UK New PM Liz Truss: అతడితో వివాహేతర సంబంధంతో కాపురం కూలిపోయే స్థితి.. ఆనాడు లిజ్‌తో భర్త హ్యూ అలా అనకపోయి ఉంటే..

ABN , First Publish Date - 2022-09-06T17:38:41+05:30 IST

హ్యూ ఓ లియరీతో పరిచయం, మూడేళ్ల ప్రేమ తర్వాత 2000లో పెళ్ళాడింది లిజ్. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఆ తర్వాత కన్సర్వేటివ్ పార్టీ మాజీ ఎంపీ Mark Field తో ఆమె అఫైర్ పెట్టుకుంది.

UK New PM Liz Truss: అతడితో వివాహేతర సంబంధంతో కాపురం కూలిపోయే స్థితి.. ఆనాడు లిజ్‌తో భర్త హ్యూ అలా అనకపోయి ఉంటే..
( భర్త Hugh O'Leary తో Liz Truss )

తనని వదిలి వెళ్లిపోయిన ప్రియుడి గురించి, అతను వెళ్లిపోతున్నప్పుడు తన పడిన వేదన గురించి భర్త  Fred Jesson కి ఒక కన్ఫెషన్ లా చెప్పుకుంటుంది Laura Jesson. 


"క్షణం పాటు అతని చేతి స్పర్శలో చెమ్మ మనసుకు తెలిసింది. తను వెళ్లిపోయాడు, నా జీవితంలోంచి కూడా శాశ్వతంగా...".. ప్రియుడు Dr Alec Harvey వెళ్లిపోయాక, ఎక్స్‌ప్రెస్  ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని ప్లాట్‌ఫామ్ చివరి వరకీ వెళ్తుంది లారా. "ఆ చావుబతుకుల అంచు మీద వణుకుతూ నిలబడిపోయాను. నేను దూకలేకపోయాను. నిజం చెప్పాలంటే, నువ్వు, పిల్లలే నాకు అడ్డుపడ్డారు..." అని వెక్కిళ్ల మధ్య వెళ్లబోసుకుంటుంది భర్తతో.


"Thank you for coming back to me."  అంటాడు ఆమె భర్త. ప్రపంచప్రఖ్యాత దర్శకుడు Sir David Lean సినిమా - 'Brief Encounter' లో చిట్టచివరి దృశ్యం అది. 'నాకు మళ్లీ దక్కావు, అంతే చాలు...' అని ఆమెని క్షమించి హత్తుకోవడంతో ఆ సినిమా ముగుస్తుంది. కాస్త అటూఇటుగా ఇటువంటిదే జరిగింది బ్రిటిష్ ప్రధాన మంత్రిగా ఎన్నికైన Mary Elizabeth Truss (Liz Truss) జీవితంలో. ఆమె భర్త Hugh O'Leary కూడా ఆమె అఫైర్ ని అర్థం చేసుకొని ఆమెని అక్కున చేర్చుకున్నాడు. 


భర్తలు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, మగవాడి మోసం తెలుసుకొని భార్యలు దూరం కావడం, విడాకులు తీసుకోవడం, చివరికి క్షమించడం - సబ్జెట్ గా ఎన్నో సినిమాలు వచ్చాయి, కథలు, నవలలూ వచ్చాయి. కానీ, భార్యలు చేసే దాంపత్యద్రోహం (infidelity) మీద కూడా ఎన్నో సినిమాలు, సాహిత్యం వచ్చాయి గానీ, భర్తలు వాళ్లని క్షమించి, తిరిగి ప్రేమగా కలిసి బ్రతికినట్లు చూపించినవి చాలా తక్కువ. ఎంతో అభివృద్ధి సాధించాయని అనుకునే యూరప్ (Europe), అమెరికా(US) , స్కాండినేవియన్ (Scandinavian)   దేశాల్లో కూడా జీవిత భాగస్వాముల లవ్ అఫైర్స్ (Love Affairs) చాలా తీవ్రంగా పరిగణిస్తారు. సమాజం సమర్థించదు, కోర్టులు చాలా సీరియస్ గా తీసుకుంటాయి. నైతికంగా, చట్టపరంగా కూడా అటువంటి కఠినమైన పరిస్థితులు ఉన్న చోట లిజ్ ట్రస్ వివాహేతర సంబంధం కచ్చితంగా సంచలనం కలిగించి ఉంటుందనడంలో సందేహం లేదు.


