్గాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా..దేశంలోకి విదేశీ విద్యార్థుల రాకడను తగ్గించే యోచనలో(Curbs) ప్రధాని ఉన్నట్టు ప్రముఖ వార్తా చానల్ బీబీసీ తాజాగా పేర్కొంది. దిగువస్థాయి(Low Quality) డిగ్రీ కోర్సుల్లో చదివేందుకు బ్రిటన్ వచ్చే విదేశీ విద్యార్థులను(Foreign Students) అడ్డుకునేలా ఆంక్షలు విధించే యోచనలో ప్రధాని ఉన్నారట. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయానికి చెందిన ఓ అధికారి పేర్కొన్నట్టు బీబీసీ వెల్లడించింది. అంతేకాకుండా.. విదేశీయులపై ఆధారపడ్డ వారిని కూడా బ్రిటన్‌లోకి రాకుండా కట్టడి చేసే యోచనలో బ్రిటన్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఏయే డిగ్రీ కోర్సులను దిగువస్థాయికి చెందినవిగా పరిగణిస్తారో ఇంకా స్పష్టత రాలేదు.

ఇటీవల కాలంలో బ్రిటన్‌లోకి వలసలు బాగా పెరిగిన వైనం అధికారిక గణాంకాల్లో తాజాగా వెల్లడైంది. ఆఫీస్‌ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం.. 2021లో దేశంలోకి 1.73,000 మంది విదేశీయులు వలసొస్తే.. ఈ ఏడాది వారి సంఖ్య ఏకంగా 5,04,000కి చేరింది. అంతర్జాతీయ విద్యార్థుల రాకడ పెరగడంతోనే వలసల్లో ఈ స్థాయి వృద్ధి నమోదైంది. ముఖ్యంగా..బ్రిటన్‌లోని విదేశీ విద్యార్థుల్లో సంఖ్యాపరంగా భారతీయులు చైనీయులను దాటి తొలిసారిగా నెం.1 స్థానాన్ని ఆక్రమించారు. ఈ నేపథ్యంలో ప్రధాని రిషి సునాక్ ఏ నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ తారాస్థాయిలో జరుగుతోంది.‘‘బ్రిటన్ వలస విధానంతో ఆశించిన ప్రయోజనాలు చేకూరేలా అన్ని చర్యలను పరిశీలిస్తాం’’ అని రిషి సునాక్ అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

అయితే..విదేశీ విద్యార్థుల రాకడకు అడ్డుకట్టు వేయడం అనుకున్నంత సులభం కాదని పరిశీలకులు చెబుతున్నారు. స్థానిక విద్యార్థులకు సబ్సిడీ రేట్లపై విద్యను అందించే బ్రిటన్ యూనివర్సిటీలు ఆదాయంలో లోటును పూడ్చుకునేందుకు విదేశీ విద్యార్థులపైనే ఆధారపడతాయి. విదేశీ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసి రాబడిని పెంచుకుంటాయి. ఇక దిగువస్థాయి డిగ్రీల విషయంలో ప్రధాని రిషి కట్టడి చర్యలకు ఉపక్రమిస్తే.. కొన్ని యూనివర్సిటీలు దివాళా తీసే అవకాశం ఉందని అక్కడి విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2022-11-26T20:35:29+05:30 IST