Kuwaitలో కష్టాలు చెప్పుకుని హైదరాబాద్ మహిళ కన్నీటి పర్యంతం.. వీడియో వైరల్ అవడంతో..
ABN , First Publish Date - 2022-02-28T16:53:49+05:30 IST
పిల్లలను పోషించుకోవడం కోసం ఆ మహిళ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి కోసం ఎడారి దేశం బాటపట్టింది. అయితే.. అక్కడ యజమాని వైఖరి చూసి షాకైంది. యజమాని చిత్ర హింసలు భరించలేక తన కష్టాలను ఓ

కువైత్: పిల్లలను పోషించుకోవడం కోసం ఆ మహిళ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి కోసం ఎడారి దేశం బాటపట్టింది. అయితే.. అక్కడ యజమాని వైఖరి చూసి షాకైంది. యజమాని చిత్ర హింసలు భరించలేక తన కష్టాలను ఓ వీడియోలో ఏకరువు పెట్టుకుంది. దీంతో ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ స్పందించి ఏం చేసిందనే వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని కార్వాన్ ప్రాంతానికి చెందిన వహిదా బేగంకు(39) కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహం జరిగింది. దురదృష్టవశాత్తు కొన్నేళ్ల తర్వాత అతడు మరణించాడు. దీంతో ఆమె మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అయితే కొన్నికారణాల వల్ల వారిద్దరూ దూరం అయ్యారు. ఈ నేపథ్యంలో తన పిల్లలను పోషించుకోవడం కోసం ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి కోసం కువైత్ వెళ్లి, అక్కడ ఓ ఇంట్లో డొమెస్టిక్ వర్కర్‌గా చేరింది. పనిలో చేరిన కొత్తలో బాగానే ఉన్న ఆమె యజమాని.. ఆ తర్వాత కొంత కాలానికి వహిదా బేగంను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. భౌతికంగా దాడి చేస్తూ క్రూరంగా ప్రవర్తించడంతో వహిదా బేగం తట్టుకోలేకపోయింది. తన బాధలను ఓ వీడియో వ్యక్తపరిచింది. తనను హైదరాబాద్‌కు పంపేందుకు ఎవరైనా సాయం చేయాలని ఆ వీడియోలో వేడుకుంది. ఈ నేపథ్యంలో ఆమె కన్నీటి పర్యంతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన ధ్రువపత్రాల కాపీని తమకు అందజేయాలని కోరింది. కువైత్ అధికారులతో చర్చించి.. సమస్య పరిష్కరించనున్నట్టు వెల్లడించింది.