హ్యూ ఓ లియరీతో పరిచయం, మూడేళ్ల ప్రేమ తర్వాత 2000లో పెళ్ళాడింది లిజ్. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఆ తర్వాత కన్సర్వేటివ్ పార్టీ మాజీ ఎంపీ Mark Field తో ఆమె అఫైర్ పెట్టుకుంది. కన్సర్వేటివ్ పార్టీలో ఎంపీ మార్క్ ఫీల్డ్ కి లిజ్ బాగా జూనియర్. మార్క్ కి ఆమె అసిస్టెంట్ గా ఉన్నప్పుడు, ఆ సాన్నిహిత్యాన్ని మార్క్ శారీరక సంబంధంగా మార్చుకున్నాడు. మార్క్ హోదా, అధికారం, ఇంకా అందం కారణంగా కూడా ఆమె అడ్డుచెప్పలేకపోయిందని అంటారు. 18 నెలల పాటు సాగిన వాళ్ల అఫైర్ 2006లో బైటపడింది. ‘Daily Mail’ వారి రహస్య ప్రణయాన్ని బైటబెట్టడం పెనుసంచలనం అయ్యింది.


సహజంగానే,  లిజ్- హ్యూల కాపురం కూలిపోయే పరిస్థితి ఎదురైంది. కానీ, హ్యూ తన భార్యని అర్థం చేసుకున్నాడు; గతం గతః (let bygones be bygones) అన్నాడు. లిజ్ అఫైర్ వారి జీవితాలలో రేగిన తుపాను అని హ్యూ అనుకోలేదు, గులకరాయి పడి కొలనులో చెలరేగిన అలలవంటి అలజడి మాత్రమే అనుకున్నాడు హ్యూ. అంతా సద్దుమణిగాక, కొలను మరింత నిర్మలమైనట్టు వారి మధ్య బంధం మరింత అందంగా అల్లుకుపోయింది; ఎందరికో ఆదర్శమయ్యింది.  


మరి మార్క్ ఫీల్డ్ సంగతేంటీ? 

1964లో పుట్టిన మార్క్ ఫీల్డ్ 2001–2019 మధ్య లండన్- వెస్ట్మినిస్టర్ ( Cities of London and Westminster) పార్లమెంటు సభ్యుడు. 2004–2006 మధ్య కాలంలో సాగిన లిజ్ ట్రస్ సంబంధం బట్టబయలయ్యాక ఆయన మొదటి భార్య మిషెల్ యాక్టన్ (Michele Acton) 2006లో మార్క్ తో తమ పన్నెండేళ్ల బంధాన్ని తెగతెంపులు చేసుకుంది. అంతక్రితం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన మిషెల్, మార్క్‌ను 1996లో పెళ్లిచేసుకుంది. లిజ్ తో మార్క్ అఫైర్ ను ఆమె మన్నించలేకపోయింది. మార్క్ తన హోదాని, అధికారాన్నీ ఉపయోగించి లిజ్ ని లొంగదీసుకున్నాడని నమ్మిన మిషెల్ వెంటనే విడాకులు తీసుకుంది. పార్టీలో జూనియర్ అయిన లిజ్ కు రాజకీయ గురువు (Political Mentor)గా మార్క్ ను కన్సర్వేటివ్ పార్టీ నియమించింది. రాజకీయ పెద్దగా ఉన్న మార్క్ తన కన్నా వయసులో పదేళ్ల చిన్నదైన లిజ్ ను వ్యక్తిగతంగా ఉపయోగించుకునే స్థితికి తీసుకువచ్చేరనే ఆరోపణల్ని మిషెల్ నమ్మింది. ఆ మరుసటి ఏడాదే సెలబ్రిటీ విక్టోరియా ఎల్ఫిక్ (Victoria Elphicke)ని పెళ్లాడాడు మార్క్.


అంతకు పదేళ్ల ముందు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ( Bill Clinton) సెక్స్ స్కాండల్ విషయంలో ఆయన భార్య హిల్లరీ క్లింటన్- భర్తను వెనకేసుకొచ్చినట్లు, మార్క్ ని ఏ దశలోనూ మిషెల్ సమర్థించలేదు. 


వైట్ హౌస్ ఇంటర్న్‌గా చేరిన మోనికా లెవెన్స్కీ‌తో తండ్రి వయసు ఉన్న అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సంబంధం పెట్టుకోవడం తెలిసిందే. కానీ, తన భర్త సచ్ఛీలుడు, ఏకపత్నీవ్రతుడు అని సర్టిఫికెట్ ఇచ్చింది హిల్లరీ. క్లింటన్ చేసిన లైంగిక, నైతిక నేరాన్ని దాచిపెట్టి, అధికారం కోసం హిలరీ ఈ కేసు విచారణలో అబద్ధమాడింది. మిషెల్ మాత్రం విడాకులకే పట్టుబట్టింది.


జీవితం మీద పడిన నిన్నటి నీడల్ని లిజ్ ట్రస్ - హ్యూ ఓ లియరీ జంట దాటి ముందుకొచ్చేసింది. అయినా, జారిపోయిన గతం జాడల గురించి గుచిగుచ్చి అడుగుతుంటుంది బ్రిటన్ మీడియా అప్పుడప్పుడూ. 


"దాని గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు..." అంటాడు హ్యూ, లిజ్ ని మరింత దగ్గరకి హత్తుకుంటూ. 

“Thank you for coming back to me." అని బహుశా చెప్పకనే చెబుతాడు.

Updated Date - 2022-09-06T17:38:41+05:30 IST