Oman: భారతీయ కుటుంబంలో విషాదం నింపిన విహారయాత్ర.. తండ్రి, ఇద్దరు పిల్లలను మింగేసిన రాకాసి అల..!

ABN , First Publish Date - 2022-07-14T18:50:27+05:30 IST

విహారయాత్ర ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అప్పటి వరకు సరదాగా బీచ్‌లో గడిపిన ఆ కుటుంబాన్ని క్షణాల్లో రాకాసి అల తీవ్ర విషాదంలో ముంచేసింది.

Oman: భారతీయ కుటుంబంలో విషాదం నింపిన విహారయాత్ర.. తండ్రి, ఇద్దరు పిల్లలను మింగేసిన రాకాసి అల..!

ఎన్నారై డెస్క్: విహారయాత్ర ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అప్పటి వరకు సరదాగా బీచ్‌లో గడిపిన ఆ కుటుంబాన్ని క్షణాల్లో రాకాసి అల తీవ్ర విషాదంలో ముంచేసింది. ఒక్కసారిగా పొటేత్తిన అలకు కళ్లముందు ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు కొట్టుకుపోవడం గమనించిన తండ్రి వారిని కాపాడే క్రమంలో తాను కూడా బలయ్యాడు. ఆదివారం(జూలై 10న) ఒమన్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహరాష్ట్రలోని సాంగ్లి జిల్లాకు చెందిన 42 ఏళ్ల శశికాంత్ మహామనే భార్య, ఇద్దరు పిల్లలు శ్రేయా(09), శ్రేయాస్(06)లతో కలిసి దుబాయ్‌లో నివాసం ఉంటున్నాడు. జాత్‌లో స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఆదివారం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పొరుగున ఉండే ఒమన్‌కు లాంగ్ ట్రీప్‌కు వెళ్లాడు. కొన్ని ప్రదేశాలు చూసిన తర్వాత అక్కడి ఓ బీచ్‌కు వెళ్లిందా కుటుంబం. బీచ్‌లో సరదాగా గడుపుతున్నారు. పిల్లలు ఇద్దరు బీచ్‌లో కొంచెం లోపలికి దిగి నీటిలో ఆడుకుంటున్నారు. 


ఇంతలో ఒక్కసారిగా ఓ రాకాసి అల పొటేత్తింది. దాంతో పిల్లలు ఇద్దరు శశికాంత్ కళ్లముందే సముద్రంలో కొట్టుకుపోయారు. దాంతో వారిని కాపాడేందుకు అతడు కూడా నీటిలో దిగాడు. కొంచెం లోపలికి వెళ్లగానే మరో అల వచ్చి శశికాంత్‌ను సైతం సముద్రంలోకి లాక్కెళ్లింది. అలా ముగ్గురు సముద్రం గర్భంలో కలిసిపోయారు. ఇక ఒడ్డున ఉన్న భార్య క్షణాల్లో జరిగిపోయిన ఈ సంఘటనతో స్పృహా కోల్పోయింది. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది పర్యాటకులు అధికారులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో అక్కడికి చేరుకున్న సెక్యూరిటీ అధికారులు గజ ఈతగాళ్లతో జల్లెడ పట్టారు. కొద్దిసేపటి తర్వాత శశికాంత్, శ్రేయాస్ మృతదేహాలను బయటకు తీశారు. కానీ, కూతురు శ్రేయా ఆచూకీ ఇప్పటివరకు దొరకలేదు. ఇంకా ఆమె కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ అధికారులు వెల్లడించారు. 




Updated Date - 2022-07-14T18:50:27+05:30 IST