Ukraine-Indians: రష్యా క్షిపణి దాడులు.. ఉక్రెయిన్‌లోని భారతీయులకు కేంద్రం కీలక సూచన

ABN , First Publish Date - 2022-10-11T02:01:47+05:30 IST

రష్యా(Russia) క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌లో(Ukraine) ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొంది. దీంతో.. భారతీయులకు కేంద్రం తాజాగా కీలక సూచనలు చేసింది.

Ukraine-Indians: రష్యా క్షిపణి దాడులు.. ఉక్రెయిన్‌లోని భారతీయులకు కేంద్రం కీలక సూచన

ఎన్నారై డెస్క్: రష్యా(Russia) క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌లో(Ukraine) ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొంది. దీంతో.. భారతీయులకు ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా కీలక సూచనలు చేసింది.  ఉక్రెయిన్‌లోని భారతీయులు(Indians in Ukraine)  అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. ఉక్రెయిన్ ప్రభుత్వం, స్థానిక అధికారులు జారీ చేసే సూచనలు, మార్గదర్శకాలను యథాతథంగా పాటించాలని పేర్కొంది. ఈ మేరకు ఓ కీలక ప్రకటన(Advisory) చేసింది. ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయులు తమ వివరాలను ఎప్పటికప్పుడు తమతో పంచుకోవాలని కూడా ఎంబసీ పేర్కొంది. అత్యవసర సమయాల్లో భారతీయులకు తక్షణ సహాయం అందించేందుకు ఇది ఎంతో కీలకమని చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో మినహా ఉక్రెయిన్‌కు రావొద్దని కూడా సూచించింది. మరోవైపు.. ఉక్రెయిన్‌లో ఒక్కసారిగా పెరిగిన ఉద్రిక్తతలపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. మౌలిక వసతులపై దాడులు, సామాన్య పౌరుల మరణాలు ఆందోళనకరమంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘దాడులకు ముగింపు పలకాలి. దౌత్యం, చర్చల వైపునకు మళ్లాలి’’ అని వ్యాఖ్యానించింది. 


రష్యా, క్రిమియాను కలిపే రోడ్డు, రైలు వంతెనపై  అక్టోబర్ 8న భారీ పేలుడు సంభవించడంతో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్ర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లోకి సైన్యాన్ని తరలించేందుకు ఈ వంతెన రష్యాకు ఎంతో కీలకం. వంతెనపై వెళుతున్న కారు పేలిపోవడంతో అటువైపుగా  వెళుతున్న ఓ రైలు మంటల్లో చిక్కుకుంది. రైలు బోగిల్లో ఇంధనం తరలిస్తుండటంతో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. మరోవైపు.. కారు పేలుడు కారణంగా రోడ్డు వంతెన కూడా కొంత మేర సముద్రంలో మునిగిపోయింది. ఈ దాడులకు ఉక్రెయిన్ బాధ్యత వహించకపోయినప్పటికీ.. అక్రమకట్టడాలన్నీ కూలిపోవాలంటూ వంతెనను ఉద్దేశించి ఉక్రెయిన్ ఓ ట్వీట్ చేసింది. ఈ క్రమంలోనే రష్యా సైన్యం సోమవారం ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. వివిధ ప్రాంతాలపై రష్యా 84 క్షిపణులను(Missiles) ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ దాడుల్లో పదిమంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. మౌలికవసతులకూ నష్టం వాటిల్లినట్టు చెప్పింది. 



Updated Date - 2022-10-11T02:01:47+05:30 IST