విమానాశ్రయంలో క్లీనర్ నుంచి మిలియనీర్‌గా.. Australia లో భారత యువకుడి సక్సెస్ స్టోరీ

ABN , First Publish Date - 2022-07-05T17:00:16+05:30 IST

విజయం ఎవరికి అంత సులువుగా రాదు అనేది కాదనలేని వాస్తవం. ఓ వ్యక్తి సక్సెస్ అయ్యాడంటే దాని వెనుక అతడి నిరంతర కృషి, పట్టుదల తప్పకుండా ఉంటాయి. అంతకుమించి తనపై తనకు ఉండే విశ్వాసం కూడా ఉంటుంది. వీటికి తోడు ఎన్నో కష్టాలు, వాటి తాలుకూ ఎదురు దెబ్బలు కూడా ఉంటాయి. ఇదిగో అచ్చం ఇలాంటి పరిస్థితులనే..

విమానాశ్రయంలో క్లీనర్ నుంచి మిలియనీర్‌గా.. Australia లో భారత యువకుడి సక్సెస్ స్టోరీ

ఎన్నారై డెస్క్: విజయం ఎవరికి అంత సులువుగా రాదు అనేది కాదనలేని వాస్తవం. ఓ వ్యక్తి సక్సెస్ అయ్యాడంటే దాని వెనుక అతడి నిరంతర కృషి, పట్టుదల తప్పకుండా ఉంటాయి. అంతకుమించి తనపై తనకు ఉండే విశ్వాసం కూడా ఉంటుంది. వీటికి తోడు ఎన్నో కష్టాలు, వాటి తాలుకూ ఎదురు దెబ్బలు కూడా ఉంటాయి. ఇదిగో అచ్చం ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాడు ఆస్ట్రేలియాలో భారత యువకుడు అమీర్ కుతుబ్(33). అమీర్‌ది ఉత్తర ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్. అతనికి అప్పుడు 23 ఏళ్లు. అందరిలానే అమీర్ కూడా ఉన్నతవిద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడి ఓ కళాశాలలో ఎంబీఏ(MBA)లో చేరాడు. 


ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అతని కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతా మాత్రమే. దాంతో అక్కడికి వెళ్లిన తర్వాత ఇంటి నుంచి అమీర్‌కు ఆర్థికంగా ఎలాంటి సహకారం లభించలేదు. దీనికి తోడు మనోడికి ఇంగ్లీష్ సరిగా రాకపోవడం, కొన్ని రోజుల వరకు పార్ట్‌టైం ఉద్యోగం దొరకపోవడంతో కష్టాలు మరింత పెరిగాయి. వాటిని దాటుకుని ఎలాగోలా ఎంబీఏ(MBA) పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉద్యోగ వేటలో పడ్డాడు. ఈ క్రమంలో 300కు పైగా కంపెనీలు తిరిగాడు. కానీ, ఎక్కడ మనోడికి జాబ్ దొరకలేదు. దాంతో చేసేదేమిలేక విక్టోరియాలోని అవెలాన్ విమానాశ్రయంలో క్లీనర్‌గా చేరాడు. అక్కడే రెండేళ్లు గడిచిపోయాయి. 


ఈ విషయం తెలిసి.. నీవు చదివిన చదువు ఏంటి? అక్కడ నీవు చేస్తున్న పనేంటి? వెంటనే స్వదేశానికి వచ్చేయ్. ఇక్కడే ఏదో ఒక పని చేసుకో.. అని తండ్రి ఫోన్ల మీదా ఫోన్లు చేసేవాడు. కానీ, మనోడు మంచి ఉద్యోగం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో అమీర్‌కు ఐసీటీ గీలాంగ్ అనే టెక్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఇదే మనోడి కెరీర్‌లో కీలక మలుపు తిప్పింది. అమీర్ తన ప్రతిభతో కంపెనీలో చేరిన చాలా తక్కువ వ్యవధిలోనే ఆపరేషన్ మేనేజర్‌గా ప్రమోషన్ అందుకున్నాడు. దాంతో కంపెనీ జనరల్ మేనేజర్‌తో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. అలా రెండేళ్లు పనిచేసిన తర్వాత జనరల్ మేనేజర్ పోస్టు ఖాళీ అయింది. దాంతో అమీర్‌కు కంపెనీ తాత్కాలిక జీఎం పోస్టు లభించింది.  


ఇంకేముంది మనోడి హోదాతో పాటు ఆదాయం కూడా పెరిగింది. జీఎం పోస్టుతో అమీర్ ఆదాయం ఏకంగా 300 శాతం పెరిగిపోయిందట. అంతే.. అక్కడి నుంచి మనోడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. కానీ, అమీర్‌కు మొదటి నుంచి సొంతంగా ఏదైనా కంపెనీ  పెట్టాలనే ఆలోచన ఉండేది. దాన్ని అమలులో పెట్టాడు. 2014లో కేవలం 2వేల డాలర్ల(రూ.1.58లక్షలు)తో 'ఎంటర్‌ప్రైజ్ మంకీ ప్రొప్రైటర్ లిమిటెడ్' అనే ఓ టెక్ కంపెనీని నెలకొల్పాడు. ఇవాళ ఈ సంస్థలో 100 మంది వరకు ఉద్యోగులు ఉండగా... కంపెనీ టర్నోవర్ వచ్చి 2మిలియన్ డాలర్లు(రూ.15.81కోట్లు). ఇలా ఉన్నత విద్య కోసం దేశం కాని దేశం వెళ్లి.. ఇవాళ సక్సెస్ ఫుల్ టెకీ వ్యవస్థాపకుడిగా అమీర్ కుతుబ్ కొనసాగుతున్నాడంటే దాని వెనుక అతడి అలుపెరుగని కృషి, పట్టుదలే కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు.    

Updated Date - 2022-07-05T17:00:16+05:30 IST