టీనేజర్ల తగాదా.. ఇజ్రాయెల్‌లో భారత సంతతి యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-10-08T05:19:36+05:30 IST

ఇజ్రాయెల్‌లో దారుణం జరిగింది. ఓ బర్త్‌డే పార్టీ సందర్భంగా టీనేజర్ల మధ్య తగాదాలో భారత సంతతికి చెందిన ఓ టీనేజర్ మరణించాడు.

టీనేజర్ల తగాదా.. ఇజ్రాయెల్‌లో భారత సంతతి యువకుడి మృతి

ఎన్నారై డెస్క్: ఇజ్రాయెల్‌లో దారుణం జరిగింది. ఓ బర్త్‌డే పార్టీ సందర్భంగా టీనేజర్ల మధ్య తగాదాలో భారత సంతతికి చెందిన ఓ టీనేజర్ మరణించాడు. కత్తితో అతడిని పొడవడంతో మృతి చెందినట్టు శుక్రవారం స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. మృతుడిని యోల్ లెహింగేల్‌గా గుర్తించారు. ఈశాన్య భారత దేశానికి చెందిన అతడు ఏడాది క్రితమే తన కుటుంబంతో సహా ఇజ్రాయెల్‌కు వలసవెళ్లాడు. నాఫ్ హెజిల్ ప్రాంతంలో నివసించేవాడు. కాగా.. గురువారం అతడు.. భారత్ నుంచి ఇజ్రాయెల్ వచ్చిన మరో స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. యోల్ ఓ బర్త్‌డే పార్టీలో పాల్గొనేందుకు వెళ్లాడని సమాచారం. అయితే.. పార్టీలో టీనేజర్ల మధ్య తగాదా తలెత్తింది. ఆ రాత్రి మోల్ తన ఇంటికి తిరిగి వెళ్లలేదు. 


మరుసటి రోజు అతడి కుటుంబానికి..పార్టీలో తగాదా జరిగిన విషయంపై కబురందింది. మోల్ తీవ్రంగా గాయపడ్డాడని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపాడు. వాళ్లు ఆస్పత్రికి బయలుదేరేలోపే..యోల్ మరణించినట్టు మరో కబురు అందింది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి 15 ఏళ్లు బాలుడిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత మరో ఏడుగురు టీనేజర్లను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. కాగా.. యోల్ చాలా స్నేహశీలి అని స్థానిక సామాజిక కార్యకర్త ఒకరు మీడియాకు తెలిపారు. ఇజ్రాయెల్ పరిస్థితుల్లో ఇట్టే ఇమిడిపోయాడని వివరించాడు. అతడు ఎవరితోనూ తగాదాకు దిగే రకం కాదని చెప్పాడు. కాగా.. ఈ హత్య వెనుక గల కారణాలను వెలికితీసేందుకు స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2022-10-08T05:19:36+05:30 IST