భారత్ మద్దతుకై ఐరోపా ఆరాటం

ABN , First Publish Date - 2022-06-29T13:04:26+05:30 IST

దేశవిస్తృత ప్రయోజనాలు, పుష్కల వాణిజ్య అవకాశాలు, రష్యా– ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో మారుతున్న ప్రపంచ సమీకరణల మధ్య ప్రధాని మోదీ జర్మనీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకొంది.

భారత్ మద్దతుకై ఐరోపా ఆరాటం

దేశవిస్తృత ప్రయోజనాలు, పుష్కల వాణిజ్య అవకాశాలు, రష్యా– ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో మారుతున్న ప్రపంచ సమీకరణల మధ్య ప్రధాని మోదీ జర్మనీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకొంది. సాధారణంగా జి–7 సమావేశాలకు వర్ధమాన దేశాధినేతలను ఆహ్వానించడం చాలా అరుదు. 1970లో చమురు ఎగుమతులను నిలిపివేస్తూ సౌదీ అరేబియా రాజు ఫైసల్ నిర్ణయం తీసుకున్నారు. తత్ఫలితంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కుదిపివేసింది. ఆ గడ్డు కాలంలోనే కొన్ని సంపన్న దేశాలు జి–7 కూటమి నేర్పాటు చేసుకున్నాయి. ఇందులో జర్మనీ ప్రముఖమైనది. రష్యా చమురు, గ్యాస్ దిగుమతులపై ఆంక్షలు విధించడం ద్వారా సైనికంగా రష్యా దూకుడును కట్టడి చేయడం, ఆర్ధికంగా చైనాను నిలువరించడమే ప్రస్తుత జి–7 శిఖరాగ్ర సమావేశ లక్ష్యం. కార్ల్‌మార్క్స్ పుట్టినగడ్డపై జరిగిన ఈ శిఖరాగ్రంలో రష్యా మిత్ర దేశం భారత్ పాల్గొనడం చెప్పుకోదగిన విశేషం.


ఐరోపాలో భారత్‌కు జర్మనీ ప్రధాన వాణిజ్య భాగస్వామి. ఓలాఫ్ షోల్స్ ఆధ్వర్యంలో నూతన సంకీర్ణ ప్రభుత్వం నెలకొన్న తర్వాత జర్మనీతో ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకోవడానికి న్యూఢిల్లీ సంకల్పించింది. సీనియర్ దౌత్యవేత్త, తెలుగువాడయిన పర్వతనేని హరీష్‌ను బెర్లిన్‌లో భారత రాయబారిగా మోదీ ప్రభుత్వం నియమించింది. మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయిన హరీష్, పారిశ్రామికాభివృద్ధిలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న జర్మనీకి రాయబారిగా వెళ్ళడం యాదృచ్ఛికం. ఇరుదేశాల మధ్య సంబంధాలను పెంపొందించడంలో భాగంగా హరీష్ చేసిన కృషిలో ప్రధాని మోదీ జి–7 సమావేశంలో అతిథిగా పాల్గొన్నారు.


ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత ఐరోపాలో అత్యధికంగా ప్రభావితమైన దేశం జర్మనీ. పూర్తిగా రష్యా ఇంధన దిగుమతులపై ఆధారపడ్డ జర్మనీ ఇప్పుడు పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ఒక్క జర్మనీయే కాదు, రష్యన్ చమురు, గ్యాస్‌పై ఆధారపడ్డ అనేక యూరోపియన్ దేశాలు అగమ్యగోచర పరిస్ధితి నెదుర్కొంటున్నాయి. తమ చమురు ఎగుమతులు పెంచడం ద్వారా ఐరోపాను ఆదుకుంటామని ఖతర్, సౌదీ అరేబియా హామీ ఇస్తే గానీ రష్యాను ఐరోపాలో ఏకాకిగా చేయడం దాదాపు అసాధ్యం. అమెరికా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నా ఈ రెండు గల్ఫ్ దేశాలు ఆ హామీ నిచ్చేందుకు ససేమిరా అంటున్నాయి.


రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో ఐరోపాపై లేని ఆంక్షలు ఇతరులపై ఎందుకంటూ భారత్ ప్రశ్నిస్తోంది. రష్యా చమురును భారత్ భారీగా దిగుమతి చేసుకోవడం అమెరికా, ఐరోపాకు నచ్చడం లేదు. పైగా ఐరోపా ఆశించిన విధంగా ఉక్రెయిన్‌పై రష్యా దురాగతాన్ని భారత్ ఖండించలేదు. ఐక్యరాజ్యసమితిలో సంబంధిత అంశాలపై ఓటింగ్‌లో భారత్ పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలో భారత్‌ను వీలయినంతగా మచ్చిక చేసుకోవడం ద్వారా తమ చమురు అవసరాల అనివార్యత గురించి చెప్పడానికి జర్మనీ ప్రయత్నిస్తోంది. వస్తూత్పత్తుల ఎగుమతులలో తమకు పోటీదారయిన చైనాను కట్టడి చేయడానికి కూడా జర్మనీకి భారత్ అవసరం ఎంతైనా ఉంది. సైనికంగా కూడ భారత్‌తో పరస్పర ప్రయోజనాత్మక సంబంధాలను జర్మనీ ఆశిస్తోంది.


బోష్ పంపుల ద్వారా జర్మనీ పారిశ్రామిక నైపుణ్యత భారత్‌లోని సామాన్యులకు కూడా తెలుసు. బెంజ్, సిమెన్స్ మొదలగు అనేక దిగ్గజ సంస్ధలు భారత్ మార్కెట్‌లో దశాబ్దాలుగా ప్రాబల్యం వహిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య సంయుక్త రంగంలో 1600 సంస్థలున్నాయి. ఐరోపాలోకెల్లా అత్యధికంగా జర్మనీ నుంచి భారత్‌లో 13.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులున్నాయి. తాజాగా ఈ వ్యాపార సంబంధాలు మరో మైలురాయిని దాటనున్నాయి.


పర్యావరణంపై విషమ ప్రభావం చూపుతున్న కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అనేక దేశాలతో పాటు భారత్ కూడా ప్రయత్నిస్తోంది. 2050 సంవత్సరం వరకు దేశంలో 80 శాతం విద్యుత్తును పునరుత్పాదక విధానంలో పెంచి బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని పూర్తిగా తగ్గించాలని కేంద్రం ఆశిస్తోంది. ప్రస్తుతం 100 గిగావాట్ల వ్యవస్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉన్న భారత్ 2030 నాటికి దాన్ని ఇంచుమించు 450 గిగా వాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ క్రమంలో పునరుత్పాదక శక్తిపై పెట్టుబడులు కీలకమైనవి. ఆ పెట్టుబడులను సమకూర్చగల సామర్థ్యం జర్మనీకి ఉన్నది. పునరుత్పాదక ఇంధన కార్యక్రమానికిగాను భారతదేశానికి 10 బిలియన్ యూరోల సహాయం చేయడానికి జర్మనీ సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీ కూడా పునరుత్పాదక ఇంధన రంగంలో గత కొంత కాలంగా భారీ పెట్టుబడులు పెడుతుండడం గమనార్హం. పది బిలియన్ డాలర్లను ఈ రంగంలో మదుపు చేయనున్నట్లు అంబానీ ప్రకటించారు. అంతే కాకుండా ప్రపంచంలో కెల్లా పెద్దదైన సౌర శక్తితో నడిచే విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. అదే విధంగా అదానీ కూడా పర్యావరణ పరిరక్షణ పేర దేశ విద్యుదుత్పత్తి రంగంలో ప్రముఖ స్థానాన్ని సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో 10 గిగావాట్‌ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ రంగంలో తమ కార్యకలాపాలను దేశ వ్యాప్తంగా విస్తరింప చేసేందుకు ఆయన సంసిద్ధమవుతున్నారు. ఇవన్నీ సజావుగా ముందుకు సాగాలంటే మున్ముందు జర్మనీ సహాయం అవసరం.


మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Read more