Joe biden.. మళ్లీ అదే సీన్.. Viral అవుతున్న వీడియో..! విపరీతంగా ట్రోలింగ్..
ABN , First Publish Date - 2022-05-01T02:49:35+05:30 IST
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe biden) మళ్లీ తడబడ్డారు.

ఎన్నారై డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe biden) మళ్లీ తడబడ్డారు. ఇటీవల అమెరికా చట్టసభలను(Congress) ఉద్దేశించి ప్రసంగించిన బైడెన్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మద్దతు ఇచ్చే అపరకుబేరులను వదలబోమని హెచ్చరిక చేశారు. ఈ క్రమంలో క్లెప్టోక్రసీ(kleptocracy) అనే పదాన్ని పలకలేక ఇబ్బంది పడ్డారు. చివరకు.. మరేం పర్లేదులే అన్నట్టు నవ్వుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల సొమ్ము దోచుకోవడాన్ని ఇంగ్లిష్‌లో క్లెప్టోక్రసీ అంటారు. కాగా..బైడెన్ తడబడుతున్న వీడియోను అమెరికా సెనెటర్ టామ్ కాటన్ ట్విటర్లో షేర్ చేశారు. ఇది చాలా షాకింగ్ అని కామెంట్ చేశారు. ఇక అమెరికాకు ఇంతకంటే మెరుగైన అధ్యక్షుడు కావాలంటూ అమెరికా మాజీ సైనికాధికారి ఒకరు ట్వీట్ చేశారు.
ఈ ఉదంతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అనేక మంది ఎప్పటిలాగే బైడెన్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే.. పలువురు నెటిజన్లు అధ్యక్షుడికి మద్దతుగా నిలిచారు. ‘‘ఓ వ్యక్తి మాట్లాడేందుకు ఇబ్బంది పడుతుంటే హేళన చేస్తారా’’ అంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అమెరికా చట్టసభ సభ్యుడు అధ్యక్షుడిని ఇలా వెక్కిరించవచ్చా..’’ అని మరొకరు ప్రశ్నించారు. వాస్తవానికి చిన్నప్పుడు బైడెన్ నత్తితో సతమతమయ్యారు. కానీ.. ఆయన కుంగిపోకుండా ధైర్యంగా ముందడుగేశారు. నిరంతర సాధనతో ఈ సమస్యను నుంచి చాలా వరకూ బయటపడ్డారు. ‘‘ఈ సమస్యే నీ జీవితంగా మారనీయ్యకు. ఏదైనా సాధించగల టాలెంట్ నీకుందన్న విషయాన్ని మర్చిపోకు’’ అంటూ చిన్నతనంలో తల్లి చెప్పిన మాటలే స్ఫూర్తిగా దూసుకుపోయిన బైడెన్.. చివరకు అగ్రరాజ్యాధినేత అయ్యారు.