ఎన్నో ఆశలతో సౌదీ వెళ్లిన ముగ్గురు భారతీయులు.. ఏజెంట్ మోసంతో రోజువారీ అసరాలకు కూడా కష్టంగా మారి.. చివరికి

ABN , First Publish Date - 2022-04-03T19:00:06+05:30 IST

ఏజెంట్లకు భారీ మొత్తం సమర్పించుకుని, మంచి ఉద్యోగాల పేరిట సౌదీ వెళ్లిన ముగ్గురు భారత ప్రవాసులకు ఊహించని షాక్ తగిలింది.

ఎన్నో ఆశలతో సౌదీ వెళ్లిన ముగ్గురు భారతీయులు.. ఏజెంట్ మోసంతో రోజువారీ అసరాలకు కూడా కష్టంగా మారి.. చివరికి

రియాద్: ఏజెంట్లకు భారీ మొత్తం సమర్పించుకుని, మంచి ఉద్యోగాల పేరిట సౌదీ వెళ్లిన ముగ్గురు భారత ప్రవాసులకు ఊహించని షాక్ తగిలింది. తీరా అక్కడికెళ్లిన తర్వాత ఎలాంటి పని దొరకకపోగా, ఉండడానికి చోటులేక చివరికి రోజువారీ అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారిన వైనం. ఇలాంటి పరిస్థితుల్లో వారికి సౌదీలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించే ఇండియన్ సోషల్ ఫోరం(ఐఎస్ఎఫ్) సాయం చేయడంతో ఎలాగోలా స్వదేశానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొన్ని నెలల క్రితం సలహూద్దీన్ సల్మాన్, తౌహీద్ మైసూర్, సఫ్వాన్ అబ్దుల్ రహమాన్ అనే ముగ్గురు భారతీయులు సౌదీ రాజధాని రియాద్ వెళ్లారు. ఆ సమయంలో మంగళూరులోని ట్రావెల్ ఏజెంట్‌కు వీసా, ఇతర వాటికి కలిపి భారీగానే ముటజెప్పారు. 


తీరా సౌదీ వెళ్లిన తర్వాత వారికి ఎలాంటి పని దొరకలేదు. దాంతో ఉండటానికి చోటులేకుండా పోయింది. చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోవడంతో రోజువారీ అవసరాలు తీరడం కూడా కష్టంగా మారిపోయింది. పోనీ స్వదేశానికి తిరిగి వచ్చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఈ ముగ్గురి గురించి ఇండియన్ సోషల్ ఫోరం సభ్యులైన నిజాం బాజ్పే, జవాద్ బాస్రూర్‌కు తెలిసింది. దాంతో ఫోరం సభ్యులు ఈ ముగ్గురిని కలిసి వెంటనే వారికి ఉండడానికి చోటు చూపించడంతో పాటు రోజువారీ అవసరాల కోసం కొంత నగదు ఇచ్చారు. 


అనంతరం ఈ ముగ్గురు తరఫున లేబర్ కోర్టులో కేసు వేయడంతో పాటు భారత రాయబార కార్యాలయానికి ఈ విషయాన్ని తెలియజేశారు. చివరకు ఎలాగోలా ముగ్గురి ఎగ్జిట్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేయడం జరిగింది. దాంతో వారికి స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. మొదట తౌహీద్ మైసూర్, సఫ్వాన్ అబ్దుల్‌ను భారత్‌కు పంపించారు. ఆ తర్వాత సలాహూద్దీన్ సల్మాన్‌ను సొంత ఖర్చులతో ఫోరం స్వదేశానికి పంపించింది. దీంతో భారత్ చేరుకున్న బాధితులు ఇండియన్ ఫోరంకు ధన్యవాదాలు తెలిపారు.  

Updated Date - 2022-04-03T19:00:06+05:30 IST