Britain pm elections: అలా గెలిచేకంటే ఓడిపోవడమే బెటర్.. రిషి సునాక్ వ్యాఖ్య
ABN , First Publish Date - 2022-08-11T23:35:02+05:30 IST
తప్పుడు వాగ్దానాలతో ఎన్నికల్లో గెలవడం కంటే ఓటమే నయమని రిషి సునాక్(Rishi sunak) తాజాగా వ్యాఖ్యానించారు.

ఎన్నారై డెస్క్: తప్పుడు వాగ్దానాలతో ఎన్నికల్లో గెలవడం కంటే ఓటమే నయమని రిషి సునాక్(Rishi sunak) తాజాగా వ్యాఖ్యానించారు. బ్రిటన్ ఆర్థిక సమస్యల పరిష్కారాలపై స్పందిస్తూ రిషి ఈ కామెంట్స్ చేశారు. బ్రిటన్ ప్రధాన పదవి కోసం ఆయన పోటీ పడుతున్న విషయం తెలిసిందే. బుధవారం నాడు ప్రముఖ వార్త చానల్ బీబీసీకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. బ్రిటన్లో అత్యంత బలహీన వర్గాలకు చేయూతను అందించేందుకు తాను కట్టుబడి ఉన్నానని రిషి ఈ సందర్భంగా చెప్పారు. పెరుగుతున్న జీవన వ్యయాలతో సతమతమవుతున్న నిరుపేదలకు మరింత సాయం చేయడం తన నైతిక బాధ్యతని వివరించారు. ప్రభుత్వం తరపున వారికి అదనపు సాయం అందాలని స్పష్టం చేశారు.
ధరాభారంతో ఇక్కట్ల పాలవుతున్న ప్రజానీకాన్ని ఆదుకునేందుకు రిషి ప్రత్యర్థి లిజ్ ట్రస్(Lizz Truss).. పన్నులు తగ్గిస్తానంటూ(tax cuts) హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ.. రిషి సునాక్ మాత్రం పన్ను తగ్గింపును తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. వీటి వల్ల అధికాదాయ కుటుంబాలకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందనేది ఆయన వాదన. అంతేకాకుండా.. తక్షణ అవసరాలు ఉన్న వారికి ఈ చర్యతో ఎటువంటి ప్రయోజం ఉండదని కూడా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. అమలు చేయడం సాధ్యంకాని హామీలు ఇచ్చి గెలవడం కంటే తనకు ఓటమే మంచిదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం బ్రిటన్ ఎన్నికల్లో అధిక ధరల అంశమే ప్రధానంగా మారాయి. వీటి నియంత్రణకు ఏం చేస్తారో చెప్పాలంటూ పార్టీ నేతలు పోటీలో ఉన్న అభ్యర్థులకు కోరుతున్నారు. ప్రచారం తొలినాళ్లలోనే రిషి తన వైఖరిని స్పష్టం చేశారు. ‘‘కరోనా సమయంలో నా పనితీరు ఆధారంగానే ప్రజలు నా గురించి ఓ నిర్ణయానికి రావాలి. కరోనా టైంలో ఖర్చులు ఒకేసారి 1200 పౌండ్లు మేర పెరిగిన సమయంలో ప్రజల చేతుల్లో ఆ మేరకు డబ్బులు ఉండేలా చర్యలు తీసుకున్నాను.’’ అని బుధవారం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషి చెప్పారు.