France: కొత్త రెసిడెన్సీ పర్మిట్ యోచనలో ఫ్రాన్స్..

ABN , First Publish Date - 2022-12-23T16:23:04+05:30 IST

ఫ్రాన్స్‌లో నెలకొన్న కార్మికుల కొరతకు పరిష్కారంగా అక్కడి ప్రభుత్వం ఓ కొత్త రెసిడెన్సీ పర్మిట్‌ను ప్రారంభించే యోచనలో ఉంది. దేశంలోకి కొత్తగా వచ్చే శరణార్థులు కూడా త్వరగా స్థానికంగా ఉపాధి పొందేందుకు తగిన నిబంధనలతో ఈ కొత్త రెసిడెన్సీ పర్మిట్‌ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

France: కొత్త రెసిడెన్సీ పర్మిట్ యోచనలో ఫ్రాన్స్..

ఎన్నారై డెస్క్: ఫ్రాన్స్‌లో(France) నెలకొన్న కార్మికుల కొరతకు(Labour Shortage) పరిష్కారంగా అక్కడి ప్రభుత్వం ఓ కొత్త రెసిడెన్సీ పర్మిట్‌ను(New Residency Permit) ప్రారంభించే యోచనలో ఉంది. దేశంలోకి కొత్తగా వచ్చే శరణార్థులు(Asylum Seekers) కూడా త్వరగా స్థానికంగా ఉపాధి పొందేందుకు తగిన నిబంధనలతో ఈ కొత్త రెసిడెన్సీ పర్మిట్‌ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఫ్రాన్స్‌లో విదేశీయులకు నివాసార్హత కల్పించే కొత్త రెసిడెస్సీ పర్మిట్ ముసాయిదా బిల్లును వచ్చే ఏడాది పార్లమెంట్‌లో ప్రవేశపెటే అవకాశం ఉందని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఓలీవియేర్ డుసో తెలిపారు. వలసల పట్ల ఫ్రాన్స్ ప్రజల సందేహాలు, మార్కెట్ అవసరాల మధ్య సమతౌల్యం సాధించేందుకు తాము ప్రయత్నించామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వానికున్న వాస్తవికదృష్టిని ఈ బిల్లు ప్రతిబింబిస్తోందని మంత్రి పేర్కొన్నారు.

ఫ్రాన్స్‌తో పాటూ ఐరోపాలోని అనేక దేశాలు కార్మికులు, ఉద్యోగుల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. వలసలను ప్రోత్సహించేందుకు చట్టాల్లో పలు సంస్కరణలు చేపడుతున్నాయి. అయితే.. వలసల అంశం సున్నితమైనది కావడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక.. ఐరోపాలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన జర్మనీ.. విదేశీ వర్కర్లను పెద్ద సంఖ్యలో దేశంలోకి ఆహ్వానించాలని ఆ దేశ ఛాన్సలర్ ఓలాఫ్ షల్జ్ ఈ నెల మొదట్లో ఓ సమావేశంలో అభిప్రాయాలు. మహిళలు, వయసుపైబడిన వాళ్లు కూడా సులువుగా ఉపాధి పొందేలా నిబంధనలు రూపొందించాలన్నారు. భవిష్యత్తులో పింఛను వ్యవస్థలో సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-12-23T16:25:43+05:30 IST