American Dream: ఎలాగైనా అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలని అడ్డదారి.. అడ్డంగా దొరికిపోయిన యువకుడు!
ABN , First Publish Date - 2022-08-11T13:31:07+05:30 IST
ఉన్నత చదువుల పేరుతో ఎలాగైనా అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలనే ఆశతో బీటెక్‌లో ఫెయిలైనా పాసైనట్లు నకిలీ పత్రాలు సృష్టించి అడ్డంగా దొరికిపోయాడో యువకుడు!

బీటెక్ ఫెయిలైనా అమెరికా కల!
విదేశంలో కొలువుకు యువకుడి అడ్డదారి
ఓయూలో పూర్తిచేసినట్లు నకిలీ పత్రాల సృష్టి
హైదరాబాద్ సిటీ, ఆగస్టు (ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువుల పేరుతో ఎలాగైనా అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలనే ఆశతో బీటెక్‌లో ఫెయిలైనా పాసైనట్లు నకిలీ పత్రాలు సృష్టించి అడ్డంగా దొరికిపోయాడో యువకుడు! బుధవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన జంగారెడ్డి దయాకర్‌రెడ్డికి బీటెక్‌లో 11 సబ్జెక్టులు మిగిలిపోయాయి. బీటెక్ పూర్తిచేసి, అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేయాలనే కలతో హైదరాబాద్‌లోనే ఓ ప్రైవేట్ కళాశాలలో 2014లో సివిల్ ఇంజనీరింగ్‌లో చేరాడు. ఫెయిలైనా కూడా అడ్డదారిలోనైనా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 2021లో అమెరికాలో ఎంబీఏ చదువుతున్న స్వామి అనే యువకుడు నెట్లో దయాకర్‌రెడ్డికి పరిచయమయ్యాడు.
అమెరికాకు వచ్చేందుకు తనకు సహకరించాలని కోరడంతో అందుకు కావాల్సిన విద్యార్హతల పత్రాలు తాను సమకూర్చుతానని, అందుకు 1.3 లక్షలు ఖర్చవుతుందని స్వామి చెప్పాడు. నకిలీ సర్టిఫికెట్లు విక్రయించే ముఠాలతో సంబంధాలున్న స్వామి, దయాకర్‌రెడ్డికి బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నకిలీ సర్టిఫికెట్లు సిద్ధం చేయించాడు. వాటిని ఓలాకు చెందిన క్యాబ్ డ్రైవర్‌తో దయాకర్ రెడ్డి వద్దకు చేర్చాడు. ఆ నకిలీ ధ్రువపత్రాలు తీసుకున్న దయాకర్ రెడ్డి.. హైదరాబాద్, బెంగళూరు, ముంబై నుంచి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతడి వీసా తిరస్కరణకు గురైంది. మరోవైపు దయాకర్‌రెడ్డి నకిలీ ధ్రువీకరణ పత్రాలు కొనుగోలు చేసినట్లు రాచకొండ పోలీసులకు సమాచారం అందింది. ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులను సీపీ రంగంలోకి దింపారు. నాచారం పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దయాకర్‌రెడ్డి ఇంటిపై దాడిచేశారు. అతడి నుంచి నకిలీ మైగ్రేషన్ సర్టిఫికెట్లు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, ఏడు మార్కుల మెమోలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నాచారం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమకూర్చిన స్వామీని భారత్‌కు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. స్వామి ద్వారా నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే నకిలీ సర్టిఫికెట్లపై దర్యాప్తు చేస్తున్న సిట్‌కు వివరాలు అందజేశామని వెల్లడించారు.