‘రాత్రంతా నిద్రపోతాం కదా అంటే.. మా ఆవిడకు చిర్రెత్తుకొచ్చింది.. నేను చేసింది తప్పా..’
ABN , First Publish Date - 2022-02-13T01:08:00+05:30 IST
తాను చేసిన పనికి భార్యకు తిక్కరేగడంతో ఇరకాటంలో పడ్డ ఓ భర్త చివరకు తనగోడు ఆన్లైన్లో వెళ్లబోసుకున్నాడు. తను సరైన పనే చేశానంటూ చెప్పుకొనే ప్రయత్నం చేశాడు. కానీ..

ఇంటర్నెట్ డెస్క్: తాను చేసిన పనికి భార్యకు తిక్కరేగడంతో ఇరకాటంలో పడ్డ ఓ భర్త చివరకు తనగోడు ఆన్లైన్లో వెళ్లబోసుకున్నాడు. తను సరైన పనే చేశానంటూ చెప్పుకొనే ప్రయత్నం చేశాడు. కానీ.. అతడి భార్యకు చిర్రెత్తుకొచ్చినట్టే నెటిజన్లకూ మండుకొచ్చింది. భర్తగా ఇలాంటి పని చేయడం తప్పుకాదా అంటూ నెటిజన్లు ప్రస్తుతం అతడిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అసలు ఎవరీ దురదృష్టవంతుడు.. ఇంటి గొడవ నెట్టింట్లోకి ఎలా వచ్చింది...ఈ పరిస్థితికి దారితీసిన కారణాలు ఏంటో... తెలుసుకుందాం పదండి..
హాలిడే కోసమని ఇటీవల ఓ జపాన్ జంట అమెరికాకు వెళ్లాలనుకుంది. నెల రోజుల పాటు అక్కడ గడపాలన్నది వారి ప్లాన్. ఈ క్రమంలో భర్త ముందుగానే రెండు ఎకానమీ క్లాస్ విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. అయితే.. అతడు అప్పటికే చాలా సార్లు విమాన ప్రయాణం చేసి ఉండటంతో ఎయిర్‌లైన్స్ సంస్థ అతడికి ఓ ఆఫర్ ఇచ్చింది. అతడి ఎకానమీ క్లాస్ టిక్కెట్టును అంతకంటే ఖరీదైన, ఎంతో సౌకర్యవంతమైన బిజినెస్ క్లాస్ టిక్కెట్‌గా మార్చుకోవచ్చని పేర్కొంది. అతడు అంతకుముందెప్పుడూ బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించి ఉండకపోవడంతో వెంటనే ఆ ఆఫర్‌కు ఓకే చెప్పేశాడు. అయితే.. అతడి భార్యకు ఇటువంటి ఆఫర్ ఏదీ లేకపోవడంతో ఆమెకు ఎకానమీ క్లాస్ టిక్కెట్టే ఖరారైంది. ఈ విషయాన్ని అతడు భార్యకు చెప్పడంతో సహజంగానే వారి మధ్య వాగ్వాదం మొదలైంది.
‘‘విషయం చెప్పగానే ఆమెకు కోపం వచ్చింది. కట్టుకున్న భార్య కంటే బిజినెస్ క్లాస్ టిక్కెట్‌కే నేను ప్రాధాన్యం ఇచ్చినట్టు ఆమె ఫీలైంది. ఆమె నా పక్కనే కూర్చోవాలనుకుంది. అయితే.. అది 12 గంటల పాటు సాగే ప్రయాణం. అందునా ఫ్లైట్ రాత్రి సమయంలో బయలు దేరుతుంది. కాబట్టి మేము రాత్రంతా నిద్రపోయేదే కదా అని అనుకున్నా. ఎవరు ఎక్కడ కూర్చుంటే ఏముందిలే అనేది నా అభిప్రాయం. ‘నాకు మంచి సీట్ దొరికినందుకు నీవు కుళ్లుకుంటున్నావని’ ఆమెతో చెప్పా. దీంతో.. నా భార్యకు మరింత మండుకొచ్చింది. బిజినెస్ క్లాస్ టిక్కెట్ వదులుకోమని నన్ను కోరింది. కానీ నేను నో అని ఖరాఖండీగా చెప్పేశా’’ అంటూ రెడిట్(Reddit) ఫోరంలో అతడు రాసుకొచ్చాడు. ఇందులో తన తప్పేమీ లేదని చెప్పే ప్రయత్నం చేశాడు.
నెటిజన్లు మాత్రం ‘బిజినెస్ క్లాస్ భర్త’గారికి తలంటేశారు. ‘‘చేస్తే రెండు సీట్లను పైతరగతికి మార్చుకోవాలి. లేదా.. పాత తరగతిలోనే ప్రయాణించాలి. అంతేకానీ.. ఇలా చేయడం పచ్చి స్వార్థం’’ అంటూ ఒకరు ఘాటు రిప్లై ఇచ్చారు. ‘‘నీ భార్య ముచ్చట తీర్చంది చాలక.. ఆమెతో ఎకసెక్కాలాడతావా’’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. అయితే.. ఆ భర్త చివరకు రాజీ మార్గాన్నే ఎంచుకోవడంతో ఈ కథ సుఖాంతం అయింది. భార్య తన పక్కనే కూర్చునేలా ఆమెకు కూడా బిజినెస్ క్లాస్ టిక్కెట్టు కొన్నట్టు అతడు రెడిట్ ఫోరంలో తెలిపాడు.