Kuwait: ప్రవాసుల విషయంలో మరో కఠిన నిర్ణయం తీసుకునే దిశగా కువైత్ అడుగులు

ABN , First Publish Date - 2022-09-10T14:09:02+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసుల విషయంలో ఎన్నో కఠిన నిబంధనలతో వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

Kuwait: ప్రవాసుల విషయంలో మరో కఠిన నిర్ణయం తీసుకునే దిశగా కువైత్ అడుగులు

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసుల విషయంలో ఎన్నో కఠిన నిబంధనలతో వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రోజురోజుకూ దేశంలో పెరిగిపోతున్న ప్రవాసుల (Expats) ప్రాబల్యాన్ని తగ్గించి స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో క్రమం తప్పకుండా వలసదారులకు కఠిన నిబంధనలు అమలు చేస్తూ హడలెత్తిస్తోంది. ఇదే కోవలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రవాసులందరికీ అతి త్వరలో హెల్త్ సర్వీస్ ఫీజులు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఆరోగ్య మంత్రిత్వశాఖకు కీలక సూచనలు చేసిందట. సర్కార్ సూచనతో ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రవాసులకు సంబంధించిన వైద్య సేవలపై అమలు చేయాల్సిన కొత్త నియమనిబంధనలపై కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. 


దీనిలో భాగంగా ప్రవాసులను మొత్తం మూడు కేటగిరీలుగా విభజించిందట. మొదటి కేటగిరీలో ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే కార్మికులతో పాటు ఫ్యామిలీ రెసిడెన్సీ పర్మిట్లు కలిగిన వారిని చేర్చింది. వీరికి దామన్ హాస్పిటల్స్‌ (Daman Hospitals)లో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా వైద్య సేవలు పొందేందుకు వీలు కల్పించింది. ఏడాదికి హెల్త్ ఇన్సూరెన్స్ విలువ 130 కువైటీ దినార్లు (రూ.33వేలు)గా నిర్ణయించింది. ఈ ఫీజు కింద రోగికి సంబంధించిన ఆరోగ్య పరీక్షలు, ఎక్స్-రేలు (X-rays), చికిత్స వస్తాయి. 


ఇక రెండో కేటగిరీ.. ఇందులో ప్రభుత్వ రంగంలో పనిచేసే ప్రవాసులను చేర్చింది. వీరు ప్రభుత్వ ఆస్పత్రులు, క్లినిక్స్‌లో వైద్యం పొందవచ్చు. వీళ్లు పనిచేసే ప్రభుత్వ సంస్థలే వీరికి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ రుసుమును భర్తిస్తాయి. అలాగే మూడో కేటగిరీలో సందర్శకులను చేర్చింది. వీరికి ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయని పేర్కొంది. ఇకపోతే గృహ కార్మికులు ప్రస్తుత బీమా ప్యాకేజీ కింద లేదా స్వల్ప పెరుగుదలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆస్పత్రుల్లోనే వైద్య సేవలను పొందడం కొనసాగించడం జరుగుతుందని నివేదిక పేర్కొంది.  

Updated Date - 2022-09-10T14:09:02+05:30 IST