నాట్స్ ఆధ్వర్యంలో ఆర్థిక అంశాలసై మహిళలకు అవగాహన సదస్సు

ABN , First Publish Date - 2022-01-31T18:57:20+05:30 IST

అమెరికాలో తెలుగు ప్రజలకు అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) .. తాజాగా మహిళా సాధికారితపై దృష్టి సారించింది. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడం కుటుంబానికి ఎంతో కీలకమ

నాట్స్ ఆధ్వర్యంలో ఆర్థిక అంశాలసై మహిళలకు అవగాహన సదస్సు

న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు ప్రజలకు అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) .. తాజాగా మహిళా సాధికారితపై దృష్టి సారించింది. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడం కుటుంబానికి ఎంతో కీలకమనే విషయాన్ని మహిళలకు వివరించేందుకు సిద్ధం అయింది. మహిళల్లో ఆర్థిక చైతన్యం తీసుకురావడానికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టడానికి నాట్స్ బోర్డ్ ఛైర్ పర్సన్ అరుణ గంటి చొరవతో నడుంబిగించింది. ఈ క్రమంలోనే ఆర్థిక అంశాలపై మహిళలతో  వెబినార్ నిర్వహించారు. పెళ్లైన దగ్గర నుంచి ఆర్థికంగా మహిళలు ఆర్థికంగా ఎలా అప్రమత్తంగా ఉండాలి? ప్రమాదవశాత్తు ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే.. కుటుంబాన్ని ఆర్థికంగా ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి? ఆర్థిక అంశాలపై మహిళలకు అవగాహన ఎందుకు అత్యంత అవసరం? అనే విషయాలను సవివరంగా ఈ వెబినార్‌లో వివరించారు. 
మహిళా సాధికారిత సంస్థ వ్యవస్థాపకులు, టెక్నాలజీ సొల్యూషన్స్ అండ్ ఐటీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ దుర్గా ప్రశాంతి గండి ఈ వెబినార్‌కు ముఖ్య అతిధిగా విచ్చేసి ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మాధవి దొడ్డి వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఆర్థిక భద్రత గురించి మహిళలు కచ్చితంగా తెలుసుకోవడంతో పాటు దానిని సాధించడం కోసం పాటించాల్సిన పద్దతులపై కూడా అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని నాట్స్ బోర్డ్ ఛైర్ పర్సన్ అరుణ గంటి అన్నారు. మహిళలను ఆర్ధిక అంశాలపై చైతన్యం చేసేందుకు వరుస వెబినార్లను నాట్స్ నిర్వహిస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందలాది మంది తెలుగు మహిళలు ఆన్‌లైన్ ద్వారా ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. ఆర్ధికఅంశాలపై ఎన్నో విషయాలను తమకు తెలియజేసిందుకు వాళ్లంతా నాట్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన జయశ్రీ పెద్దిభొట్ల, లక్ష్మి బొజ్జ, జ్యోతి వనం,శృతి అక్కినేని తదితరులను నాట్స్అధ్యక్షుడు శేఖర్ అన్నే ప్రత్యేకంగా అభినందించారు.
Updated Date - 2022-01-31T18:57:20+05:30 IST