NRI TDP: టీడీపీ గెలుపే లక్ష్యం.. ఎన్నారైల సమావేశం!

ABN , First Publish Date - 2022-10-17T15:19:27+05:30 IST

‘కనీస సౌకర్యాలు కూడా కరువైన రాష్ట్రం ఏదైన ఉందీ అంటే అది ఆంధ్రప్రదేశ్ అనే దుస్థితికి రాష్ట్ర పరిస్ధితి చేరుకోంది’అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు గొల్లపల్లి సూర్యరావు విమర్శించారు. కనీస వసతుల కల్పనలో విఫలం కావ

NRI TDP: టీడీపీ గెలుపే లక్ష్యం.. ఎన్నారైల సమావేశం!

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ‘కనీస సౌకర్యాలు కూడా కరువైన రాష్ట్రం ఏదైన ఉందీ అంటే అది ఆంధ్రప్రదేశ్ అనే దుస్థితికి రాష్ట్ర పరిస్ధితి చేరుకోంది’అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు గొల్లపల్లి సూర్యరావు విమర్శించారు. కనీస వసతుల కల్పనలో విఫలం కావడానికి తోడుగా కూల్చివేత చర్యలతో కొనసాగుతున్న విధ్వంసకర పాలన తుది దశకు చేరుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం దుబాయిలో తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం ఏ ఒక్క నిర్మాణాత్మక కార్యక్రమం గానీ కట్టడం గానీ చేపట్టలేకపోయిందనే విషయాన్ని గుర్తించాలన్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలలో అభిమానం, సానుభూతి ఉందన్నారు. దీన్ని ఓట్ల రూపంలో మలుచుకోవడానికి విదేశాలలోని కార్యకర్తలు కృషి చేయాలని సూర్యరావు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించే వరకు ప్రతీ కార్యకర్త నిర్విరామంగా కృషి చేయాలన్నారు.



​పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలందించాలనే ఎన్టీఆర్ పిలుపు మేరకు విదేశాల్లో ఉద్యోగాలు వదులుకోని అనేక మంది ఎన్నారై డాక్టర్లు మాతృదేశానికి వచ్చారని తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ అన్నారు. అంతేకాకుండా నిమ్స్‌ను కార్పోరేటు ఆసుపత్రుల కంటే మెరుగ్గా తీర్చిదిద్దిన కాకర్ల సుబ్బారావు ఈ కోవకే చెందుతారన్నారు. వైద్య విద్యాబోధనలో కూడ ప్రవాసీయుల సూచన మేరకు ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీని స్థాపించారనీ.. అయితే యూనివర్సిటీ పేరును జగన్ మార్చారని రాధాకృష్ణా మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ పేర ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేసి కార్పోరేటు ఆసుపత్రుల లాభాలను పెంచిన వైఎస్సార్ పేరు ఉండాలా.. లేక ప్రభుత్వపరంగా మండల స్ధాయిలో పి.హెచ్.సిల నుంచి స్పెషాల్టీ ఆసుపత్రుల వరకు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పేరు ఉండాలా అనేది అలోచించాలన్నారు. ప్రతి ప్రవాసీ తనవంతుగా మాతృదేశంలోని తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఓట్లను తెలుగుదేశంకు వేసేలా ఒప్పించాలని ఆయన కోరారు. ​​సమావేశంలో దుబాయి శాఖ నాయకులు విశ్వేశ్వరరావు, ఖాదర్ బాషా, వాసురెడ్డి, నిరంజన్, రవికిరణ్, హరి,జాఫర్ అలీ, దుర్గ ప్రసాద్, బాబ్జీ, శ్రీనివాస్, షబ్బీర్ బాషా తదితరులు పాల్గోన్నారు.


Updated Date - 2022-10-17T15:19:27+05:30 IST