నా దేశానికి సాయం చేయండి.. ప్రధాని మోదీకి ఉక్రెయిన్ మహిళ విన్నపం!

ABN , First Publish Date - 2022-03-06T00:18:59+05:30 IST

కశ్మీర్ వాస్తవ్యుడిని పెళ్లాడిన ఓ ఉక్రెయిన్ మహిళ.. తమ దేశానికి సాయపడాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీని తాజాగా కోరారు.

నా దేశానికి సాయం చేయండి..  ప్రధాని మోదీకి ఉక్రెయిన్ మహిళ విన్నపం!

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి దాదాపు పది రోజులు కావస్తోంది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో.. అసలు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలో ఉక్రెయిన్ దేశస్థులు తల్లడిల్లిపోతున్నారు. తమను కాపాడాలంటూ వివిధ మాధ్యమాల ద్వారా అంతర్జాతీయ సమాజానికి మొరపెట్టుకుంటున్నారు. అయితే.. కశ్మీర్ వాస్తవ్యుడిని పెళ్లాడిన ఓ ఉక్రెయిన్ మహిళ.. తమ దేశానికి సాయపడాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీని తాజాగా కోరారు. భారత ప్రభుత్వానికి వీలైన మార్గాల్లో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.  తన దేశంలో పరిస్థితులను చూసి తల్లిడిల్లిపోతున్న ఒలిజా నేరుగా ప్రధానికి తన ఆవేదన తెలియజేశారు. 


‘‘నాకు చాలా విచారంగా ఉంది. నా కుటుంబమంతా అక్కడే ఉండటంతో కన్నీటి పర్యంతమవుతున్నాను. కాబట్టి, ఉక్రెయిన్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం.. తమకు వీలైన మార్గాల్లో సాయపడాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉక్రెయిన్ ప్రజలు శాంతిని కాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్.. ప్రజాస్వామ్యం, శాంతి స్థాపన కోసం పోరాటం చేస్తోంది. దేశ ప్రజల మనసులు స్వేచ్ఛ, స్వాతంత్ర్య భావనలతో నిండిపోయాయి. ఉక్రెయిన్‌లో రష్యా పాగా వేసేందుకు వారు ఎన్నటికీ అనుమతించరు.’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఒలిజా.. కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గల ట్రాల్ ప్రాంతంలో తన భర్తతో కలిసి నివసిస్తున్నారు.


కాగా.. ఉక్రెయిన్‌లో ఇంకా చిక్కుకునే ఉన్న అనేక మంది భారతీయులు తమను కాపాడాలంటూ కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. రష్యా బాంబు దాడులు, తుపాకీ పేలుడు శబ్దాల నడుమ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే.. ఇప్పటివరకూ 11 వేల మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి తరలించామని కేంద్రం తాజాగా పేర్కొంది.

Read more