భారతీయుడిపై ప్రేమ.. రష్యా వదిలి భారత్‌కు వచ్చేసిన యువతి.. ఈ కథ చివరికి ఏమలుపు తిరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-06T02:26:33+05:30 IST

ప్రేమ అనేది ఓ విశ్వజనీనమైన భావన. అందుకే.. జాతి, మత, కుల, ప్రాంతాలకు అతీతంగా వ్యక్తులు ప్రేమలో పడుతుంటారు.

భారతీయుడిపై ప్రేమ.. రష్యా వదిలి భారత్‌కు వచ్చేసిన యువతి.. ఈ  కథ చివరికి ఏమలుపు తిరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ప్రేమ అనేది ఓ విశ్వజనీనమైన భావన. అందుకే.. జాతి, మత, కుల, ప్రాంతాలకు అతీతంగా వ్యక్తులు ప్రేమలో పడుతుంటారు. ఎంతటి కష్టాన్నైనా, ఎంతటి దూరాన్నైనా అధిగమించి తమ మనసుకు నచ్చిన వారిని చేరుకుంటారు. రష్యాకు చెందిన ఓ యువతి తాజాగా అదే విధంగా తన తోడు కోసం భారత్‌కు వచ్చింది. చివరికి అతడితో వివాహ బంధంలో ఏకమైంది. అయితే.. ఈ ప్రేమ కథ మొదలైంది మాత్రం రష్యాలోనే!


మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన రిషి వర్మ.. వృత్తి రీత్యా షెఫ్. కొంత కాలం మన హైదరాబాద్‌‌లో పని చేశాడు కూడా. ఈ క్రమంలో అతడు 2019లో ఓ మారు రష్యాలో పర్యటించాడు. అక్కడి సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో పర్యటిస్తూ.. ఫొటోలు దిగాడు. అక్కడ ఉన్న లీనా బార్కొస్లేవ్ అనే రష్యా యువతిని తన ఫొటో తీయమని కోరాడు! అలా.. అలా.. వారి మధ్య మాటలు మొదలయ్యాయి. అది స్నేహానికి దారి తీసింది. ఇండియాకు వచ్చాక కూడా రిషి ఆమెతో టచ్‌లో ఉన్నాడు. వారిద్దరూ వీడియో కాల్స్ ద్వారా నిత్యం మాట్లాడుకునేవారు. వేరు వేరు దేశాల్లో ఉన్న వారి మధ్య టెక్నాలజీ వారధిగా మారి.. బంధాన్ని మరింత బలపరిచింది. చివరికి ఓ రోజున రిషి ఆమె ముందు తన మనసులో మాట బయట పెట్టేశాడు. నిన్ను ప్రేమిస్తున్నానంటూ.. వీడియో కాల్‌లోనే చెప్పేశాడు. ఆమె కూడా ఎప్పుడో అతడికి తన మనసు ఇచ్చేసి ఉండటంతో.. ప్రపోజ్ చేసిన వెంటనే ఓకే చెప్పేసింది. ఈ క్రమంలోనే ఆమె గతేడాది డిసెంబర్‌లో భారత్‌కు వచ్చేసింది. ఆపై మళ్లీ రష్యాకు వెళ్లలేదు. 


చివరికి వారు వివాహ బంధంతో ఒక్కటవుదామని నిర్ణయించుకున్నారు. అనంతరం.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని అనుమతులు రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తనకు భారతీయ సంప్రదాయం, వంటకాలు అంటే ఎంతో ఇష్టమని లీనా తరచూ చెబుతుంటుంది. ప్రేయసి మనసు పూర్తిగా చదివేసిన రిషి.. ఆమెకు రకరకాల వంటలు కూడా చేసిపెట్టాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. లీనా కేవలం భారతీయ వంటకాలను ఆస్వాదించడంతోనే సరిపెట్టకుండా.. మన వంటలు వండటంలో కాస్తంత నైపుణ్యాన్ని కూడా సంపాదించింది. అంతేకాకుండా.. ఈ జంట తరచూ ఆలయాలకు వెళుతూ ఉంటుంది కూడా..! ఇలా వారి అభిరుచులన్నీ కలవడంతో వారిద్దరూ తమకు పెళ్లే కరెక్టని వారు డిసైడైపోయారు.  అయితే.. హిందూ సంప్రదాయం ప్రకారం మరోమారు వివాహం చేసుకుందామనుకున్న ఈ జంట అందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ వివాహానికి డిసెంబర్‌లో ముహూర్తం ఖరారైంది.

Updated Date - 2022-03-06T02:26:33+05:30 IST