ఊబకాయంతో NRI మహిళ సతమతం.. అమెరికా వైద్యులను కాదని ఇండియాలో శస్త్రచికిత్స.. ఆపరేషన్ జరిగిన 21 రోజులకు..
ABN , First Publish Date - 2022-06-30T23:05:33+05:30 IST
ఊబకాయంతో(Obesity) సతమతమవుతున్న ఓ భారత సంతతి అమెరికా మహిళకు(NRI) భారత్‌లో కొత్త జీవితం లభించింది.

ఎన్నారై డెస్క్: ఊబకాయంతో(Obesity) సతమతమవుతున్న ఓ భారత సంతతి అమెరికా మహిళకు(NRI) భారత్‌లో కొత్త జీవితం లభించింది. అమెరికా వైద్యులను కాదనుకుని ఇండియా వచ్చి ఆపరేషన్ చేయించుకున్న ఆమె.. 21 రోజుల్లోనే భారీగా బరువుతగ్గి ఒబెసిటీ నుంచి బయటపడింది. న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి వైద్యులు ఆమెకు విజయవంతంగా రోబోటిక్ బేరియాట్రిక్ సర్జరీ(Robotic Bariatric surgery) నిర్వహించారు.
44 ఏళ్ల వయసున్న ఆమె గత కొన్నేళ్లుగా ఊబకాయంతో బాధపడుతోందని వైద్యులు తెలిపారు. సంప్రదాయ పద్ధతుల్లో బరువు తగ్గుదామని ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సమస్య నుంచి బయటపడేందుకు ఆహారాన్ని బాగా తగ్గించేసి వ్యాయామం చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. మరోవైపు.. ఊబకాయం కారణంగా డయాబెటిస్(Diabetis), హైబీపీ(hypertension), థైరాయిడ్(Hyperthyroidism) లాంటి ఇతర సమస్యలు కూడా ఆమెను చుట్టుముట్టాయి. ఇలాంటి సమయంలో సర్జరీ మినహా మరో మార్గాంతరం లేదని అమెరికాలోని వైద్యులు ఆమెకు తేల్చి చెప్పారు.
అయితే.. సదరు మహిళ భారత్‌లోనే శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుని.. దేశరాజధాని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేరారు. రోగిని పరీక్షించిన వైద్యులు వెంటనే రోబోటిక్ బేరియాట్రిక్ ఆపరేషన్ చేయాలని సూచించారు. బీపీ, మధుమేహాన్ని నియంత్రించేందుకు ఇది అత్యవసరమన్నారు. ఇటీవలే ఆమెకు విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు. శస్త్రచికిత్స తరువాత రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుండటంతో డిశ్చార్జ్ అయ్యారు. ఆపరేషన్‌కు పూర్వం ఆమె 114.2 కేజీలు ఉండగా.. ఆ తరువాత 21 రోజుల్లోనే ఆమె 8 కేజీల బరువు తగ్గారు. దీంతో.. ఆమె ఆరోగ్యం మరింతగా మెరుగయ్యింది. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఆస్పత్రి వైద్యులు ఈ వివరాలను వెల్లడించారు.